డీడీ ఫ్రీ డిష్ ‘ఉచిత చానల్స్’ మీద ట్రాయ్ కి ఫిర్యాదు

0
604

వ్యాపారంలో పోటీ పడటానికి అందరికీ సమాన వేదిక కల్పిస్తామని డిజిటైజేషన్ సందర్భంగా చెప్పిన ట్రాయ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని డీటీహెచ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు , డీటీహెచ్ ఆపరేటర్లకు పే చానల్స్ ఒకే ధరకు ఇవ్వాలనే షరతు విధించటం తెలిసిందే. అయితే, బ్రాడ్ కాస్టర్లు డీటీహెచ్ వేదికలను సమానంగా చూడకపోవటం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేట్ డీటీహెచ్ సంస్థలకు పే చానల్స్ ఇచ్చి డబ్బు వసూలు చేసుకుంటున్న బ్రాడ్ కాస్టర్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీడీ ఫ్రీ డిష్ కు మాత్రం ఉచితంగా ఇవ్వటం ఇదెక్కడి న్యాయమని ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ ఈ విషయమై ట్రాయ్ కి లేఖ రాశారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి ఇది పూర్తి విరుద్ధమని డీటీహెచ్ ఆపరేటర్లు వాదిస్తున్నారు. చానల్స్ ను పే చానల్స్ లేదా ఫ్రీ టు ఎయిర్ (ఉచిత) చానల్స్ గా వర్గీకరించాలని, ఎట్టి పరిస్థితులలోనూ వాటిని కలపకూడదని నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. అన్నీ పంపిణీ వేదికల విషయమలోనూ ఆ వర్గీకరణలో మార్పు ఉండకూడదని, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతుండటాన్ని పరిశీలించి న్యాయం చేయాలని ఇంతకుముందు కూడా ట్రాయ్ కి రాసినా పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర నిరసన తెలియజేశారు.
పే చానల్స్, ఫ్రీ టు ఎయిర్ చానల్స్ విషయంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జీ, సోనీ, స్టార్, వయాకామ్ 18 తదితర సంస్థలు నిబంధనలో ఉన్న లొసుగులను అవకాశంగా తీసుకొని వాటి ద్వితీయ శ్రేణి చానల్స్ అయిన జీ అన్మోల్, సోనీ పాల్, స్టార్ ఉత్సవ్, కలర్స్ రిష్టే చానల్స్ ను డీడీ ఫ్రీ డిష్ లో ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విధంగా పే చానల్స్ కంటే ఈ ఉచిత చానల్స్ రీచ్ పెంచుకొని మరింత ప్రకటనల ఆదాయం సంపాదించు కుంటున్నాయని ఫిర్యాదు చేశాయి. అవే చానల్స్ మిగిలిన పంపిణీ వేదికలమీద పే చానల్స్ గా ఉండటాన్ని డీటీహెచ్ ఆపరేటర్లు తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. ట్రాయ్ కి సమర్పించిన గరిష్ఠ చిల్లర ధరల జాబితాలో ఈ విషయం బ్రాడ్ కాస్టర్లే స్వయంగా ఒప్పుకున్న సంగతి గుర్తు చేశారు.
ఈ విధమైన వెసులుబాటు కల్పించటం అత్యంత వివక్షాపూరితమైనడని డీటీహెచ్ ఆపరేటర్లు విమర్శించారు. పైగా ఈ ఉచిత చానల్స్ పంపిణీ చేసినందుకు బ్రాడ్ కాసటర్లు పెద్ద మొత్తాల్లో డ్ఎఎడీ ఫ్రీ డిష్ కు డబ్బు చెల్లిస్తున్న విషయం మరింత దారుణమన్నారు. ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లు మాత్రం ప్రేక్షకులనుంచి చందాలు వసూలు చేసి బ్రాడ్ కాస్టర్లకు ఇచ్చుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వ బ్రాడ్ కాస్ట్ విభాగమైన ప్రసార భారతి కింద ఉండే పంపిణీ సంస్థకు ప్రత్యేక అవకాశాలు కల్పించి వ్యాపారంలో పోటీపడే వాతావరణాన్ని దూరం చేసి నష్టాల వైపు నడిపించటం సమంజసం కాదని ట్రాయ్ ని సూటిగా ప్రశ్నించారు.
