కొత్త టారిఫ్ ముప్పు: కేబుల్ రంగం ఐక్యపోరాటమే పరిష్కారమార్గం

0
2165

డిజిటైజేషన్ తరువాత కేబుల్ బిల్లు పెరిగి చందాదారులు, వాటా తగ్గి ఆపరేటర్లూ, ఎమ్మెస్వోలూ నష్టపోతే బాగా లాభపడ్డవారు బ్రాడ్ కాస్టర్లు. కోట్లు ఖర్చుపెట్టి డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకొని, కొత్త టెక్నాలజీని ఎమ్మెస్వోలు అమలు చేసినప్పుడు ఇంటింటికీ తిరిగి బాక్సులు పెట్టుకునేలా నచ్చజెప్పింది ఆపరేటర్లు. టారిఫ్ ఆర్డర్ రాగానే పెరిగిన కొత్త బిల్లుకు చందాదారులను ఒప్పించింది ఆపరేటర్లు. ఒక్క కనెక్షన్ కూ వదలకుండా ఎమ్మెస్వోలు వసూళ్ళు చేసి పంపితే లాభపడింది పే చానల్ బ్రాడ్ కాస్టర్లే.

ట్రాయ్ నిర్వాకం వల్లనే చందాదారులమీద భారం పెరిగిందని విమర్శలు వస్తే రెండో టారిఫ్ ఆర్డర్ తెచ్చి ఆ భారం తగ్గిస్తానంటూ ట్రాయ్ నానా హడావిడి చేసింది. భారం తగ్గించాల్సింది బ్రాడ్ కాస్టర్ల ధరలు తగ్గించటం ద్వారా అనే విషయం కంటే ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు వాటా వచ్చే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు మీద వేటు వేసింది. 100 చానల్స్ కు రూ. 130 ప్లస్ టాక్స్ ఉంటే దాన్ని 200 చానల్స్ కు పెంచింది. అదనంగా చానల్స్ తీసుకున్నవాళ్ళు ఇచ్చే డబ్బు కూడా రాకుండా చేసింది. పైగా. రెండో కనెక్షన్ తీసుకునేవాళ్ళ దగ్గర 40% ఫీజుతో సరిపెట్టుకోవాలని చెప్పింది. ఒకే ఇంట్లో జనం రెండు టీవీలు చూస్తుంటే వాళ్ళు చూసే పే చానల్స్ చందా తగ్గించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులో కోత కోయటమంటే కేబుల్ పరిశ్రమను దెబ్బతీయటమే.

పే చానల్ చందాలు తగ్గించటానికే రెండో టారిఫ్ ఆర్డర్ అని చెప్పుకున్న ట్రాయ్ ఈ పద్దెనిమిది నెలలపాటు నడిపిన నాటకం ఫలితం ఇప్పుడెలా ఉన్నదో చూశారు కదా? బొకేలో ఇవ్వాలనుకుంటే చానల్ ధర రూ.12 మించకూడదు అని చెప్పటం వలన ధరలు దిగివస్తాయని ట్రాయ్ నమ్మించింది. కానీ బ్రాడ్ కాస్టర్లు చేసిందేంటి? బాగా డబ్బు తెచ్చిపెట్టే లీడర్ ఛాన్సల్ ధర భారీగా పెంచి వాటిని అ లా కార్టే పద్ధతిలో ఇస్తామని చెప్పేశారు. ఇప్పటికే ధరలు ప్రకటించిన సోనీ, జీ, స్టార్ ఛానల్స్ దాదాపు ఒకే విధంగా వ్యవహరించాయి. తెలుగు ప్రేక్షకులు చూసే జీ తెలుగు, స్టార్ మా చానల్స్ ను దృష్టిలో పెట్టుకొని పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది.

