ఉచిత చానల్స్ తో డిష్ టీవీ ‘జింగ్’: మనకు పనికొస్తుందా?

0
829

కేబుల్ ఆపరేటర్లకు మరో ప్రమాదం ముంచుకొస్తోంది. నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులేకుండా చానల్స్ ఇవ్వటానికి డిష్ టీవీ సరికొత్త సెట్ టాప్ బాక్స్ తో రంగంలోకి దిగుతోంది. మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేసే అవకాశమున్న ఈ విధానం మీద ఒకవైపు కొన్ని అనుమానాలున్నా, ఇది కేబుల్ వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదం. అందుకే దీనిమీద ఒక సమగ్ర వ్యాసం.

కేబుల్ ఆపరేటర్ ఇచ్చే చానల్స్ కు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రూ. 153 (రూ.130 ప్లస్ రూ. 23 జేఎస్టీ) చెల్లించటం మనకి తెలుసు. ఇందులో అధిక భాగం స్థానిక ఆపరేటర్ కు, కొంత భాగం ఎమ్మెస్వోకు వెళుతుంది. అయితే, ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్ల విషయానికొస్తే, స్థానిక ఆపరేటర్లు ఉండరు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకే పోతుంది. మరోవైపు ప్రసారభారతి వారి ఉచిత డీటీహెచ్ డీడీ ఫ్రీడిష్ ఉంది. అది నెలవారీ చందా గాని, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు గాని వసూలు చేయదు. దూరదర్శన్ చానల్స్, రేడియో చానల్స్ తో బాటు ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కూడా అందిస్తుంది. ఒకసారి సెట్ టాప్ బాక్స్ కొనుక్కుంటే చాలు. నెలవారీ చందా కట్టాల్సిన అవసరం లేదు.

అయితే ఇప్పుడు డిష్ టీవీ వారి సరికొత్త నమూనా మార్కెట్లో రంగప్రవేశం చేసింది. దాని పేరు జింగ్ సూపర్ ఎఫ్ టి ఏ బాక్స్. ఈ సర్వీస్ కోసం జింగ్ సెట్ టాప్ బాక్స్ తీసుకున్నవాళ్ళందరికీ ప్రసారభారతి వారి డీడీ ఫ్రీడిష్ తరహాలో అందులో ఉన్న ఉచిత చానల్స్ అన్నీ అందుతాయి. దీనికి నెలవారీ చందా కట్టనక్కర్లేదు. అదే సమయంలో ఏవైనా పే చానల్స్ కావాలంటే మాత్రం వాటికి చందా కట్టి తీసుకోవచ్చు. అలా అదనపు పే చానల్స్ కలుపుకునే సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకత. ఇలాంటి సెట్ టాప్ బాక్స్ ఇంట్లో పెట్టుకుంటే డీడీ ఫ్రీడిష్ లో వచ్చే ఉచిత చానల్స్ తోబాటు ఇతర ఉచిత చానల్స్ కూడా అందుకోవచ్చు. ఈ కొత్త జింగ్ సూపర్ ఎఫ్ టి ఏ సెట్ టాప్ బాక్స్ కు ఎలాంటి షరతులు వర్తిస్తాయో చూద్దాం:

• జింగ్ సూపర్ ఎఫ్ టీ ఏ సెట్ టాప్ బాక్స్ తీసుకోగానే మీకు 230 ఉచిత చానల్స్ అందుబాటులోకి వస్తాయి. అంటే, డీడీ ఫ్రీడిష్ లో వచ్చే చానల్స్ తోబాటు మరో యాభై చానల్స్ అదనంగా అందుతాయి. ఆ విధంగా ఇది డీడీ ఫ్రీడిష్ మీద మొదటి వేటు. అయితే, మొదటి రెండేళ్ళు మాత్రమే నెలసరి చందా ఉండదు.
• ఈ 230 చానల్స్ లో డీడీ ఫ్రీడిష్ లో దొరకనివి కూడా ఉంటాయి. అవి కూడా ఉచితంగా దొరుకుతాయి.
• డీడీ ఫ్రీడిష్ లో అందుబాటులోకి వస్తున్న 186 చానల్స్ ఇందులోనూ ఉంటాయి.

