బ్రాడ్ కాస్టింగ్ రంగానికి మౌలికవసతుల హోదా నిరాకరణ

0
593

బ్రాడ్ కాస్టింగ్ రంగానికి మౌలికవసతుల హోదా కల్పించటానికి ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు మళ్ళీ చుక్కెదురైంది. ఈ హోదా రావటం వలన యావత్ పరిశ్రమ లబ్ధిపొందుతుందన్న ఆలోచనతో ఇటీవలి బ్రాడ్ కాస్టింగ్ విధానపు ముసాయిదా పత్రంలో కూడా పేర్కొంది. పరిశ్రమ ఈ విషయంలో ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అయితే, కొన్ని ప్రమాణాలకు చేరుకోలేకపోవటం వల్ల అది సాధ్యం కావటం లేదని తేలింది.
ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ విషయంలో అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రస్తుతానికి బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమకు మౌలికసదుపాయాల హోదా ఇవ్వటం సాధ్యం కాదని చెప్పింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రతిపాదనను కొన్ని సాంకేతిక కారణాల వలన అంగీకరించబోవటం లేదని తెలియజేసింది. మౌలిక సదుపాయాల హోదా ఇవ్వటానికి కొన్ని ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ లోక్ సభలో వెల్లడిస్తూ, “బ్రాడ్ కాస్టింగ్ రంగంలో పంపిణీ విభాగానికి మౌలికసదుపాయాల హోదా కల్పించాలని ప్రతిపాదించాం. ఆర్థికమంత్రిత్వశాఖలో నోడల్ విభాగమైన ఆర్థిక వ్యవహారాల విభాగాన్కి ప్రతిపాదనలు అందజేశాం. అయితే, కొన్ని ప్రమాణాలను అందుకోలేక పోవటం వలన నిరాకరిస్తున్నట్టు తెలియజేశారు” అన్నారు.
సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జాతీయ బ్రాడ్ కాస్టింగ్ విధానాన్ని రూపొందించే క్రమంలో ఉండగా మౌలిక వసతుల హోదా కల్పన వ్యవహారాన్ని ఆర్థికశాఖ దృష్టికి తీసుకువెళ్ళింది. ఈ హోదా వలన టీవీ చానల్స్ పంపిణీ విభాగానికి అవసరమైన పరికరాల తయారీ పరిశ్రమలు లబ్ధిపొందుతాయి. గత డిసెంబర్ లో మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా సిఐఐ లాంటి వివిధ పరిశ్రమల సంస్థలతో మాట్లాడుతూ, బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమమీద సర్వే నివేదికలు ప్రచురించటం ద్వారా విధాన నిర్ణయాల రూపకల్పనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
టెలికామ్, ఐటి, బ్రాడ్ కాస్టింగ్ రంగాల మధ్య సరిహద్దురేఖ చెరిగిపోవటంతో సమానావకశాలు ఉండేలా టెలికామ్ తరహాలోనే బ్రాడ్ కాస్టింగ్ కు కూడా మౌలిక సదుపాయాల హోదా కల్పించాలని పరిశ్రమలోని అన్ని విభాగాలూ చాలాకాలంగా కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా పంపిణీ రంగంలో ఈ డిమాండ్ ఉండగా ముసాయిదా బ్రాడ్ కాస్టింగ్ విధానం ఆసలు రేకెత్తించింది. కానీ ఆర్థికశాఖ ఆ ఆశలమీద నీళ్లు చల్లింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here