జీ తెలుగు కు గతంలో గరిష్ఠ చిల్లర ధర రూ. 19 కాగా, జీ సినిమాలు రూ.10. తెలుగులో జీ గ్రూప్ చానల్స్ ఈ రెండే కాబట్టి మరో 8 ఇతర భాషల చానల్స్ కూడా కలిపి మొత్తం 10 చానల్స్ రూ.20 కి ఇస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జీ తెలుగు అ లా కార్టే ధర రూ.22 తప్పనిసరిగా విడిగా మాత్రమే అందుబాటులో ఉంటుంది. రూ.4.50 చెల్లించి జీ సినిమాలు కూడా విడిగా తీసుకోవచ్చు. లేదా మరికొన్ని ఇతర భాషల జీ చానల్స్ కూడా కలిపి ఇస్తున్న రూ.5 బొకే తీసుకుంటే జీ చానల్స్ కు అయ్యే మొత్తం బిల్లు రూ. 26.50 లేదా రూ.27 అవుతుంది. కాబట్టి గతంలో జీ చానల్స్ బొకేలో తెలుగు ప్రేక్షకులు చెల్లించిన మొత్తం రూ. 20 బదులు ఇప్పుడు రూ.27 చెల్లించాల్సి వస్తుంది. అంటే 35% మేరకు ఒక్క జీ చానల్స్ కే బిల్లులో పెరుగుదల కనబడుతోంది.స్టార్ మా చానల్స్ విషయానికొస్తే, ప్రధాన చానల్ స్టార్ మా ధర గతంలో ఉన్న రూ.19 నుంచి ఇప్పుడు రూ.23 కు పెరిగింది. మా మూవీస్ ఇంతకు ముందు రూ.10 ఉండగా ఇప్పుడు గరిష్ఠంగా అవకాశమిచ్చిన రూ.12 ను వాడుకుంటూ ఇంకో రూ.2 పెంచారు. అలాగే స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు గతంలో రూ.19 ఉండగా ఇప్పుడది కూడా రూ. 23 కు పెరిగింది. గతంలో స్టార్ తెలుగు పాకేజ్ మొత్తం ధర రూ.63 కాగా బొకే రూపంలో అది రూ. 39 కి అందేది. అందులో మా గోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్, నాలుగు స్పోర్ట్స్ ఛానల్స్ , నేషనల్ జాగ్రఫిక్, ఎన్ జీ వాల్డ్ ఉండేవి. అవే ఛానల్స్ కావాలంటే ఇప్పుడు స్టార్ మా (23), స్టార్ స్పోర్ట్స్ 1(23), స్టార్ స్పోర్ట్స్ 2 (10), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (19) తోబాటు ఎస్ వి పి లైట్ బొకే (12) కలిపి మొత్తం రూ.87 కట్టాలి. అంటే, ధర ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువైంది. బాగా తగ్గించుకోవాలన్నా, స్టార్ మా (23), స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు (19) తోబాటు ఎస్ వి పి లైట్ (12) తీసుకుంటే రూ.54 తో సరిపెట్టుకోవచ్చు. అయినా సరే, దాదాపు 40% బిల్లు పెరిగినట్టే. ఈటీవీ, జెమిని తోబాటు ఇంకా మరికొన్ని చానల్స్ కూడా ఇదే బాటలో నడిచే ప్రమాదం కనబడుతూనే ఉంది. ఇలా బ్రాడ్ కాస్టర్ల ధనదాహం పెరిగితే జరగబోయేదేంటి? ఇప్పటికే డిజిటైజేషన్ వలన కొంత నష్టం జరిగితే, కరోనా కాలంలో కనెక్షన్లు పోగొట్టుకొని ఇంకొంత నష్టపోయాం. కొత్త టారిఫ్ ఆర్డర్ లో ఎక్కువ చానల్స్ ఇవ్వాల్సి రావటం, రెండో కనెక్షన్ కు డిస్కౌంట్ ఇవ్వటం వలన జరిగిన నష్టం ఒకటైతే ఇప్పుడు కొత్త బిల్లు భారం గురించి చందాదారులకు నచ్చజెప్పాల్సి రావటం మరో సమస్య. దీనివలన కనెక్షన్లు తగ్గితే శాశ్వత నష్టాలు తప్పవు. ఒకవైపు డీటీహెచ్, ఇంకోవైపు ఓటీటీ బెదిరిస్తూ ఉంటే కేబుల్ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

బ్రాడ్ కాస్టర్లు ఎవరికి వారే ఓటీటీ నడుపుతూ ఇవే ప్రసారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేట్టు చేస్తూ లీనియర్ టీవీ పంపిణీ చేసే ఎమ్మెస్వో వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. మనకు ప్రేక్షకులు తగ్గిపోయే పరిస్థితి ఉండగా మరింతగా ప్రేక్షకులను దూరం చేస్తూ అర్థం లేకుండా భారీగా ధరల పెరుగుదలకు పూనుకున్నారు. అందుకే బ్రాడ్ కాస్టర్ల ధనదాహాన్ని అడ్డుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కేబుల్ రంగం ప్రతినిధులు తక్షణమే సమావేశమై ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి వ్యూహ రచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ట్రాయ్ చెప్పిందేంటి? ఇప్పుడు జరిగిందేంటి? ఈ విషయంలో ఒకవైపు ట్రాయ్ మీద వత్తిడి తెస్తూనే మరోవైపు బ్రాడ్ కాస్టర్ల ధరల పెంపును నిరసించక పోతే మనకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ప్రజలకు, బ్రాడ్ కాస్టర్లకు మధ్య కీలకమైన స్థానంలో ఉన్న మన గురించి బ్రాడ్ కాస్టర్లు ఆలోచించకుండా ఇష్టమొచ్చినట్టు ధరలు నిర్ణయించి జనం మీద రుద్దమంటే కుదరదు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల కేబుల్ పరిశ్రమకు చెందిన ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు ఏకమై పోరాడాలి. జాయింట్ యాక్షన్ కి దిగటానికి ఒక పథకం రూపొందించు కోవటానికి సత్వరమే సమావేశం కావాలి. ఆలోచించండి.

మీ ఎం. సుభాష్ రెడ్డి ఎండీ,

బ్రైట్ వే కమ్యూనికేషన్స్అధ్యక్షుడు,

తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here