జింగ్ సూపర్ ఎఫ్ టి ఏ బాక్స్ ఆఫర్

రెండేళ్ళు ఉచితంగా 230 చానల్స్ అందించిన తరువాత పరిస్థితి ఏంటన్నది సహజంగా ఎదురయ్యే ప్రశ్న. మూడో సంవత్సరం మొదలుకొని ఏడాడీ మొత్తానికి రూ. 499 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటున నెలకి సుమారు 42 రూపాయల లోపే. ఇక్కడ కూడా నెలకు 153 రూపాయల నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు అక్కర్లేదు.

అదే సమయంలో కోరుకున్న పే చానల్ ను అదనంగా జోడించుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఐపీఎల్ సీజన్ లో స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ చానల్ కావాలనుకుంటే ఆ ఒక్క చానల్ ధర రూ. 22.42 (రూ. 19 + 18% జీ ఎస్టీ ) తోబాటు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ.10 కడితే సరిపోతుంది. అంటే, అదనంగా రూ. 19 రూపాయల గరిష్ఠ చిల్లర ధర ఉన్న ఒక పే చానల్ తీసుకున్నందుకు నెలకు రూ. 32.42 కట్టాల్సి వస్తుంది.

ప్రతి పే చానల్ కూ రూ.10 చొప్పున నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు చెల్లించటం తప్పనిసరి. అలా వద్దనుకున్నప్పుడు మామూలుగా 230 ఛానల్స్ కే పరిమితమైతే ఏమీ కట్టనక్కలరలేదు. ఏ నెలయినా ఒక చానల్ తీసుకోవచ్చు, లేదా మానేయవచ్చు.

జింగ్ సూపర్ ఎఫ్ టి ఏ బాక్స్ ధర ఎంత?

ఇంతకీ ఈ సెట్ టాప్ బాక్స్ ధర ఎంత ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది అనేవి ఆ తరువాత వచ్చే ప్రశ్నలు. ప్రస్తుతానికి దీన్ని మీ దగ్గరలో ఉన్న డీలర్ దగ్గర మాత్రమే కొనుక్కునే అవకాశముంది. ఇంకా ఆన్లైన్ లో కొనుక్కునే సౌకర్యం కల్పించలేదు. ఈ విషయంలో ఏ డిష్ టీవీ డీలర్ ను అడిగినా కావాల్సిన సమాచారం ఇస్తాడు. జింగ్ బాక్స్ తెప్పించి ఇస్తాడు.

• బాక్స్ ధర రూ.800-1200 మధ్య ఉంటుంది. ఇది కాకుండా డిష్ యాంటెన్నా, కేబుల్ వైర్, ఎల్ ఎన్ బి (లో నాయిస్ బ్లాక్- డౌన్ కన్వర్టర్) విడిగా తీసుకోవాల్సి ఉంటుంది.
• ప్రస్తుతానికి ఆన్ లైన్ లో దొరకదు. డీలర్ దగ్గర కొనుక్కోవాలి. ఇన్ స్టాల్ చేసిపెట్టే సౌకర్యం దేశమంతటా అన్నీ రాష్ట్రాలలో ఉంటుంది.

తెలుగు రాష్ట్రాలకు పనికొస్తుందా?

డిష్ టీవీ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందుకంటే డీడీ ఫ్రీడిష్ కంటే ఇది మెరుగ్గా ఉన్నట్టు కనబడుతోంది. అంతకంటే ఎక్కువ ఫ్రీ చానల్స్ ఇవ్వటం వలన. ఇంకో విషయమేంటంటే ఇతర ప్లాట్ ఫామ్స్ లో కొనుక్కోవాల్సిన కొన్ని చానల్స్ కూడా ఇందులో ఉచితంగా దొరుకుతున్నాయి. అందులో ప్రధానంగా స్టార్ ఉత్సవ్ , స్టార్ ఉత్సవ్ మూవీస్, సోనీ పాల్ సోనీ వాహ్ , జీ అన్మోల్, జీ అన్మోల్ సినిమా, జింగ్, కలర్స్ రిష్టే, ఎండీటీవీ, ఆజ్ తక్ లాంటి 26 చానల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉత్తరాది వారు నెలవారీ చందా కడుతున్న పే చానల్స్ కానీ ఇప్పుడు జింగ్ సూపర్ ఎఫ్ టి ఏ బాక్స్ తో ఉచితంగా చూడవచ్చు. అందువలన అనేకమంది డీటీహెచ్, కేబుల్ చందాదారులు కూడా ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

కానీ ఈ 230 ఉచిత చానల్స్ లో తెలుగు చానల్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దక్షిణాది చానల్స్ అన్నీ కలిపి కూడా కనీసం అర డజన్ లేవు. అందువలన తెలుగు రాష్టఱయల ప్రజాలకలు ఇది ఎంతమాత్రమూ ఉపయోగపడదు. ఇక్కడ నివసిస్తున్న ఉత్తరాది వారు ఎవరైనా ఈ బాక్స్ తీసుకోవటానికి కొంత ఆసక్తి చూపితే చూపవచ్చునేమో?

