పోల్ టాక్స్ రద్దుకు కృషి చేస్తా: మంత్రి శ్రీనివాస గౌడ్ హామీ

0
862

కేబుల్ ఆపరేటర్లు ఎంతోకాలంగా అడుగుతున్న పోల్ టాక్స్ రద్దు వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సానుకూల నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, మద్యనియంత్రణ, ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం, సంస్కృతి, పురావస్తు శాఖల మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. సి ఎన్ సి గ్రూప్ ఆధ్వర్యంలో ఈ రోజు మూడు రోజుల కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2021 కు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో కేబుల్ రంగం ప్రజలను చైతన్యవంతులు చేయటంలో పోషించిన పాత్ర మరువలేనిదని, అడుగడుగునా తమతో కలిసి నడిచారని కేబుల్ రంగ ప్రముఖులు పలువురి పేర్లు ప్రస్తావిస్తూ ఆనాటి ఉద్యమ సమయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. సొంతగా ఎదిగి ఎంతోమందికి ఉపాధి కల్పించిన కేబుల్ రంగానికి ఎప్పటికీ ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంటాయన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ మార్పులకు అనుగుణంగా కేబుల్ రంగం ఎద గాల్సి ఉందని, ఇలాంటి టెక్నాలజీ ప్రదర్శనలకు హాజరై కొత్త విషయాలు తెలుసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని పోటీలో నిలదొక్కుకోవాలని హితవు పలికారు. సరైన సమయంలో ఇలాంటి ప్రదర్శనను ఏర్పాటు చేసి కేబుల్ రంగ భవిష్యత్తు లాభదాయకంగా ఉండాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న సి ఎన్ సి గ్రూప్ అధిపతి రామును ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ఎండీ శ్రీ సుభాష్ రెడ్డి మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథులను వేదికమీదికి ఆహ్వానించిన తరువాత ఆయన స్వాగతోపన్యాసం చేస్తూ, కేబుల్ రంగంలో వస్తున్న మార్పులను, వాటికి అనుగుణంగా కేబుల్ ఆపరేటర్లు కూడా మారుతున్న వైనాన్ని గుర్తు చేశారు. బ్రాడ్ బాండ్ వైపు మొగ్గుచూపితేనే భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని ఆపరేటర్లకు పిలుపునిచ్చారు. ఇలాంటి అవకాశాన్ని వాడుకొని కొత్త టెక్నాలజీని అర్థం చేసుకొని వాడుకోవాలన్నారు.
ప్రదర్శన నిర్వాహకుడు, సి ఎన్ సి గ్రూప్ అధిపతి శ్రీ రాము మాట్లాడుతూ, కోవిడ్ సంక్షోభం కారణంగా నిరుడు ప్రదర్శన ఏర్పాటు చేయలేకపోయామని, ఇప్పుడు ఊహించనంత స్పందన కనిపిస్తోందని, మిగిలిన రెండు రోజుల్లో మరింతమంది హాజరు కాబోతున్నారని అన్నారు. ఒకప్పుడు వీడియో కాసెట్లు అద్దెకిచ్చే వ్యాపారం చేసినవారు ఉండగానే ఆ అద్దె కాసెట్లతో కేబుల్ వ్యాపారం చేసిన వారు నిలదొక్కుకున్నారని, కాసెట్ల షాపులవాళ్ళు కనుమరుగయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లు బ్రాడ్ బాండ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు కదలకపోతే కనుమరుగవటం ఖాయమని హెచ్చరించారు.
తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ తొలినాళ్ళలో కేబుల్ రంగం నిలదొక్కుకున్న తీరును గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఈ రంగం అభివృద్ధికి కొత్తతరం కృషి చేయాలని కోరారు. ఒకప్పుడు కనెక్షన్లు పెంచుకుంటూ వచ్చిన ఆపరేటర్లు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురుకుంటున్నారని, అయితే కేబుల్ రంగం ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు జితేంద్ర మాట్లాడుతూ, పోల్ టాక్స్ సమస్యను ప్రస్తావించారు. ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు పోల్ టాక్స్ రద్దు చేస్తానని గతంలో వరంగల్ లో హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అదే విధంగా జీఎస్టీ పెనుభారంగా మారటం గురించి చెబుతూ అనేక పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఉండగా కేబుల్ రంగానికి విస్తరింపజేయటం ద్వారా లక్షలాది మంది ఆధారపడిన ఈ రంగం నిలదొక్కుకుంటుందన్నారు.
ఆపరేటర్ల ప్రతినిధి కోటి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయమలో కేబుల్ రంగం కీలకపాత్ర పోషించిందన్నారు. ఉద్యమానికి ఊతంగా నిలబడి ధూమ్ ధామ లను ప్రసారం చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చిందన్నారు. తెలంగాణ పట్ల చులకనభావంతో కార్యక్రమాలు ప్రసారం చేసిన చానల్స్ ను నిలిపివేసి ప్రజల మనోభావాలకు మద్దతుగా నిలిచిన ఘనత కూడా తెలంగాణ కేబుల్ ఆపరేటర్లదేనన్నారు. ఈ నేపథ్యంలో పోల్ టాక్స్ రద్దు హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ఎమ్మెస్వో కొల్లా కిశోర్ కుమార్ మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కేబుల్ ఆపరేటర్లు ఎప్పుడూ ముందుమటారన్నారు. ముప్పై ఏళ్ల కిందట దూరదర్శన్ ప్రసారాలు సైతం అందని ప్రాంతాలకు వాటిని అందించటంతో మొదలైన ప్రస్థానం కొనసాగుతూనే ఉందని, ఎన్ని అవాంతరాలు వచ్చినా, కేబుల్ పరిశ్రమ ఎప్పటికీ కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ మనుగడ సాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వరుసగా 9 వ విడత కేబుల్ ఎక్స్ పో నిర్వహిస్తూ కేబుల్ రంగానికి టెక్నాలజీని పరిచయం చేయటంలో ముందుంటున్న సి ఎన్ సి గ్రూప్ అధినేత రామును ఈ ప్రదర్శన సందర్భంగా కేబుల్ పరిశ్రమ తరఫున బ్రైట్ వే కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు ఎం. సుభాష్ రెడ్డి కేబుల్ పరిశ్రమ తరఫున మంత్రి శ్రీ శ్రీనివాస గౌడ్ చేతుల మీదుగా కేబుల్ రంగ ప్రముఖుల సమక్షంలో సత్కరించారు. కేబుల్ రంగం కోసం తాజా సమాచారాన్ని క్రమం తప్పకుండా వార్తలు, వ్యాసాల రూపంలో తెలుగులో అందిస్తూ వస్తున్న జర్నలిస్ట్ శ్రీ తోట భావనారాయణను కూడా ఇదే వేదికమీద మంత్రి చేత సత్కరింపజేశారు.
ఈ కార్యక్రమంలో జీటీపీఎల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మనోజ్ దూబే, కేబుల్ ఆపరేటర్ల సంఘాల నాయకుడు శ్రీ పమ్మి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కేబుల్ పరిశ్రమ ప్రతినిధులు కూడా ఈ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here