ఆపరేటర్లమీద జీఎస్టీ పై కేరళ హైకోర్టు స్టే

0
852

కేబుల్ ఆపరేటర్ల నుంచి జీఎస్టీ ఇన్వాయిస్ డిమాండ్ చేయాలంటూ కేరళ కేబుల్ వినియోగదారులనుద్దేశించి జీఎస్టీ ఇంటలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ జారీ చేసిన పత్రికాప్రకటన కలకలం రేపింది. జూన్ 11న జారీ అయిన ఈ ప్రకటన మీద కేబుల్ ఆపరేటర్లు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ స్టే లభించింది.
కేబుల్ ఆపరేటర్లు తమ స్థూల వార్షిక టర్నోవర్ 20 లక్షల లోపు ఉండటం వలన సిజిఎస్టీ చట్టం లేదా కేరళ జీఎస్టీ చట్టం, 2017 పరిధిలోకి తాము వచ్చే అవకాశం లేదంటూ ఇద్దరు కేబుల్ ఆపరేటర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జీఎస్టీ అధికారులు జారీచేసిన పత్రికాప్రకటన ద్వారా పరోక్షంగా కేబుల్ ఆపరేటర్లందరూ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని చెల్లించాలనే అర్థం వస్తున్నదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
చట్ట ప్రకారం ఆ అవసరం లేకపొయినా అలాంటి ప్రకతన విడుదలచేయటం తగదని చెబుతూ, గతంలో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీ చేసిన అనేక నిబంధనలను ప్రస్తావించారు. లోకల్ కేబుల్ ఆపరేటర్లు కేవలం స్వతంత్ర సర్వీస్ ప్రొవైడర్లు మాత్రమేనని, ఎమ్మెస్వోలకు ఏజెంట్లు గాని, ప్రతినిధులుగాని కాదని స్పష్టం చేశారు.
మరోవైపు జీఎస్టీ శాఖ తమ పత్రికాప్రకటనను సమర్థించుకుంటూ, లోకల్ కేబుల్ ఆపరేటర్లు కేవలం ఎమ్మెస్వోల కలెక్షన్ ఏజెంట్లు మాత్రమేనని, అందువలన వారు టర్నోవర్ తో సంబంధం లేకుండా జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందేనని వాదిస్తోంది.
ఇరుపక్షాల వాదనలనూ సుదీర్ఘంగా విచారించిన అనంతరం మౌఖికంగా వ్యాఖ్యానిస్తూ, జీఎస్టీ శాఖ తనంతట తానుగా లోకల్ కేబుల్ ఆపరేటర్లు కేవలం ఎమ్మెస్వోలకు ఏజెంట్లు మాత్రమేనని నిర్థారించటం సమంజసం కాదని అభిప్రాయ పడింది. అలాంటి నిర్థారణ చట్టపరంగా జరగలేదన్న సంగతి కూడా ప్రస్తావించింది. మొత్తంగా జీఎస్టీ శాఖ జారీచేసిన పత్రికాప్రకటన కేబుల్ ఆపరేటర్లకు మాత్రం వర్తించటాన్ని నిలిపివేసింది. ఎమ్మెస్వోలకు వర్తింఫు మీద మాత్రం స్టే ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here