జింగ్ వ్యూహం ఫలిస్తుందా?

డీడీ ఫ్రీడిష్ కు ఈ మధ్య కాలంలో కారేజ్ ఫీజు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోంది. ఇందులో ఇచ్చే ముఖ్యమైన జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు వచ్చే ప్రేక్షకాదరణ లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో ప్రకటనల ఆదాయం బాగా పెరుగుతోంది. అందుకే ఏడాదికి 8 నుంచి 10 కోట్ల దాకా కారేజ్ ఫీజు కట్టటానికి కూడా చానల్స్ వెనుకాడటం లేదు. ఇదే లాభాన్ని దక్కించుకుందామన్నది జింగ్ వ్యూహంలా కనబడుతోంది. పైగా, డీడీ ఫ్రీడిష్ కంటే ఆదనంగా మరో 50 చానల్స్ కూడా ఇవ్వటంలో ఉన్న ఉద్దేశ్యం మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకోయవటం, మరిన్ని చానల్స్ ను ఆకట్టుకోని కారేజ్ ఫీజు సంపాదించుకోవటం. ఎందుకంటే బ్రాడ్ కాస్టర్లు అలా చెల్లించటానికి సిద్ధంగా ఉన్నట్టు ఫ్రీడిష్ ఉదాహరణ స్పష్టంగా తెలియజేస్తోంది.
చట్టపరమైన చిక్కులు వస్తాయా?

డిజిటైజేషన్ లో ఒక ప్రధానమైన అంశం – అన్నీ పంపిణీ సంస్థలకూ బ్రాడ్ కాస్టర్లు తమ పే చానల్స్ ను ఒకే ధరకు ఇవ్వాలి. ఏ విధమైన తేడా చూపటానికీ వీల్లేదు. అయినా సరే, కొన్ని పే చానల్స్ మాత్రం డీడీ ఫ్రీడిష్ కు ఉచితంగా ఇస్తున్నాయి. దీనిమీద డీటీహెచ్ ఆపరేటర్లు ఒక పక్క యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే ట్రాయ్ ఈ విషయంలో ఇంకా మౌనంగానే ఉంది. దూరదర్శన్ విషయం పట్టించుకోకుండా ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కు మాత్రమే అన్నీ నియమాలూ వర్తింపజేస్తున్న ట్రాయ్ ఇప్పుడు ప్రసార భారతికి చెందిన ఫ్రీడిష్ విషయాన్ని కూడా పట్టించుకోవటం లేదు. ఒకవేళ అదే సమాధానమైతే సమాన పోటీ అవకాశాలను కాలరాచినట్టే అవుతుంది. ట్రాయ్ స్పందన ఆధారంగా డీటీహెచ్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

అదే విధంగా బ్రాడ్ కాస్టర్లు ఇప్పుడు జింగ్ కు ఉచితంగా ఇస్తే ఆ చానల్స్ ను ఇతర డీటీహెచ్ ఆపరేటర్లకు కేబుల్ ఎమ్మెస్వోలకు కూడా ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళే స్వయంగా అడిగితే కారేజ్ ఫీజు ఆడగకపోతే ఇస్తామంటారు. కానీ కారేజ్ ఫీజు లేకపోతే ఆదాయం ఎలా? ఇక్కడ కూడా డిమాండ్ అండ్ సప్లై సూత్రం ముందుకొస్తుంది. ‘జింగ్’ విజయవంతం కావటానికి మరో మార్గమేమిటంటే దక్షిణాది ఉచిత చానల్స్ బాగా పెంచి, ఇక్కడ ఫ్రీడిష్ లేని లోటును కూడా భర్తీ చేసుకోవటం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోవటం.

  • తోట భావనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here