పే చానల్స్ ధరల పెంపుపై ట్రాయ్ కి లీగల్ నోటీస్

0
1075

ఎన్ టీవో 2.0 అమలు పేరుతో బ్రాడ్ కాస్టర్లు తమ పే చానల్ ధరలు పెంచటాన్ని అడ్డుకోవాలని కోరుతూ తమిళనాడు డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ఈ రోజు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) కి లీగల్ నోటీస్ పంపింది. ట్రాయ్ 2020 జనవరి 1 న రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటించినప్పుడు తాము అండగా నిలబడి సామాన్యులకు తక్కువ ధరకు కేబుల్ టీవీ సేవలు అందించాలన్న నిర్ణయాన్ని సమర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా సంఘం గుర్తు చేసింది.

ఎన్ టీవో 2.0 జారీ చేయటంలో ట్రాయ్ కి తాము ఎలాంటి దురుద్దేశాలూ ఆపాదించటం లేదని స్పష్టం చేస్తూ, ఈ టారిఫ్ ఆర్డర్ ను తప్పుదారి పట్టిస్తూ బ్రాడ్ కాస్టర్లు ఆ స్ఫూర్తిని నీరు గార్చటం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని సంఘం పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా పే చానల్ ధరను అనూహ్యంగా పెంచటం వలన మొత్తం కేబులో పరిశ్రమతోబాటు చందాదారులు తీవ్రంగా ప్రభావితమవుతారని స్పష్టం చేసింది.

ఎన్ టీ వో 2.0 అమలు పేరుతో బ్రాడ్ కాస్టర్లు కొత్త ధరలతో రిఫరెన్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫర్ లు ప్రకటించటం తెలిసిందే. అయితే పెద్ద మొత్తంలో ధరలు పెంచటం ఈ వ్యవహారాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఇందులో డ్రైవర్ చానల్స్ గా భావించే జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ ను, స్పోర్ట్స్ చానల్స్ ను బాగా ధర పెంచి వాటిని ఆ లా కార్టే ధరలతో అందించేలా బొకేలు తయారు చేశారు. దీనివల్ల కేబుల్ టీవీ చందాదారు మీద సగటున 30 నుంచి 35% మేరకు అదనపు భారం పడుతుంది.

సంఘం తన లీగల్ నోటీసులో మరో విషయం కూడా గుర్తు చేసింది. “ ఈ బ్రాడ్ కాస్టర్లు తమ పే ఛానల్స్ లో అత్యధిక భాగాన్ని అదే ప్రేక్షకులకు ఓటీటీ ల ద్వారా కూడా అందజేయటాన్ని గమనించాలి. ఆలా చూసినప్పుడు ప్రేక్షకులకు ఓటీటీ లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటూ, కేబుల్ ద్వారా ఎక్కువ ధరకు తీసుకోవాల్సి వస్తోంది. దీనివలన చందాదారులు ఓటీటీ వైపు మొగ్గు చూపితే కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు బాగా నష్టపోతారు.” అని పేర్కొంది. ఇలా బ్రాడ్ కాస్టర్లు పెంచిన ధరలు సామాన్య ప్రజలు, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు భరించగలిగే స్థితిలో లేరని. ఇది వారికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు కూడా భంగం కలిగిస్తున్నదని తమిళనాడు డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ట్రాయ్ దృష్టికి తెచ్చింది. ఇలా ధరలు పెంచితే సామాన్యులు వినోదానికి దూరమవుతారని గుర్తు చేసింది. ఈ విధమైన ధరల పెంపు వలన చందాదారులు తమ భారాన్ని తగ్గించుకునే క్రమంలో టీవీ కి దూరమయ్యే ప్రమాదముందని, దీనివలన కేబుల్ రంగం దెబ్బతినటంతోబాటు ప్రభుత్వం వసూలు చేసుకుంటున్న 18% జీఎస్టీ ఆదాయానికి కూడా గండి పడుతుందన్న విషయం చాలా ముఖ్యమైనదాని సంఘం తన లీగల్ నోటీసులో ట్రాయ్ కి గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో ఎన్ టీ వో 2.0 లక్ష్యాన్ని తప్పుదారి పట్టించిన బ్రాడ్ కాస్టర్లు తమ కొత్త ఆర్ ఐ వో లను వెంటనే ఉపసంహరించుకునేలా ఆదేశించాలని తమిళనాడు డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ట్రాయ్ ని కోరింది. ఆలా చేయని పక్షంలో మొత్తం పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here