2లోగా సమస్యలు తీర్చండి: ట్రాయ్ ని డిమాండ్ చేసిన కేబుల్ రంగం

0
80

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) నిర్లక్ష్యం కారణంగా కేబుల్ రంగం దాదాపు రూ.600 కోటలమేరకు నష్టపోయిందని మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల ఫౌండేషన్ (ఎం సి ఒ ఎఫ్) ఆరోపించింది. అపరిష్కృతంగా మిగిలిపోయిన కేబుల్ రంగ సమస్యలను అక్టోబర్ 2 లోగా పరిష్కరించాలని ట్రాయ్ కి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు అల్టిమేటమ్ ఇస్తూ పౌండేషన్ అధ్యక్షుడు ప్రభు లేఖలు రాశారు. ప్రభుత్వం, ట్రాయ్ తగిన చర్యలు తీసుకోకపోతే లేబుల్ రంగం తనను తాను కాపాడుకోవటానికి ఏం చేయాలో నిర్ణయించుకుంటుందన్నారు.

ఎమ్మెస్వోలు ఏకపక్షంగా ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలను లోకల్ కేబుల్ ఆపరేటర్లమీద రుద్దుతున్న విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకోవాలని ప్రభు ఆ లేఖలో కోరారు. ఎమ్మెస్వోలు తమ పోర్టల్స్ ద్వారా ప్రీ పెయిడ్ విధానాన్ని బలవంతంగా రుద్దారని, ఆపరేటర్లు మాత్రం చాలా చోట్ల పోస్ట్ పెయిడ్ సర్వీస్ ఇవ్వాల్సి వస్తోందని గుర్తు చేశారు. అదే విధంగా బ్రాడ్ కాస్టర్లకు, కేబుల్ ఆపరేటర్లకు మధ్య ఆదాయ పంపిణీ నిష్పత్తిని నిర్దిష్టంగా నిర్వచించాల్సిన బాధ్యత ట్రాయ్ మీద ఉందన్నారు. అదే విధంగా సెట్ టాప్ బాక్స్ యాజమాన్యం మీద అసందిగ్ధత తొలగించాలని కూడా ట్రాయ్ ని డిమాండ్ చేశారు.

కీబ్రాడ్ కాస్టర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు గాని, స్టే గాని ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ట్రాయ్ రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవీ 2.0) ను అమలు చేయటానికి ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. ఇది చందాదారులను, కేబుల్ ఆపరేటర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు కుమ్మక్కై చందాదారులకు రకరకాల పాకేజ్ ల ట్రిక్కులతో అంటగడుతూ డబ్బు పిండుకుంటున్నారని, చిన్నా చితకా బ్రాడ్ కాసటర్లకు తగిన అవకాశమే ఇవ్వటం లేదని ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రభు ఆరోపించారు. ఈ క్రమంలో చందాదారు కోరుకోని చానల్స్ వలన కనీసం నెలకు రూ. 50 అదనంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. ఎన్టీవో 2.0 కేసు సందర్భంగా ట్రాయ్ వాదనలో కేబుల్ ఆపరేటర్లను కేవలం ఎమ్మెస్వోలకు, చందాదారులకు మధ్య ఒక లింక్ మాత్రమే అని అభివర్ణించటం ద్వారా ఆపరేటర్లను చాలా చిన్న చూపు చూసి తక్కువగా అంచనా వేసిందని అభ్యంతరం తెలియజేశారు. లక్షలాది ఇళ్ళకు ప్రసారాలు అందించే కీలకమైన స్థానంలో ఉన్న విషయం గుర్తు చేశారు. ఎమ్మెస్వోలు క్రమంగా చందాదారులమీద యాజమాన్యాన్ని కూడా లాక్కునే పరిస్థితులు కనబడుతున్నాయని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనివలన ఆపరేటర్లు నష్టపోయి ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు మాత్రమే లాభపడే పరిస్థితులు కనబడుతున్నాయన్నారు. పదికోట్ల ఇళ్ళకు సేవలందిస్తున్న కేబుల్ ఆపరేటర్లు దాదాపు 5 లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రభు తన లేఖలో గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల మీద దాదాపు 40 వేల కోట్ల వరకూ వెచ్చించిన కేబుల్ రంగం 40 కోట్లమందికి సేవలందిస్తూ ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సివన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ట్రాయ్ స్పందించని పక్షంలో కేబుల్ రంగం తగిన విధంగా స్పందించాల్సి ఉంటుందని ప్రభు ఆ లేఖలో హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here