పాతికేళ్ల ఈటీవీకి రజతోత్సవ శుభాకాంక్షలు!

0
671

ఈటీవీ-మీటీవీ అనే మాట ఇంటింటా మారుమోగటం మొదలై అప్పుడే పాతికేళ్ళు గడిచాయి. ఆవిధంగా ఈటీవీ రజతోత్సవాలు పూర్తిచేసుకుంది.చానల్ మొదలవటానికి ముందు రామోజీరావు గారు చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. చానల్ మొదలయ్యాకగాని ఆ విషయం పరిశ్రమలో ఉన్నవాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో 18 గంటల ప్రసారాలు అందించటానికి ఎంత కృషి జరిగి ఉంటుందో ఊహకు సైతం అందదు.  రోజూ సాయంత్రం కేవలం మూడు గంటల ప్రసారాలతో జెమినీ టీవీ ఆరు నెలలముందే  హడావిడిగా మొదలై తెలుగులో మొదటి ప్రైవేట్ శాటిలైట్ చానల్ గా పేరుతెచ్చుకున్నా , ఈటీవీ మాత్రం పకడ్బందీగా 18 గంటల ప్రసారాలతో 1995 ఆగస్టు 27న మొదలైంది.

సినిమాల ప్రసార హక్కుల కొనుగోలు విషయంలో ఈటీవీ చాలా జాగ్రత్త పడింది. టీవీ విషయం బైటికి పొక్కకముందే సినిమా శాటిలైట్ టీవీ హక్కులు కొనేయాలని నిర్ణయించుకొని తన వ్యూహాన్ని అమలు చేసింది.ఆ విధంగా పాత చిత్రాలంటే ఈటీవీ దగ్గరే ఉంటాయన్న అభిప్రాయం అందరిలో పెంచగలిగింది. జెమినీ టీవీ ముందుగా ప్రారంభమైనా, ఈటీవీ మాత్రం మొదలైనప్పటినుంచీ అదే నెంబర్  వన్. అయితే, జెమినీ లో సగం వాటా కొనుక్కొని ఆర్థిక నియంత్రణ తన గుప్పిట్లోనే పెట్టుకున్న  సన్ టీవీ ఎలాగైనా జెమినీని తెలుగులో నెంబర్ వన్ చేయాలన్న పట్టుదలతో ఉండేది. తెలుగు నిర్మాతల మండలితో ఏర్పడిన  ఒక చిన్న వివాదం కారణంగా  నిర్మాతల మండలి నిర్ణయం ప్రకారం  కొత్త సినిమాల షూటింగ్ కి ఈటీవీ ని రానివ్వకుండా, జెమినీ కి మాత్రమే అవకాశం కల్పించారు. ఆ విధంగా ఈటీవీని దెబ్బకొట్టే ప్రయత్నం మొదలైంది.

