జియో బాక్సులమీద అభ్యంతరం: హాత్ వే, డెన్ పై ట్రాయ్ కి ఫిర్యాదు

0
623

హాత్ వే, డెన్ సంస్థలు ఇప్పుడున్న సెట్ టాప్ బాక్సుల స్థానంలో జియో బాక్సులు పెట్టటం మీద మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ఫౌండేషన్ ( ఎమ్ సి ఒ ఎఫ్ ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే విధంగా కొందరు ఎమ్మెస్వోలు వ్యాపారంలో అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది.
గడిచిన ఆరు నెలలకాలంలో డెన్ నెట్ వర్క్స్, హాత్ వే తమ పరిధిలో ఇప్పుడున్న సెట్ టాప్ బాక్సుల స్థానంలో జియో బ్రాండ్ బాక్సులు పెట్టటం ఆందోళన కలిగిస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గడువు ముగిసిన స్టాండర్డ్ ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్ స్థానంలో ఆపరేటర్లతో మోడల్ ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్ చేసుకోకపోవటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇలా బ్రాండ్ మార్చటానికి స్పష్టమైన కారణాలేవీ చెప్పకుండా బలవంతంగా ఆపరేటర్లమీద రుద్దటం భావ్యం కాదని ఫిర్యాదులో పేర్కొంది.
ఎవరైనా స్థానిక కేబుల్ ఆపరేటర్లు అభ్యంతరం చెబితే ప్రీ పెయిడ్ పోర్టల్ లోకి వాళ్ళకు అనుమతిలేకుండా చేసి చందాదారులకు అందించే సేవలకు అంతరాయం కలిగిస్తున్నారని ఎం సి ఒ ఎఫ్ ఆరోపించింది. అదే సమయంలో దొడ్డిదారిన కొంతమంది డమ్మీ ఆపరేటర్లను ప్రోత్సహిస్తూ పరిశ్రమలో అవాంఛనీయ ధోరణులకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ విధంగా కేబుల్ వ్యాపారంలో సమస్యలు సృష్టించి లాభపడటాన్ని అడ్డుకోవాలని ట్రాయ్ ని కోరారు.
నిజానికి జియో ఒక ఎమ్మెస్వో కాదని, అది కేబుల్ ఆపరేటర్లతో ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్లు చేసుకోలేదని కూడా ఆపరేటర్ల ఫౌండేషన్ ట్రాయ్ దృష్టికి తీసుకువచ్చింది. హాత్ వే, డెన్ నెట్ వర్క్స్ సంస్థలు సైతం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ గడువు తీరిన స్టాండర్డ్ ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్ల స్థానంలో మోడల్ ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్లు చేసుకోలేదని లేఖలో పేర్కొంది.
కొంతమంది ఎమ్మెస్వోలు కూదా అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ మహారాష్ట్రలో జరుగుతున్న కొన్ని పరిణామాలను ఉదహరించింది. బి ఆర్ డి ఎస్ సంస్థ కొల్హాపూర్ లోని తన నెట్ వర్క్ లో సిగ్నల్స్ ఇస్తూ బాక్సులు మాత్రం ఇన్ కేబుల్ వారివి పెడుతున్నదని, ఇన్ కేబుల్ సంస్థ సంపర్క్ నెట్ వర్క్ కు చెందిన పోవై(ముంబై), భివాండి ప్రాంతాల్లో సంపర్క్ సెట్ టాప్ బాక్సుల ద్వారా సిగ్నల్స్ అందిస్తోందని ఆరోపించారు.
ట్రాయ్ నియోగించిన ఆడిటర్లు ఇలాంటి అవకతవకలమీద దృష్టి సారించకపోవటం దారుణమని కాస్, ఎస్ టి బి మధ్య సంబంధం లేకపోవటాన్ని, బ్రాండ్లు పొంతన లేకపోవటాన్ని అంత నిర్లక్ష్యంగా వదిలేయటం సమంజసం కాదని మహారాష్ట్ర కేబుల్ ఆపరేటర్స్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. ఒక ఎమ్మెస్వో హెడ్ ఎండ్ ద్వారా ఇంకో ఎమ్మెస్వో హెడ్ ఎండ్ కు అనుసంధానమయ్యే అవకాశాన్ని తీవ్రంగా పరిగణించాలని ట్రాయ్ ని కోరింది. బ్రాడ్ కాస్టర్ల వాటర్ మార్కింగ్ కూడా దీన్ని పసిగట్టలేకపోవటం వల్లనే ఈ ఆటలు సాగుతున్నాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో జియోకు, బ్రాడ్ కాస్టర్లకు మధ్య ఉన్న ఒప్పందాలను, డెన్, హాత్ వే సంస్థల ఎమ్మెస్వో లైసెన్స్ ప్రస్తుత స్థితిని తెలియజేసే పత్రాలను బహిర్గతం చేయాలని ఎం సి ఓ ఎఫ్ డిమాండ్ చేసింది.కేవలం వాటాలు కొనుగోలు చేసిన ఒప్పందంతోనే ఏ సంస్థ అయినా తన సెట్ టాప్ బాక్సులు పెట్టే వీలుంటుందా అనే ప్రశ్నకు కూడా ట్రాయ్, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, జియీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ విషయంలో ట్రాయ్ తగిన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఎం సి ఒ ఎఫ్ తన ఫిర్యాదులో కోరింది. ఎమ్మెస్వోలు స్థానిక ఆపరేటర్లతో తాజా ఇంటర్ కనెక్షన్ అగ్రిమెంట్లు చేసుకునేలా చూడాలని, ప్రీ పెయిడ్ పోర్టల్ అందుబాటులో లేకుండా అడ్డుకోవటం లాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా చూడాలని సంబంధంలేని ఎమ్మెస్వో నుంచి సిగ్నల్స్ అందుకుంటున్న సెట్ టాప్ బాక్సులను నిర్వీర్యం చేయాలని ఆ లేఖలో కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here