డిజిటల్ మీడియాలో విదేశీ పెట్టుబడుల వివరాలు కోరిన ప్రభుత్వం

0
521

డిజిటల్ మీడియాను తన పరిధిలోకి తెచ్చుకున్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ క్రమంగా నియంత్రణ దిశలో అడుగులేస్తోంది. ముందుగా వార్తలతో సంబంధం ఉన్న అన్ని డిజిటల్ వేదికలూ తమ సంస్థలో విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను వెల్లడించాలని నిర్దేశించింది. అన్ని వెబ్ సైట్లు, న్యూస్ పోర్టల్స్, న్యూస్ ఏజెన్సీలు, న్యూస్ అగ్రిగేటర్లు ( వివిధ సంస్థల వార్తలను ఒకచోట చేర్చి అందించే సంస్థలు) నెలరోజులలోగా తమ సంస్థలలో పెట్తుబడుల వివరాలు చెప్పాలని నిన్న ( సోమవారం) ఆదేశాలిచ్చింది.
డిజిటల్ మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులమీద 26% పరిమితి విధిస్తూ పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం మీద చేసిన సవరణలతో ఒక నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. జాయింట్ సెక్రెటరీ సుమితా దావ్రా సంతకంతో వెలువడిన ఈ వివరణ ప్రకారం డిజిటల్ మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26% గా నిర్దేశించారు.
అందుకే ఇప్పుడు విదేశీ పెట్టుబడులున్న డిజిటల్ మీడియా సంస్థలన్నీ తమ కంపెనీలో ఎవరెవరి పేర్లమీద ఎన్నెన్ని వాటాలున్నాయి, వాటాదార్ల, డైరెక్టర్ల పేర్లు, అడ్రస్ లు నెలరోజుల్లోగా సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు అందజేయాలనే నియమం పెట్టింది. విదెశీప్రత్యక్ష పెట్టుబడుల విధానానికి అనుగుణంగా ఆ పెట్తుబడులు వచ్చినదీలేనిదీ కూడా తెలియజేయాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఇప్పటికే 26% మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులున్న సంస్థలు తమ సమాచారాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు తెలియజేయటంతోబాటు 2021 అక్టోబర్ 15 లోగా దాన్ని 26 % లోపుకు తెస్తామని చెప్పి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇకమీదట తాజాగా పెట్టుబడులు తెచ్చుకోవాలనుకునే డిజిటల్ మీడియా సంస్థలు ముందుగా మంత్రిత్వశాఖకు తెలియజేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలాంటి వారు కనీసం 60 రోజులముందుగా దరఖాస్తు చేసుకోవాలి.
పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి) ఇచ్చిన వివరణ ప్రకారం డిజిటల్ మీడియా అంటే:
• వెబ్ సైట్స్ లో, యాప్స్ లో, ఇతర వేదికలలో న్యూస్, కరెంట్ ఎఫైర్స్ అప్ లోడ్ /స్ట్రీమ్ చేసే సంస్థలు;
• డిజిటల్ మీడియా సంస్థలకు, న్యూస్ అగ్రిగేటర్లకు వార్తలు అందించే న్యూస్ ఏజెన్సీలు
• వివిధ వనరులనుంచి వార్తాంశాలు సమీకరించి సాఫ్ట్ వేర్/వెబ్ అప్లికేషన్స్ ను వాడుకుంటూ పంపిణీ చేసే న్యూస్ అగ్రిగేటర్లు
ఈ సంస్థలన్నిటినీ ఇప్పుడు డిజిటల్ న్యూస్ మీడియా కింద పరిగణించి విదేశీప్రత్యక్ష పెట్టుబడులమీద 26% పరిమితిని ప్రయోగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here