ఈటీవీ సరికొత్త ప్రయోగం ’బాలభారత్’; నెలకు రూ.4

0
1281

ఇప్పటికే టెలివిజన్ రంగంలో ఏడు చానల్స్ తోబాటు వాటి హెడ్ డి వెర్షన్లు కూడా అందిస్తూ ఉన్న ఈటీవీ నెట్ వర్క్ ఇప్పుడు చిన్నారుల వినోదానికి బాల భారత్ పేరుతో సరికొత్త వేదికకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 12 ఛానల్స్ ను ఈ రోజు ఒకేసారి ప్రారంభించింది. గతంలో ఇదే విధంగా అన్ని భాషల్లో న్యూస్, ఎంటర్టైన్మెంట్ చానల్స్ ప్రారంభించిన ఈటీవీ నెట్ వర్క్ ఆ తరువాత కొంత కాలానికి తెలుగు చానల్స్ మినహా అన్నిటినీ నెట్ వర్క్ 18 గ్రూప్ కు అమ్మటం తెలిసిందే. అందులో ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ కలర్స్ బొకే లోను, న్యూస్ చానల్స్ అన్నీ నెట్ వర్క్ 18 కింద ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఇలా ఉండగా ప్రత్యేకాంశాల (నిషే) చానల్స్ ప్రారంభించటానికి ఈటీవీ గ్రూప్ కొంత కాలంగా కసరత్తు చేసింది. ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఆరోగ్యం, బాలలు.. ఇలా వివిధ విభాగాలలో 65 చానల్స్ నడపటానికి ప్రాథమికంగా పని జరిగింది. ఆ విధమైన భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తుండగానే పునరాలోచన మొదలైంది. దాంతో తాత్కాలికంగా ఈ బృహత్ కార్యక్రమాన్ని పక్కనబెట్టారు. కారణాలు వెల్లడికాలేదు. ఈ మధ్యకాలంలోనే కరోనా రావటంతో ఏడాదికి పైగా అనేక విషయాలు పక్కనబెట్టిన ఈటీవీ యాజమాన్యం బాల భారత్ చానల్స్ ను మాత్రం ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చింది.
పిల్లలను ఆకట్టుకునే కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆదరణ, అనేక దేశాల నుంచి కార్యక్రమాలను భారత దేశం కొసమే హక్కుల కొనుగోలు చేసే అవకాశం ఉండటం, ఒకేసారి 11 భాషల్లో తీసుకువస్తున్నందువల్ల విదేశీ కార్యక్రమాలన్నిటినీ తక్కువ ధరకే డబ్ చేసి అందించే వెసులుబాటు, దేశీయంగా ఒక్కొ భాషలో తయారైన కార్యక్రమాలను సైతం ఇతర భాషల్లో వాడుకునే అవకాశం, సొంతగా తయారు చేసిన నాణ్యమైన కార్యక్రమాలను విదేశీ చానల్స్ కు అమ్ముకునే అవకాశం లాంటి ప్రయోజనాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈటీవీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
అదే సమయంలో రామోజీ మనుమలు, మనుమరాళ్ళ తరం ఇప్పుడు ఈ గ్రూప్ కార్యక్రమాల్లో ప్రధానంగా టీవీ మీద దృష్టి సారిస్తూ ఉండటంతో వాళ్లు కూడా పిల్లల చానల్స్ కు ఉండే వీక్షకాదరణను, భవిష్యత్తును విశ్లేషించి ఆమోదించటం వల్లనే ఇది సాధ్యమైందన్న అభిప్రాయం కూడా ఉంది. మొత్తానికి ఈటీవీ చేస్తున్న బాల భారత్ ప్రయోగం వల్ల ప్రపంచ భాషల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన బాలల కార్యక్రమాలు చూసే అవకాశం భారత్ లోని అన్ని ప్రధాన భాషలు మాట్లాడే పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇక ఈ చానల్స్ అందుబాటు విషయానికొస్తే, వీటిని పే చానల్స్ గా వర్గీకరించి ఇంగ్లిష్ తోబాటు భారతీయ భాషలన్నిటిలోనూ నెలకు రూ.4 చొప్పున ధర నిర్ణయించారు. ఇది స్టాండర్డ్ డెఫినిషన్ ( ఎస్ డి ) ధర కాగా హెచ్ డి చానల్ ధరలు మాత్రం రూ.6 గా నిర్ణయించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏడు చానల్స్ ఇస్తుండగా ఎనిమిదో చానల్ గా బాలభారత్ కలిపి ఈ ఎనిమిది చానల్స్ బొకే ధర నెలకు రూ. 29 గాను, హెచ్ డి ఫామిలీ పాక్ ధర రూ.36 గాను ప్రకటించారు.
తెలుగు, అస్సామీ, బెంగాలీ గుజరాతీ హిందీ, కన్నడ, మరాఠీ, మలయాళం ఒడిఒయా పంజాబీ తమిళంతోబాటు ఇంగ్లీష్ లోనూ బాల భారత్ చానల్స్ ప్రసారమవుతున్నాయి. బాలల టీవీ అంటే ప్రపంచానికి సరికొత్త నిర్వచనమిచ్చేలా కార్యక్రమాలుంటాయని చానల్ యాజమాన్యం చెబుతోంది. ఒకవైపు అంతర్జాతీయ కార్యక్రమాలు అందిస్తూనే మరోవైపు ప్రాంతీయ భాష, సంస్కృతి అభిరుచులకు ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. పిల్లలకు వినోదంతోబాటు విజ్ఞానాన్ని అందిస్తూ వాళ్లలో జిజ్ఞాస నింపాలని, ఉత్తేజం పెంచాలని భావిస్తున్న యాజమాన్యం అందుకు తగిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా తగినంత అధ్యయనం, మార్కెట్ సర్వే చేయటం అలవాటున్న ఈటీవీ యాజమాన్యం ఇప్పుడు బాలభారత్ విషయంలోనూ అంతే కసరత్తు చేసి ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సంప్రదాయ ముద్రణా మాధ్యమం నుంచి పాఠకుల దృష్టి క్రమంగా డిజిటల్ వైపు దూసుకెళుతున్న సమయంలో ఈ నాడు గ్రూప్ అధినేత రామోజీరావు కూదా అదే కోణంలో ఆలోచిస్తున్నారని, అందుకు అనుగుణంగానే ఈ టీవీ భారత్ ఎదుగుతూ ఉందని చెబుతున్నారు. టీవీ రంగంలోనూ ఆయన వారసుల ఆలోచనలు అదే దిక్కులో సాగుతూ ఉండటంతో బాలభారత్ లాంటి భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నట్టు అర్థమవుతూ ఉంది. ఏది చేపట్టినా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగే ఈనాడు గ్రూప్ ఈ దేశవ్యాప్త చానల్స్ ప్రయోగంలో విజయం సాధించాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here