హాత్ వే రాజశేఖర్ హఠాన్మరణం

0
684

హాత్ వే రాజశేఖర్ గా అందరికీ, వెంకటసాయి రాజశేఖర్ గా మరికొందరికి బాగా పరిచయమున్న చెలికాని రాజశేఖర్ శనివారం ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ప్రధాన స్రవంతి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.

విజయనగరం జిల్లా సీతానగరంలో 1968 ఏప్రిల్ 4 న  జన్మించిన రాజశేఖర్  తొలిసారి విశాఖపట్నం లో కేబుల్ రంగంలోకి అడుగుపెట్టారు. కొద్ది కాలంలోనే ఆయన ఎదుగుతూ హైదరాబాద్ లో హాత్ వే లో చేరారు.  హాత్ వే ను రాష్ట్రంలో ప్రముఖ నెట్ వర్క్ గా తీర్చిదిద్దారు.  హాత్ వే రీజినల్ హెడ్ గా ఉన్నకాలంలో హాత్ వే ను తిరుగులేకుండా చేయడంలో ఆయనదే. నంబర్ వన్ ఎమ్మెస్వోగా నిలపటంతో  ఆయన ఉన్నతాధికారుల అభిమానం పొందుతూ ఆ స్థానంలో కొనసాగారు. హాత్ వే నుంచి వైదొలగిన తరువాత ఆయన తన సొంత నెట్ వర్క్ వెంకట సాయి మీడియా మీద దృష్టి సారించారు.

 కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఎమ్మెస్వో ల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం శ్రమించారు. ప్యాకేజి ల పేరుతో చానల్స్ ఎమ్మెస్వో ల ని వేధించిన సమయంలో రాజశేఖర్ అనేక ఆందోళనలు చేపట్టారు. మధ్యే మార్గంగా ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు  లాభపడేలా చూశారు. జెమినీ పే చానల్ గా చేస్తున్న అరాచకాలమీద పెద్ద ఎత్తున పోరాటం నడపటంలో ఆయనదే కీలపాత్ర. ఒక దశలో మాటీవీ తో వివాదం ముదిరినప్పుడు మా టీవీ యాజమాన్యం ప్రేక్షకులను రెచ్చగొట్టి హాత్ వే మీదకు ఉసిగొల్పినా ఎమ్మెస్వో బలమేంటో చాటిచెప్పిన ఘనత ఆయనదే.

హైదరాబాద్ లో అత్యధిక కనెక్షన్లు ఉండటంతో టీవీ పంపిణీలో హాత్ వే తన ప్రత్యేకత చాటుకుంటూ వచ్చింది. ఆదాయ వనరులు అత్యధికంగా ఉండే హైదరాబాద్ లో చానల్ అందుబాటులో ఉండటమనేది ఎంతో కీలకంగా మారింది. ఆ పరిస్థితుల్లో హాత్ వే రాజశేఖర్ ను ప్రసన్నం చేసుకోవటానికి చానల్ యజమానులు ఎంతగా ఆరాటపడేవారో పరిశ్రమలో ఉన్నవారికి తెలియనిదేమీ కాదు.
డిజిటైజేషన్ మొదలయ్యేనాటికే రాజశేఖర్ తప్పుకొని సొంత పంపిణీ సంస్థ వెంకట సాయి మీద దృష్టిపెట్టారు. హైదరాబాద్ తో బాటు విజయవాడ, విశాఖపట్టణంలో కూడా నెట్ వర్క్ విస్తృతమై ఉన్నప్పటికీ కొంత కాలంగా దూరంగా ఉంటూ వచ్చారు.

రాజశేఖర్ కు చిన్నప్పటినుంచీ బాల్ బాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. హాత్ వే  రీజినల్ హెడ్ గా ఉన్న సమయంలో అనేక బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్స్ ను ఆయన స్పాన్సర్ చేశారు. కొంతకాలం ఆయన రాష్ట్ర బాల్ బాడ్మింటన్ సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేశారు.

హాత్ వే నుంచి తప్పుకున్న తరువాత కుటుంబ పరమైన సమస్యలతో కొంత సతమతమైన రాజశేఖర్ పరిశ్రమతో కూడా పెద్దగా సంబంధాలు కొనసాగించలేదు. మళ్ళీ కేబుల్ రంగంలోకి రావాలని చాలామంది మిత్రులు కోరినా ఆయన సానుకూలంగా స్పందించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. యావత్ కేబుల్ రంగం రాజశేఖర్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంది.

ఇట్లు:

M సుబాష్ రెడ్డి,

కేబుల్ సమాచరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here