డిటిహెచ్ ఆపరేటర్ల హైబ్రిడ్ బాక్స్ వ్యూహం ఫలించేనా?

0
190

పండుగ సీజన్లలో చందాదారులను ఆకట్టుకోవటానికి పాకేజీలలో డిస్కౌంట్లతో కూడిన పాకేజీలు ప్రకటించటం, వాల్యూ యాడెడ్ సేవలు పెంచటం డిటిహెచ్ ఆపరేటర్లకు కొత్తేమీ కాదు. కానీ ఈసారి పండుగ సీజన్ కు సరికొత్త వ్యూహం అనుసరిస్తున్నారు. వాళ్ళ సేవల పట్ల చందాదారులకు  ఎప్పటికప్పుడు ఆసక్తి పెంచాలని చూసే డిఒటిహెచ్ ఆపరేటర్లు ఈ సారి దసరా-దీపావళి సందర్భంగా హైబ్రిడ్ సెట్ టాప్ బాక్సులు ఇవ్వజూపుతున్నారు.

ఎయిర్ టెల్ ఇండియా ఇప్పుడు తాజాగా చేపట్టిన అబ్ దేఖో బడా దేఖో పేరుతో చేపట్టిన ప్రచారోద్యమం కూడా అందులో భాగమే. ఎక్స్ స్ట్రీమ్ బాక్స్ పేరుతో కొత్త బాక్స్ గురించి చెప్పే వీడియోలో ఇద్దరు యువ వినియోగదారులు వినోదపు పెద్ద ప్రపంచం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మామూలు రోజువారీ టీవీ ప్రసారాలను, ఆన్ లైన్ ప్రీమియం ప్రసారాలను మార్చి మార్చి చూడటం ఇప్పుడు  ఎయిర్ టెల్ బాక్స్ సాయంతో చాలా సులభమని చెప్పటమే స్థూలంగా ఈ ప్రకటన లక్ష్యం.

డిటిహెచ్ మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న టాటా స్కై కూడా తన టాటా స్కై బింజ్+ కోసం సరికొత్త ప్రచారం ప్రారంభించింది. వివిధ వయోవర్గాలవారి  ఆభిరుచులకు అనుగుణంగా ఈ బాక్స్ ఎలా పనిచేస్తుందో ప్రత్యేకంగా వివరించటం దీని లక్ష్యం. అదే సమయంలో సయానీ గుప్తా, రసిగా దుగ్గల్ లాంటి స్టార్స్ తో సోషల్ మీడియా  ద్వారా మార్కెట్ ను ప్రభావితం చేసే పనిలో ఉంది.

అయితే, ధర విషయంలో సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో వీరి వ్యూహానికి ఎదురుదెబ్బతగిలే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టాటా స్కై ఈ మధ్యనే తన సెట్ టాప్ బాక్స్ టాటా స్కై బింజ్ + ధరను రూ.2999 గా నిర్ణయించింది. అయితే, కొత్త చందాదారులకు ఈ ధర ఉండగా పాతవారికి మాత్రం రూ. 2499 కే ఇవ్వాలని నిర్ణయించింది. వీళ్ళు పాత అప్ గ్రేడ్ చేసుకోవచ్చు, లేదా రెండో మల్టీ టీవీ కనెక్షన్ తీసుకోవచ్చు. ఇంకోవైపు ఎయిర్ టెల్ యాజమాన్యం తమ ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ బాక్స్ ధరను 2499 గా నిర్ణయించింది. 

కోవిడ్ సంక్షోభం మొదలైనప్పుడు. అది కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, డిటిహెచ్ ఆపరేటర్లు కావచ్చు… పే టీవీ చందాదారులు బాగానే తగ్గిపోయారు. 2020 మొదటి త్రైమాసికంలో సైతం డిటిహెచ్ చందాదారుల పెరుగుదల కేవలం 2.8 లక్షలకే పరిమితమైంది. అయితే, ఇప్పుడు ప్రధాన డిటిహెచ్ ఆపరేటర్లు గతంలో మాదిరిగా పెరుగుదల గాడిలో పడ్డామని చెప్పుకుంటున్నప్పటికీ, గత ఆరునెలల కాలంలో ఒటిటి విజృంభించిన నేపథ్యంలో ఎన్నో రకాల రాయితీలిచ్చి చందాదారులను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నది నిజం. ఇప్పుడు టాటా స్కై, ఎయిర్ టెల్ ఇలా హైబ్రిడ్ సెట్ టాప్ బాక్సులు ఇవ్వటం కూడా ఒటిటి దెబ్బను తట్టుకొని చందాదారులను నిలబెట్టుకోవటానికి, కొత్త చందాదారులకు ఆకట్టుకోవటానికేనని అర్థమవుతోంది.

భవిష్యత్తు మొత్తం  హైబ్రిడ్ బాక్సులదేనని భావిస్తున్న సమయంలో యువతరం చాలా వేగంగా డిజిటల్ వైపు వెళ్ళిపోతోంది. అయితే, ప్రత్యేకంగా టీవీ కి, ఆ తరువాత విడివిడిగా ఒటిటి వేదికలకు చెల్లింపులు చేయటం ఖరీదైన వ్యవహారం కాబట్టి మొత్తం కలిపి దాదాపు ఏడాదికి 20,000 దాకా ఖర్చవుతుంది.  కానీ హైబ్రిడ్ బాక్స్ వలన ప్రయోజనమేంటంటే అన్నిటినీ చాలా అందుబాటు ధరలో అందించగలుగుతాయి. అయితే, వీటన్నిటినీ ఒక బొకేగా మార్చి అందించాల్సి ఉంటుంది. అది అటు చందాదారుకు, ఇటు డిటిహెచ్ ఆపరేటర్ తోబాటు ఒటిటి వేదికకు కూడా లాభదాయకంగా ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికప్పుడు ఒక్క సారిగా మార్పు రావటం దాదాపు అసాధ్యమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే, ఈ వ్యూహం తక్షణ ఫలితాలు ఇవ్వలేకపోయినా, అనేక సవాళ్లు ఎదుర్కున్న తరువాత చాలామంది మామూలు టీవీ నుంచి ఈ హైబ్రిడ్ బాక్సుల వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. స్మార్ట్ టీవీ పెరుగుదలకూడా దీనికి మరింత దోహదం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here