సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు ప్రసారాలు ఆగిపోయిన మలయాళీ న్యూస్ చానల్ మీడియావన్ ఆ తరువాత కొద్ది గంటలకే మళ్ళీ ప్రసారాలు ప్రారంభించింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా రెండు రోజులపాటు నిలుపుదలచేస్తూ కేరళ హైకోర్టు ఆదేశాలివ్వటంతో మీడియావన్ చానల్ కు ఊరట లభించినట్టయింది.
భద్రతా కారణాల దృష్ట్యా మలయాళీ న్యూస్ చానల్ ను నిషేధిస్తూ మంత్రిత్వశాఖ ఆదేశాలివ్వటంతో ఈ చానల్ ను అప్ లింక్ చేస్తున్న టెలిపోర్ట్ సంస్థ ప్లానెట్ కాస్ట్ మీడియా సొల్యూషన్స్ లిమిటెడ్ ఆ చానల్ ప్రసారాలు నిలిపివేసింది. అయితే, ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ మీడియావన్ సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. రెండు రోజులపాటు ప్రభుత్వ ఆదేశం అమలును నిలుపుదల చేస్తూ హైకోర్టు ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదావేసింది.