తెలుగులో డెయిలీ సీరియల్స్ ప్రవేశపెట్టిన ఘనత ఈటీవీ కే దక్కుతుంది. సీరియల్స్ నిర్మాణంలోనూ  చాలా శ్రద్ధ తీసుకునేది. అనేక సీరియల్స్  టైటిల్ సాంగ్స్  సిడి లు అమ్మగలిగేంతగా ప్రాచుర్యం పొందాయి. కళంకిత లాంటి సీరియల్స్  ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనికూడా లేదు. అనేక సీరియల్స్ విజయవంతం కావడంలో స్వర్గీయ సుమన్ పాత్ర ఎంతో ఉంది. ఒకవైపు జెమినీ టీవీ సొంత నిర్మాణమంటూ లేకుండా స్లాట్స్ అమ్మకంతో సురక్షితమైన వ్యాపారం చేసుకూంటూ ఉంటే ఈటీవీ మాత్రం సొంతమౌలిక సదుపాయాలు వాడుకుంటూ స్వయంగా సీరియల్స్ నిర్మిస్తూ వచ్చింది. వైవిధ్యభరితమైన సీరియల్స్ తీయటంలోనూ ఈటీవీ ముందుంది. పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎంటర్టైన్మెంట్ సంగతలా ఉంటే, వార్తల విషయంలో ఈటీవీ తన ప్రత్యేకత చాటుకుంటూ వచ్చింది. నిజానికి చాలా భారీగా ఖర్చుచేసింది కూడా. కొలంబో ఎర్త్ స్టేషన్  నుంచి ప్రసారాలు అప్ లింక్ అవుతున్నాయి కాబట్టి రోజూ మద్రాసు (అప్పటికి అధికారికంగా చెన్నై కాదు ) లో ఆంధ్రావని రికార్డు చేసి  విమానంలో పంపాల్సి వచ్చేది. ఆ తరువాత చెన్నై నుంచ్ అప్ లింకింగ్ అందుబాటులోకి వచ్చినపుడు కూడా ఢిల్లీలో సగం బులిటెన్ , చెన్నై లో సగం బులిటెన్ చదివించేవారు. న్యూస్ సెంటర్ కి వార్తలను చేరవేయటానికి వి-శాట్ వాడుకునే వారు. మొత్తంగా చూస్తే ఈ టీవీ 9 గంటల న్యూస్ బులిటెన్ బాగా ప్రేక్షకాదరణ పొందగలిగింది. న్యూస్ తోబాటు అన్నదాత లాంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలు ప్రసారం చేయటం కూడా ఈటీవీకే చెల్లింది. లాభాలగురించి ఆలోచించకుండా ఇలాంటి కార్యక్రమాల మీద ఖర్చు చేయటం ఈటీవీ ప్రత్యేకత. దాదాపు అన్ని చానల్స్ ఆరోగ్యకార్యక్రమాల పేరుతో డాక్టర్లనుంచి డబ్బు వసూలు చేస్తున్నా, ఈటీవీ మాత్రం ఇప్పటికీ అలాంటి ధోరణులను దరిజేరనీయలేదు.

వార్తలు మరింత వేగంగా అందించటానికి ఘంటారావం పేరుతో ప్రతి గంటకూ ఐదేసి నిమిషాల చొప్పున వార్తల ప్రసారానికి శ్రీకారం చుట్టింది. నిజానికి ఇది ఆ తరువాత ప్రారంభించబోయే న్యూస్ చానల్ ( ఈటీవీ 2) కి రిహార్సల్ లాంటిది. ఈ ప్రయోగం విజయవంతమైనట్టే పైకి కనిపించినా ఈటీవీకి దారుణమైన నష్టం కలిగించింది. ముఖ్యంగా సాయంకాలం స్లాట్స్ లో ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. సాయంత్రం 7 గంటలకు జెమిని లో సీరియల్ వస్తూ ఉంటే ఈటీవీలో ఘంటారావం వచ్చేది. సీరియల్స్ చూసే ఈ టీవీ ప్రేక్షకులంతా పొలోమంటూ జెమినీ వైపు వెళ్ళేవారు. వార్తలు అయిపోయాక 7.05 కి ఈటీవీ సీరియల్ మొదలైనప్పుడు వెనక్కి వచ్చేవాళ్ళు తక్కువగా ఉండే వారు. ఆ తరువాత సీరియల్ 7.32 కి మొదలయ్యేది. అప్పుడూ అదే పరిస్థితి. జెమినీ కావాలని 7.29 కే సీరియల్ మొదలుపెట్టేది. గంటగంటకూ వార్తల ప్రసారం విజయవంతమైనా, సీరియల్స్ దెబ్బతినటం మొదలైంది. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఆ తరువాత ఈటీవీ కోలుకోవటానికి చాలాకాలం పట్టింది. డబ్బింగ్ సీరియల్స్ అయినా సరే, ప్రేక్షకులు జెమినీకి అలవాటు పడ్డారు.

