జియో అనైతిక వ్యాపారాన్ని నిరసిస్తూ

0
499

27న కేబుల్ ఆపరేటర్ల చలో వికారాబాద్
వివిధ ప్రాంతాలలో జియో సంస్థ స్థానిక ఆపరేటర్లను కాదని నేరుగానో, లేదా డమ్మీ ఆపరేటర్ ద్వారానో వ్యాపారంలో దిగటం పట్ల కేబుల్ టీవీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్వతంత్ర ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్ల జెఎసి ఈ రోజు హైదరాబాద్ లో సమావేశమై అనేక సమస్యలమీద చర్చించింది. జియో అనైతిక వ్యాపారానికి నిరసనగా ఈ నెల 27న చలో వికారాబాద్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.
జియో సంస్థ తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి అడ్డదారులు తొక్కుతున్నదని ఈ రోజు జరిగిన సమావేశంలో ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు ఆరోపించారు. డమ్మీ ఆపరేటర్లను ప్రోత్సహించి ఎంతోకాలంగా ఈ వ్యాపారం మీద ఆధారపడేవారి పొట్టకొట్టాలనుకోవటం మీద పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయెన్స్ జియో ఇటీవల వికారాబాద్, మెదక్ లాంటి చోట్ల డమ్మీ పాయింట్లు వేయటాన్ని సమావేశం ఖండించింది.
కేబుల్ టీవీ ప్రేక్షకులు కూడా జియో తో బాటు దాని భాగస్వామ్యంలో పనిచేస్తున్న హాత్ వే, జిటిపిఎల్ లాంటి సంస్థల మోసాలను గుర్తించాలని సమావేశం పిలుపునిచ్చింది. వీళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి కార్పొరేట్ ఎమ్మెస్వోలు తాత్కాలికంగా ఆకట్టుకునే పాకేజీలతో ప్రజలను మభ్యపెట్టి ఆ తరువాత విపరీతంగా ధరలు పెంచే అవకాశముందని హెచ్చరించారు. కార్పొరేట్ ఎమ్మెస్వోల వలలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.
పే చానల్స్ చెల్లింపులు నిలిపేస్తాం
అందరూ పోటీపడేలా సమాన వేదిక కల్పించాలన్న డిజిటైజేషన్ సూత్రానికి పే టీవీ బ్రాడ్ కాస్టర్లు గండికొడుతున్న తీరు చాలా ప్రమాదకరమని సమావేశం అభిప్రాయపడింది. . ట్రాయ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, కనెక్టివిటీ ఆధారంగా కార్పొరేట్ ఎమ్మెస్వోలకు పే చానల్ టారిఫ్ లో రాయితీలు ఇస్తున్నారని, ఈ విధంగా స్వతంత్ర ఎమ్మెస్వోల వ్యాపారానికి, ట్రాయ్ నియమాలకు తూట్లు పొడుస్తున్నారని పలువురు ఆరోపించారు.
ఆరోగ్యకరమైన వ్యాపారం సాగకుండా దొడ్డిదారి ఒప్పందాలతో బ్రాడ్ కాస్టర్లు వివక్ష చూపటాన్ని సహించే ప్రసక్తే లేదని స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ విషయంలో బ్రాడ్ కాస్టర్లు తమ వైఖరి మార్చుకొని అందరినీ సమానంగా చూడకపోతే చెల్లింపులు నిలిపివేస్తామని కూడా సమావేశం హెచ్చరించింది. వినియోగదారులకు దగ్గరగా ఉంటూ సంతృప్తికరమైన సేవలందిస్తున్న తమను కాదని కార్పొరేట్ ఎమ్మెస్వోలకు, డిటిహెచ్ ఆపరేటర్లకు కొమ్ముకాస్తున్న పే బ్రాడ్ కాస్టర్లు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సమావేశం అనంతరం బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ఎండీ సుభాష్ రెడ్డి స్పష్టం చేశారు.
డిటిహెచ్ ని ప్రోత్సహిస్తున్న తెలుగుదేశంపై ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధినేత ఇటీవల తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తూ ప్రజలను కేబుల్ కనెక్షన్ కు బదులు డిటిహెచ్ తీసుకోవాల్సిందిగా పిలుపునివ్వటం మీద స్మార్ట్ వే అధిపతి కొల్లా కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చానల్స్ నిలిపివేయాల్సిందిగా కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలమీద వత్తిడి తెచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ విషయం మరిచిపోయి ఇలాంటి పిలుపు ఇవ్వటం దారుణమన్నారు.
దాదాపు మూడు దశాబ్దాలపాటు కేబుల్ రంగం మీద ఆధారపడి బతుకుతున్నవారి కడుపుకొట్టే విధంగా ప్రజలను రెచ్చగొట్టటం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే పోల్ టాక్స్ రద్దు విషయంలో సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే సమయంలో కేబుల్ రంగం ఎదుర్కుంటున్న అనేక సమయలను రెండు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెచ్చే విధంగా త్వరలో మహాగర్జన నిర్వహించే విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలిస్తుందన్నారు.
బ్రాడ్ బాండ్ వ్యాపారానికి సహకారం కోరతాం
కేబుల్ ఆపరేటర్ల నెట్ వర్క్ ద్వారా బ్రాడ్ బామ్ద్ వ్యాపారం చేసుకోవటానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరాలని సమావేశం నిర్ణయించింది. భారత ప్రభుత్వం త్వరలో ప్రకటించబోయే బ్రాడ్ కాస్టింగ్ పాలసీలో టీవీ పరిశ్రమకు మౌలికసదుపాయాల హోదా కల్పించబోతున్నట్టు ఇప్పటికే ముసాయిదాలో చెప్పటం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. బ్రాడ్ బాండ్ వ్యాపారానికి ఈ కొత్త విధానం ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడింది.
బ్రాడ్ బాండ్ పంపిణీకి సిద్ధంగా ఉండేలా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవటానికి కేబుల్ రంగం ఎదురుచూస్తున్న విషయాన్ని సమావేశం గుర్తు చేసుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్, తెలంగాణలో టి-ఫైబర్ సంస్థలు కూడా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయాలని సమావేశం రెండు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.
ఇటీవల మృతి చెందిన కేబుల్ రంగ ప్రముఖుడు హాత్ వే రాజశేఖర్, కడెం ఎమ్మెస్వో శ్రీనివాస్ మృతికి సంతాప సూచకంగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here