ఉచితంగా ఇవ్వటానికి తాము వ్యతిరేకం కాదని, డీడీ ఫ్రీ డిష్ కి ఇస్తున్నట్టే మిగిలిన డీటీహెచ్ వేదికలకు కూడా అదే విధంగా ఉచితంగా ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని టాటా స్కై సీఈ వో హరిత నాగ్ పాల్ అంటున్నారు. “ దాదాపు 20 ఛానల్స్ డీడీ ఫ్రీ డిష్ లో ఉచితంగా అందుతూ మా చందాదారులకు మాత్రం ధరకు అందుతున్నాయి. ఇది పూర్తిగా వివక్ష ధోరణే. కొత్త టారిపోహ ఆర్డర్ పరిధిలోకి డీడీ ఫ్రీ డిష్ ను తీసుకురాకపోవటంలో ఉద్దేశమేంటని ట్రాయ్ సమాధానం చెప్పలేకపోతోంది. మా సమస్య డీడీ ఫ్రీడిష్ తో కాదు, బ్రాడ్ కాస్టర్లతో.” అన్నారు.
ప్రసార భారతి కిందికి వస్తుంది కాబట్టి దానిమీద ట్రాయ్ నియంత్రణ ఉండకపోవచ్చుననే చిన్నపాటి లొసుగును ట్రాయ్ వాడుకుంటోంది. ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ ను నియంత్రిస్తూ దూరదర్శన్ ను పట్టించుకోనట్టే ఇక్కడా వ్యవహరిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. డీడీ ఫ్రీ డిష్ లో స్థానం సంపాదించుకున్న చానల్ కు వెంటనే 50 జీఆర్పీలు రావటం చాలా సాధారణం కాగా ఇతర డీటీహెచ్ లలో వచ్చే ఉచిత చానల్స్ కు 7 జీఆర్పీలు రావటం కూడా గగనంగా మారింది. డీడీ ఫ్రీడిష్ లో అంతా లాభం ఉంది. బ్రాడ్ కాస్టర్లు క్రమంగా పే టీవీ చందాదారులకు దూరమవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఓటీటీ వేదికల ద్వారా చేరుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డీడీ ఫ్రీ డిష్ ను ఎంచుకుంటున్నారు. దీనివలన ప్రకటన ఆదాయంతోబాటు చందాల ఆదాయం కూడా వస్తోంది.
డీడీ ఫ్రీ డిష్ లో స్థానం దొరికితే ఏడాదికి రూ. 8 కోట్ల నుంచి రూ. 16 కోట్ల దాకా చెల్లించటానికి బ్రాడ్ కాస్టర్లు సిద్ధంగా ఉన్నారు. అంతా భారీ మొత్తాన్ని కారేజ్ ఫీజుగా చెల్లించి మరీ ఉచితంగా ఇస్తున్నారు. అదే, కేబుల్ లోనో డిటిహెచ్ లోనో అయితే నామమాత్రపు కారేజ్ ఫీజుతోనే సరిపెడతారు. ఇది రెండు విధాలుగానూ వ్యతిరేకమే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొదటి టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఎమ్మెస్వోలు గాని, డీటీహెచ్ ఆపరేటర్లు గాని నెలకు రూ. 4 లక్షలకు మించి కారేజ్ ఫీజు కట్టనక్కర్లేదు. అందువలన కారేజ్ ఫీజు ఆదాయం బాగా పడిపోయింది.
ఇప్పుడు డిటిహెచ్ ఆపరేటర్లు కోరుతున్నదొక్కటే. బ్రాడ్ కాస్టర్లు డిడి ఫ్రీ డిష్ కు ఉచితంగా ఇస్తున్న చానల్స్ ను తమకు కూడా ఉచితంగా ఇవ్వాలని, లేదా డీడీ ఫ్రీ డిష్ లో ఉచితంగా ఛానల్స్ ఇవ్వటం ఉపసంహరించుకోవాలని. అప్పుడే అన్నీ పంపిణీ వేదికలనూ సమానంగా చూసినట్టవుతుంది. ఇప్పుడు ట్రాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here