ఘంటారావం రిహార్సల్స్ విజయవంతం కాగానే, ముందుగా అనుకున్నట్టుగా 24 గంటల న్యూస్ చానల్ ( ఈ టీవీ 2) కు శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి24 గంటల న్యూస్ చానల్ అయినప్పటికీ ఆ విషయాన్ని ధైర్యంగా ప్రచారం చేసుకోవటంలో ఈటీవీ విఫలమైంది. 2003 డిసెంబర్ 29 ఉదయం ప్రసారాలతో ప్రారంభమైనా తొలి తెలుగు న్యూస్ చానల్  అని చెప్పుకోలేని దుస్థితి ఈటీవీ ది.దానికంటే 15 రోజులు ఆలస్యంగా 2004 జనవరి లో మొదలైన టీవీ9 “ తొలి తెలుగు న్యూస్ చానల్“  అంటూ పదే పదే చెప్పి దాన్నే నిజమని నమ్మేలా చేసింది.  వేగానికీ, కచ్చితత్వానికీ మధ్య ఉండే పోటీలో ఈటీవీ 2 కచ్చితత్వానికి మొగ్గు చూపడంతో వేగంలో వెనుకబడక తప్పలేదు. తెలుగులో తొలి న్యూస్ చానల్ కావటం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకూ రెండు వేరు వేరు చానల్స్ ప్రసారం చేయటం మొదలుపెట్టిన తొలిసంస్థ కూడా ఇదే. ఆ విధంగా ఈ టీవీ 2 పేరు మార్చుకొని ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. ఇంకో కొత్త చానల్ ఈటీవీ తెలంగాణ అయింది.

ఈటీవీకి విధేయులైన ప్రేక్షకులున్నప్పటికీ పే చానల్ గా మారటానికి చాలా కాలం సాహసించలేదు. సన్ గ్రూప్ మొట్టమొదటగా తేజ టీవీని, ఆ తరువాత జెమినీ టీవీని పే చానల్స్ గా మార్చేదాకా ఈటీవీ సాహసించలేక పోయింది. అంతెందుకు, ఆరంభంలోనే పే చానల్ అయిన మా టీవీ కంటే కూడా ఈటీవీ ఆలస్యంగా పే చానల్ అయింది.  కాకపోతే న్యూస్ చానల్ కు కూడా కొంత నామమాత్రపు ధర పెట్టి రెండూ కలిపి ఇవ్వటం మొదలుపెట్టారు.

తెలుగు సంగతలా ఉంచితే, ఈటీవీ దేశమంతటా విస్తరిస్తూ ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించింది. వివిధ భాషల్లో ఎంటర్టైన్మెంట్, న్యూస్ చానల్స్ ప్రారంభిస్తూ కొద్దికాలంలోనే తన ప్రత్యేకత చాటుకుంది. అయితే, ఆ తరువాత కాలంలో ఎక్కువ భాగం చానల్స్ ను వదిలించుకోవటం విశేషం. తెలుగు మినహా ఇతర భాషల్లోని చానల్స్ ను వదులుకోవటం కూడా వ్యూహాత్మకమేనని చెబుతారు. కానీ ఈటీవీ బ్రాండ్ తమకే ఉండిపోయేలా ఒప్పందం చేసుకోవటం వల్ల మళ్ళీ ఈటీవీ విస్తరణ కార్యకలాపాలు మొదలయ్యాయి.

సినిమాలు కొనటం దాదాపుగా ఆపేసిన ఈటీవీ  ఆ తరువాత కాలంలో గేమ్ షోస్, రియాల్టీ షోస్ మీద ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. సొంత నిర్మాణమనే కాన్సెప్ట్ పక్కనబెట్టి  ఔట్ సోర్స్ చేయటం మొదలుపెట్టింది. విధానపరంగా ఈటీవీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమిది. అయితే, ఇది ఫలించింది. ప్రేక్షకాదరణ పొందగలిగే కార్యక్రమాలు రూపొందుతున్నాయి. అయితే, అదే సమయంలో కొన్ని విమర్శలూ తప్పలేదు. జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో జుగుప్సాకరమైన ద్వంద్వార్థాలు వాడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నా, పట్టించుకున్నట్టు లేరు.  ఈటీవీ నుంచి ఈ తరహా కార్యక్రమాలు అందుతాయని ఎవరూ ఊహించలేదు. అందుకే ఈటీవీ ని ఎంతగానో గౌరవించేవారు కూడా చిన్నబుచ్చుకున్నారు.

