రిలయెన్స్-వయాకామ్ 18-సోనీ ఒప్పందం కథ ముగిసినట్టేనా?

0
825

రిలయెన్స్ యాజమాన్యంలోని, వయాకామ్18 కు, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ కు మధ్య ఒప్పందం దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపు అయిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా అందిన వార్తల ప్రకారం ఆ ఆలోచనకు తెరపడింది. ఇద్దరూ విముఖత వ్యక్తం చేయటం వలన ఆ ఆలోచన విరమించుకున్నారు.

మొదట్లో ఒక రకమైన ప్రచారం జరిగింది. రిలయెన్స్ స్థాయికి మీడియా, ఎంటర్టైన్మెంట్ వ్యాపారం చాలా చిన్నదని, అందుకే కొన్నేళ్లక్రితం రాఘవ్ బహల్ దగ్గర కొనుగోలు చేసిన ఆ వ్యాపార ఆస్తులను వదిలించుకోవాలని రిలయెన్స్ ఆలోచిస్తున్నదనేది ఆ వార్తల సారాంశం. కొన్నాళ్ళకు అందరూ ఆ వార్తను మరచిపోయారు. అలా మరచిపోయారని అనుకుంటున్న సమయంలోనే సోనీకి రిలయెన్స్ అమ్మజూపుతున్న ధర నచ్చలేదన్న వార్తలు వచ్చాయి.

ఆ రెండు సంస్థలు చర్చించుకుంటున్నాయన్న సంగతి కూడా అంతా మరచిపోయారు. కానీ అప్పుడే మళ్ళీ ఒక వార్త గుప్పుమంది. సెప్టెంబర్ ఆఖరుకల్లా ఒప్పందం మీద సంతకాలవుతాయంటూ వార్తలు వచ్చాయి. రెండూ కలిస్తే ఎలాంటి మార్పులు వస్తాయోనన్న విషయం మీద పెద్ద ఎత్తున  ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కానీ సెప్టెంబర్ ఆఖరు రానూ వచ్చింది, పోనూ పోయింది. ఎలాంటి ఒప్పందమూ జరగలేదు.

ఇప్పుడు మొత్తానికి ఒక వార్త రానే వచ్చింది. రిలయెన్స్ మనసు మార్చుకుందని, రెండు సంస్థల డిజిటల్ వేదికలైన వూట్, వూట్ సెలెక్ట్, సోనీ లైవ్ కార్యకలాపాలమీద యాజమాన్యపు నియంత్రణ హక్కు కోరుకోవటం వల్లనే అలా జరిగిందని. రిలయెన్స్ కు అకస్మాత్తుగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగం మీద ప్రేమ పెరిగిందని, సోనీ అందుకు ససేమిరా అన్నదని తెలిసింది.

జియో వ్యాపారంలో మీడియా, ఎంటర్టైన్మెంట్ కు ఎంతో ప్రాధాన్యముంది కాబట్టే ఇలా బెడిసికొట్టిందని తెలుస్తోంది. డిజిటల్ మీడియా వ్యాపారం ఎదగటానికి రిలయెన్స్ చాలా దూకుడుగా పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. చాలా  ప్రొడక్షన్ హౌస్ లు, కంటెంట్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ జియోని సంప్రదించటం మొదలైంది. అలాంటి భాగస్వామ్యాలకు అండగా నిలవటానికి ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఈ వార్తకు తగిన ఆధారాలు దొరికాయి కాబట్టి మీడియా ఇక సోనీ ఒప్పందం గురించి మరిచిపోక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here