దగ్గరపడ్డ కొత్త టారిఫ్ అమలు తేదీ: బ్రాడ్ కాస్టర్లలో గుబులు

0
1015

కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు చేయటానికి బ్రాడ్ కాస్టర్లకు బొంబాయ్ హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులో నాలుగు వారాలు గడిచిపోయాయి. గడువు ప్రకారం ఆగస్టు 12 నాటికి ట్రాయ్ చెప్పిన పే చానల్ ధరలు అమలు చేయాల్సి ఉండగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా లిస్ట్ కాలేదు. లిస్ట్ అయ్యాక విచారణకు చేపట్టి బొంబాయ్ హైకోర్టు తీర్పు మీద స్టే వస్తే తప్ప బ్రాడ్ కాస్టర్లకు ఊరట ఉండదు. అలా జరగని పక్షంలో ట్రాయ్ ఆదేశాలలో బొంబాయ్ హైకోర్టు ఆమోదించిన అంశాలకు అనుగుణంగా కొత్త ధరలు ప్రకటించటం, బొకేలు తయారుచేయటం, తాజాగా రిఫరెన్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫర్ (ఆర్ ఐ ఒ) ల మీద పంపిణీ సంస్థలతో సంతకాలు చేయించటం చకచకా జరిగిపోవాలి. అందుకే బ్రాడ్ కాస్టర్లలో గుబులు మొదలైంది.
పే చానల్స్ ధరల మీద టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆంక్షలు విధిస్తూ జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) కు బొంబాయ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో సుప్రీంకోర్టులో ఊరట దొరకవచ్చునన్న ఆశతో జులై 14న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో లిస్ట్ అవుతుందని భావించిన బ్రాడ్ కాస్టర్లకు నిరాశే ఎదురైంది. రెండు వారాలు దాటినా ఇంకా లిస్ట్ కాలేదు. మరో రెండు రోజులు కోర్టు సెలవులు పోను 10 రోజులే మిగిలి ఉంటుంది. అందుకే ఇప్పుడు బ్రాడ్ కాస్టర్లలో గందరగోళం ఏర్పడింది.
రాజ్యాంగంలోని ఆర్టికిల్ 19(2) కు బొంబాయ్ హైకోర్టు సరైన భాష్యం చెప్పలేదని బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (ఐబిఎఫ్) ఈ పిటిషన్ లో వాదించింది. భావప్రకటనాస్వేచ్ఛను ఒక్కో స్థాయిలో ఒక్కో విధంగా పరిగణిస్తున్నారని అభ్యంతరం చెప్పింది. బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమ వ్యాపార హక్కును కాలరాస్తూ ధరలను నియంత్రిస్తున్నారని పేర్కొంది.

ట్రాయ్ చెప్పిన దాన్ని బొంబాయ్ హైకోర్ట్ గుడ్డిగా ఆమోదించిందని, ట్రాయ్ ఇచ్చిన వివరణపూర్వకమైన మెమొరాండమ్ లో అంశాలను సరిగా అధ్యయనం చేయలేదని, అసలు ట్రాయ్ వాదనకు ఏదైనా ప్రాతిపదిక ఉన్నదా అనే విషయం కూడా చూదలేదని ఆ పిటిషన్ లో ఐబిఎఫ్ పేర్కొంది. గరిష్ఠ చిల్లర ధరను రూ.19 నుంచి 12 కు తగ్గించటానికి అసలు ఎలాంటి ప్రాతిపదికాలేదని ఆ పిటిషన్ లో పేర్కొంది.

బొకే తయారీమీద ఆంక్షలు పెట్టటంలో హేతుబద్ధతను ట్రాయ్ చెప్పలేకపోయిందని కూడా ఐబిఎఫ్ ఆరోపించింది. ప్రధాన టారిఫ్ ఆర్డర్ లో లేకపోయినప్పటికీ బొకేల విషయంలో జంట షరతులను మళ్లీ ప్రవేశపెట్టిందని కూడా తప్పుపట్టింది. బొంబాయ్ హైకోర్టులో ట్రాయ్ కి వ్యతిరేకంగా టారిఫ్ ఆర్డర్ ను సవాలు చేసినవారిలో ఐబిఎఫ్ తోబాటు ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ గిల్డ్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, వయాకామ్ 18. సోనీపిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఉన్నాయి. 1997 నాటి ట్రాయ్ చట్టంలోని సెక్షన్ 11 కు రాజ్యాంగ బద్ధత లేదని, ఎన్టీవో 1.0, ఎన్టీవో 2.0 చెల్లబోవని ఈ సంస్థలు బొంబాయ్ హైకోర్టులో వాదించాయి

ఈ మూడింటినీ రాజ్యాంగ వ్యతిరేకమైనవిగా గుర్తించి రద్దు చేయాలని బ్రాడ్ కాస్టర్లు కోరారు. అయితే, ఎన్టీవో 2.0 లోని జంట షరతులలో రెండవ అంశాన్ని తప్ప మూడు అంశాలనూ బొంబాయ్ హైకోర్ట్ సమర్థించింది. దీంతో తప్పనిసరిగా పే చానల్ ధరలు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సుప్రీంకోర్టులో ఊరట పొందటానికి జులై 14న పిటిషన్ దాఖలు చేశారు. ఆగస్టు 12 కల్లా కొత్త టారిఫ్ అమలు చేయాల్సి ఉండగా ఈ లోపు స్టే వస్తుందో రాదోనన్న భయం బ్రాడ్ కాస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here