ఇక ఎంఐబి పరిధిలో ఒటిటి, డిజిటల్ న్యూస్ పోర్టల్స్

0
596

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎంతో కాలంగా ఎదురుచుస్తున్న నియంత్రణ ఇప్పుడు అధికారికంగా ఆ శాఖ పరిధిలోకి వచ్చింది. ఎలాంటి నియంత్రణాలేకుండా కొనసాగుతున్న నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ తదితర ఒటిటి వేదికలు, వివిధ పత్రికలు, టీవీ చానల్స్, కొన్ని ఇఅతర సంస్థలు, వ్యక్తులు నడిపే డిజిటల్ న్యూస్ పోర్టల్స్ ఇకమీదట సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయి. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేసే బాధ్యత ఈ మంత్రిత్వశాఖకే ఉంటుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.
డిజిటల్ మీడియా లేదా ఆన్ లైన్ మీడియాగా పిలుచుకునే ఈ మాధ్యమంలో సినిమాలు, ఆడియో విజువల్ కార్యక్రమాలు, వార్తలు, కరెంట్ ఎఫైర్స్ ఉండగా ఇవన్నీ ఇప్పుడు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అజమాయిషీలో ఉంటాయి. ఇప్పటివరకూ వీటి నియంత్రణలు ఎలాంటి చట్టాలు గాని, స్వయం ప్రతిపత్తిగల సంస్థ గాని లేకపోవటం ఒక లోపంగా ఉండేది. అందువలన వీటిలో హద్దుమీరినతనం తరచు కనబడుతున్నట్టు ఫిర్యాదులు అందుతూ వచ్చాయి.
ప్రస్తుతం పత్రికలలో అంశాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తూ ఉండగా న్యూస్ చానల్స్ మీద స్వీయ నియంత్రణలో భాగంగా న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ పనిచేస్తోంది. ప్రకటనల నియంత్రణకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సినిమాల పర్యవేక్షణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) ఉన్న సంగతి తెలిసిందే.
మోదీ ప్రభుత్వం మీడియా స్వేచ్ఛ మీద ఎలాంటి ఆంక్షలూ పెట్టబోదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖామంత్రి పదే పదే చెబుతూ వచ్చారు. అయితే మితిమీరిపోతున్న ఒటిటి వంటి వేదికలను కొంతయినా అదుపులో పెట్టటానికి కొతమేరకు నియంత్రణ అవసరమని అన్నారు. ఇప్పుడు అందుకు అనుగుణంగానే తమ మంత్రిత్వశాఖ పరిధిలో చేర్చామన్నారు. త్వరలోనే నియమావళి వెల్లడించే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here