ఒక దశలో ఈటీవీ దగ్గర శాటిలైట్ ప్రసార హక్కులున్న సినిమాల సంఖ్య 1450 కి చేరుకుంది. అప్పట్లో అది చాలా పెద్ద సంఖ్య. కానీ మూవీస్ చానల్ గాని మ్యూజిక్ చానల్ గాని పెట్టలేదు. ఇతర భాషల్లో చానల్స్ పెట్టటం ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరించటం మీద దృష్టి సారించిందే తప్ప తెలుగులో సినిమాల ప్రసార హక్కులను సద్వినియోగం చేసుకొలేకపోవటం ఈటీవీ తప్పిదమనే చెప్పాలి.  సినిమాల సంఖ్య  సగానికి సగం తగ్గిపోయిన తరువాత ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. మొత్తానికి మరో నాలుగు చానల్స్ ప్రసారం చేయటం మొదలుపెట్టింది.

డిజిటైజేషన్ అనంతరం వచ్చిన మార్పులనూ ఈటీవీ గట్టిగా తట్టుకొని నిలబడింది. తన ఏడు చానల్స్ ను బొకే గామార్చి ప్రేక్షకులు ఆ బొకే తీసుకునేట్టు చేయగలిగింది. ఫలితంగా మొత్తం ఏడు చానల్స్ తోబాటు హెచ్ డి చానల్స్ ను సైతం విడిగా ఇవ్వజూపుతూ ఉంది. తెలుగులో న్యూస్ చానల్స్ ను సైతం పే చానల్ గా మార్చగలిగిన ఏకైక చానల్ గా నిలిచింది. జెమినీ న్యూస్ కూడా ఒకప్పుడు పే చానల్ గా నడిచినా అది కొద్ది కాలానికే మూతబడింది.

మళ్ళీ జాతీయస్థాయిలో బుల్లితెర విప్లవం తీసుకురావాలన్నదే రామోజీరావు గారి ఆలోచన అన్నట్టు తెలుస్తున్నది. బాలభారతం పేరుతో ఓ డజన్ చానల్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు.  ఏది చేసినా ప్రణాళికా బద్ధంగా, భారీగా చేస్తారని పేరున్న రామోజీరావు గారు న్యూస్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో కొత్తగా చూడాల్సిందేమీ లేదు. కొత్తదనం, ప్రజాప్రయోజనం రెండూ ఉండాలనే దృక్పథంతో ప్రజలకు పనికొచ్చే చానల్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించాలని నిర్ణయించుకొని ఆ దిశలో అడుగులేస్తున్నారు. ఆయన ఆలోచనావిధానాన్ని జాగ్రత్తగా గమనించే వారికి మాత్రం ఆయన మనసులో మాట ఈ పాటికే అర్థమై ఉండాలి.

ఇలా పాతికేళ్ళ ప్రస్థానంలో తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసిన ఈనాడు గ్రూప్ వారి ఈటీవీ చానల్స్ కు ఈ రజతోత్సవం సందర్భంగా తెలుగు ప్రేక్షకుల తరఫున, తెలంగాణ ఎమ్మెస్వోల తరఫున, బ్రైట్ వే కమ్యూనికేషన్స్  తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఎప్పటిలాగానే పంపిణీలో కీలకపాత్ర పోషిస్తున్న ఎమ్మెస్వోల పాత్రను మనః పూర్వకంగా గుర్తిస్తూ వస్తున్న ఈ టీవీ గ్రూప్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.

ఎం. సుభాష్ రెడ్డి

తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here