ఒటిటి నియంత్రణ మార్గదర్శకాలు సిద్ధం: కేంద్రమంత్రి

0
670

రోజురోజుకూ ఒటిటి వేదికలమీద నియంత్రణ గురించి మాట్లడుకోవటం ఎక్కువవుతోంది. ఒటిటి కార్యక్రమాల మీద విమర్శలు పెరిగేకొద్దీ ప్రభుత్వం మీద వత్తిడి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ రాజ్యసభ జీరో అవర్ లో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఒటిటి నియంత్రణకు మార్గదర్శకాలు దాదాపుగా సిద్ధమయ్యాయని, త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఇలా ఉండగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( ఐఎ ఎంఎఐ) మాత్రం స్వీయనియంత్రణ మార్గదర్శకాలు సిద్ధం చేసుకున్నామని చెబుతోంది.
ఎకనమిక్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం స్వీయనియంత్రణ మార్గదర్శకాల అమలుకోసం ఒటిటి వేదికల సంఘం విధివిధానాలు తయారు చేసుకుంది. “ మార్చి, ఏప్రిల్ నెలల్లో వీటి అమలును తనిఖీ చేసుకుంటూ ఆగస్టు నాటికల్లా పూర్తి స్థాయి లో నియమావళి అమలు చేస్తాం” అని ఐ ఎ ఎం ఎ ఐ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కమిటీ ఉపాధ్యక్షులు గౌర్వ రక్షిత్ ప్రకటించారి. తాజా నియమనిబంధనల అమలు ప్రక్రియలో ప్రభుత్వ భయాలన్నిటికీ సమాధానం ఉందన్నారు.
ఇప్పుడున్న ప్రధానమైన ఒటిటి వేదికలలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియీ, జీ5, వూట్, సోనీలైవ్, ఈ పత్రం మీద సంతకాలు చేయగా, ఎం ఎక్స్ ప్లేయర్, డిస్నీ+హాట్ స్టార్ ఇంకా సంతకాలు చేయాల్సి ఉంది.
గత నవంబర్ లో ఒటిటి పరిశ్రమ, ఐ ఎ ఎం ఎ ఐ కలసి ఉమ్మడిగా ఒక ముసాయిదా నియమావళి రూపొందించు కున్నాయి. అంతకుముందే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ సంస్థ ప్రతిపాదించిన స్వీయనియంత్రణను త్రోసిపుచ్చింది. నాన్-న్యూస్ చానల్స్ పెట్టుకున్న బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్, న్యూస్ చానల్స్ పెట్టుకున్న న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ నియమాలకు అనుగుణంగా ఒటిటి వేదికల స్వీయ నియంత్రణ నియమాలు కూడా ఉండాలని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
అయితే, ఐ ఎ ఎం ఎ ఐ ప్రతిపాదించిన వ్యవస్థ అస్పష్టంగా ఉందని, చట్టం నిషేఢించిన ప్రసారాంశాల మీద వ్యవహరించాల్సిన తీరు విషయంలో తగిన జాగ్రత్తలు లేవని, అందులోని కమిటీ సభ్యుల నియామకంలో అందుకు సంబంధించినవారే ఉండటం వలనసలు లక్ష్యం నెరవేరకపోవచ్చునని సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ లోక్ సభకు తెలియజేశారు. ఒటిటి వేదికలలో అందుతున్న అనేక కార్యక్రమాల మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని, ఈ క్రమంలో ప్రభుత్వం ఐఎఎంఎఐ సహా వివిధ ఒటిటి వేదికల నిర్వాహకులతో సమావేశాలు జరిపి చర్చించిందని కూడా మంత్రి తెలియజేశారు. 2020 ఆగస్టులో తాము స్వీయనియంత్రణ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వానికి తెలియజేశారని, అయితే నవంబర్ లో వెలువరించిన నియంత్రణ విధానం ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు.
ఒటిటి వేదికలను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోకి తీసుకువచ్చినప్పటినుంచి వీటి మీద సెన్సార్ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఉలిక్కిపడిన ఒటిటి వేదికలు స్వీయనియంత్రణ వైపు మొగ్గు చూపినా, అది పకదబందీగా లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అదే సమయంలో వివిధ కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం, ఆయా వేదికలకు సంబంధించిన ఫిర్యాదులు రావటం మొదలైంది. భారతదేశంలో 40కి పైగా ఒటిటి వేదికలుందగా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాండవ్, సేక్రెడ్ గేమ్స్, ఎ సూటబుల్ బాయ్ లాంటివి ప్రత్యేకంగా ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కున్నాయి.
ఒక వివాదం తరువాత మరో వివాదం చుట్టుముట్టడంతో అవి ఎఫ్ ఐ ఆర్ ల నమోదు వరకూ వెళ్లాయి. దీంతో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మరో రెండు మంత్రిత్వశాఖల సహాయం కూడా తీసుకొని నియమనిబంధనలు రూపొందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. స్వీయ నియంత్రణనే కట్టుదిట్టం చేస్తారని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చినా, ఆ అవకాశం లేదని ఇప్పుడు స్పష్టమైంది. దాదాపు పూర్తికావచ్చిందని చెబుతున్న నియమావళి త్వరలోనే ప్రకటిస్తామని స్వయానా మంత్రి లోక్ సభలో ప్రకటించటంతో ఒటిటి ల మీద ఉక్కుపాదం తప్పకపోవచ్చునని తేలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here