జియో ఫైబర్ కు 20 లక్షల కొత్త కనెక్షన్లు

0
848

నిరుడు వై ఫై బ్రాడ్ బాండ్ తో బాటే ఫిక్సెడ్ లైన్ బ్రాడ్ బాండ్ కూడా గణనీయంగా పెరిగింది. కోవిడ్ వ్యాప్తి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తోబాటు ఒటిటి వేదికలు ప్రాచుర్యం పొందటమే దీనికి కారణమని తెలిసిందే. కొన్నేళ్ళుగా నామమాత్రపు ఎదుగుదల నమోదు చేసుకుంటూ వచ్చిన లాండ్ లైన్ ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్ ఒక్క సారిగా బాగా పుంజుకుంది. అదే సమయంలో రిలయెన్స్ వారి జియో ఫైబర్ ఈ సరికొత్త ట్రెండ్ ను బాగా వాడుకుంది. గత ఏడాది కాలంలో 20 లక్షలకు పైగా కొత్త కనెక్షన్లు సంపాదించుకోగలిగింది. గురువారం (24న ) జరిగిన సంస్థ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముఖేశ్ అంబానీ స్వయంగా ఈ విషయం వెల్లడించారు.
“ప్రపంచ వ్యాప్తంగా గత 15 నెలల కాలం అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో భౌతికంగా పనిచేయటం ఎంతో కష్టసాధ్యంగా మారింది. జియో ఆప్టికల్ ఫైబర్ ఆధారిత జియో ఫైబర్, గిగా బిట్ స్పీశ్, ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్ సేవలకు కూడా ఇలాంటి సవాళ్లు అనేకం ఎదురయ్యాయి. లాక్ డౌన్, సంబంధిత ఆంక్షల కారణంగా ఆప్టికల్ ఫైబర్ లైన్ వేయటం, భవనాలకు కనెక్టివిటీ ఇవ్వటం, ఇళ్లలో ఇన్ స్టాల్ చేయటం దేశవ్యాప్తంగా మేం ఊహించిన దానికంటే బాగా నెమ్మదించాయి” అన్నారు ముఖేశ్ అంబానీ.
అన్ని కష్టాల మధ్య నిరుడు 20 లక్షల కొత్త కనెక్షన్లు సమకూర్చుకోవటంతో ఇప్పుడు జియో ఫైబర్ కనెక్టివిటీ 30 లక్షలకు పెరిగింది. భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఫిక్సెడ్ బ్రాడ్ బాండ్ ప్రొవైడర్ గా జియో ఫైబర్ స్థానం సంపాదించుకోగలిగింది. ఇప్పుడిప్పుడే భారత్ కోవిడ్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో జియో ఫైబర్ సేవలు మరింత వేగం పుంజుకుంటాయని రిలయెన్స్ అధినేత ఆశాభావం వ్యక్తం చేశారు.
జియో ఫైబర్ లో డేటా వినియోగం నిరుటితో పోల్చుకుంటే మూడున్నర రెట్లకంటే ఎక్కువ పెరిగింది. జియో 2016 లో బ్రాడ్ బాండ్ మార్కెట్లో ప్రవేశించింది. ప్రస్తుతం 100 కు పైగా నగరాలు, పట్టణాలలో కోటీ 20 లక్షల ఇళ్లలో జియో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. 5జి కి ఎదగటానికి కూడా జియో సన్నద్ధంగా ఉందని ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అంతర్జాతీయ భాగస్వామౌలతో కలసి 5జి అనుకూల వాతావరణ కల్పనలో నిమగ్నమయ్యామన్నారు. అనేక 5జి పరికరాల తయారీలో పాలుపంచుకోవటంతోబాటు భారత్ ను 2జి విముక్తం చేసి 5జి యుక్తం చేయటం మీద దృష్టి సారించామన్నారు.
జియో ఫైబర్ ఇటీవలే కొత్త పొస్ట్ పెయిడ్ ప్లాన్స్ కూడా ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ వాడకం దారులు ఇంటర్నెట్ కావాలంటే ఇన్ స్టలేషన్ చార్జీలు గాని, సెక్యూరిటీ డిపాజిట్ గాని కట్టనవసరం లేదని స్పష్టం చేసింది. పోస్ట్ పెయిడ్ విభాగంలో ఆరు నెలల, ఏడాది ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. నెలకు రూ.399 నుంచి ఈ ప్లాన్స్ మొదలవుతాయి. కస్టమర్లను కాపాడుకునే క్రమంలో హై ఎండ్ ప్లాన్స్ తీసుకునేవారికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో చందాలు ఉచితంగా అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here