జీఎస్టీ ఇన్వాయిస్ మీద హైకోర్టులో కేరళ కేబుల్ ఆపరేటర్ల పిటిషన్

0
382

కేరళలో జీ ఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డిజిజిఐ) జారీచేసిన ఒక పత్రికాప్రకటన మీద కేబుల్ ఆపరేటర్లు తీవ్రంగా అసంతృప్తి చెందారు. కేబుల్ టీవీ చందాదారులు తప్పనిసరిగా తమ ఆపరేటర్ ను జీఎస్టీ ఇన్వాయిస్ ఇవ్వాల్సిందిగా పట్టుబట్టాలని కోరుతూ డిజిజిఐ ఈ మధ్య ఒక పత్రికాప్రకటన జారీచేయటం పట్ల కేబుల్ ఆపరేటర్లు ఆగ్రహంతో ఉన్నారు.

ఏడాదిలో మొత్తం టర్నోవర్ రూ. 20 లక్షలకు దాటనప్పుడు కేంద్ర జీఎస్టీ లేదా 2017 నాటి కేరళ జీ ఎస్టీ చట్టం కింద రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న విషయాన్ని స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. జీ ఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు ఇలాంటి పత్రికాప్రకటన జారీచేయటం ద్వారా పరోక్షంగా మొత్తం కేబుల్ ఆపరేటర్లందరూ జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని, జీ ఎస్టీ చెల్లించాలని చెప్పినట్టయిందన్నారు. అయితే, సీజీఎస్టీ చట్టం ప్రకారం ఆ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఈ పత్రికా ప్రకటన చందాదారుల్లో ఒక అయోమయ వాతావరణాన్ని సృష్టించిందని, కేబుల్ ఆపరేటర్లమీద ఒక ప్రతికూల ప్రభావం చూపి చందాదారుల దృష్టిలో చులకన భావం ఏర్పడేట్లు చేసిందని పిటిషనర్లు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం పన్ను ఎగవేసే దృష్టితోనే జీఎస్టీ ప్రస్తావన లేని ఇన్వాయిస్ లు ఇస్తున్నారనే అభిప్రాయం కలిగేందుకు ఈ పత్రికాప్రకటన దారితీసిందని కేబుల్ ఆపరేటర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పరిస్థితి తమ కేబుల్ వ్యాపార నిర్వహణను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. ఇలా చేయటం రాజ్యాంగం ఆర్టికిల్19 (1)(జి) కింద ప్రాథమిక హక్కులను నేరుగా ఉల్లంఘించటమేనని పిటిషనర్ ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here