డీడీ ఫ్రీడిష్ సిగ్నల్స్ చౌర్యం: ఎమ్మెస్వో లైసెన్స్ రద్దు

0
655

ప్రసార భారతి వారి ఉచిత డీటీహెచ్ వేదిక డీడీ ఫ్రీడిష్ సిగ్నల్స్ దొంగలించి తన నెట్ వర్క్ లో పునఃప్రసారం చేసిన ఆరోపణ మీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒక ఎమ్మెస్వో లైసెన్స్ ను రద్దు చేసింది. ఆ ప్రసారం వీడియో రికార్డింగ్ లో డీడీ ఫ్రీడిష్ లోగో తోబాటు దాన్ని ప్రసారం చేసిన బి సి ఎన్ లోగో ( ఆంధ్రప్రదేశ్ లోని బి సి ఎన్ కాదు) కూడా కనబడుతోంది. అదే ఎమ్మెస్వో కు చెందిన ఇతర చానల్స్ కూడా ప్రసారం కావటం గుర్తించి నిర్థారించుకున్నారు. ఆ వీడియో లో స్పష్టంగా ఉండటం వలన నమ్మకపోవటానికి ఎలాంటి కారణమూ లేదని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఆ విధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో కేబుల్ టీవీ సేవలందించే భూస్వాల్ కేబుల్ నెట్ వర్క్ ( బీసీన్) లైసెనసలును రద్దు చేసింది.

భూస్వాల్ కేబుల్ నెట్ వర్క్ కు 2015 లో లైసెన్స్ వచ్చింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఛానల్స్ పంపిణీ వ్యాపారం చేసుకునే అవకాశముంది. అయితే కేబుల్ టీవీ చట్టానికీ, సంబంధిత నియమాలకూ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో బీసీన్ మీద సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఒక ఫిర్యాదు అందింది. డీడీ ఫ్రీడిష్ నుంచి సిగ్నల్స్ తీసుకొని వాటిని తన నెట్ వర్క్ ద్వారా పంపిణీ చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎంఐబి అధికారులు ఈ ఆరోపణలమీద విచారణ జరిపించారు.

ప్రసార భారతి ఆధ్వర్యంలో నడిచే డీడీ ఫ్రీడిష్ అనేది ఉచిత డీటీహెచ్ వేదిక. చందారుడు ఒకసారి డిష్ యాంటెన్నా, సెట్ టాప్ బాక్స్ కొనుక్కుంటే నెలవారీ చందా కట్టాల్సిన అవసరం లేకుండా దాదాపు 100 ఉచిత చానల్స్ అందిస్తుంది. అందులో స్థానం కోసం ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ ఈ-వేలంలో పాల్గొని కోట్లకొద్దీ కారేజ్ ఫీజు రూపంలో చెల్లిస్తుంటాయి. ఉత్తరభారత దేశంలో గ్రామీణ ప్రాంతాలను డీడీ ఫ్రీడిష్ బాగా ఆకట్టుకోగలిగింది. అందుకే ప్రకటనల ఆదాయం కావాలనుకునేవారు ఇందులో స్లాట్ సంపాదించటానికి పెద్దమొత్తంలొ వెచ్చించటానికి ప్రయత్నిస్తారు.

భూస్వాల్ కేబుల్ నెట్ వర్క్ (బీసీఎన్) పైరసీకి పాల్పడుతూ ఫ్రీడిష్ సిగ్నల్స్ వాడుకుంటున్నట్టు తెలియగానే నియమించిన విచారణ సంఘం అది నిజమేనని తన నివేదికలో తేల్చి చెప్పింది. అది రుజువు చేసేందుకు అందిన వీడియో నిజమైనదేనని, ఎలాంటి అనుమానాలకూ ఆస్కారం లేదని కూడా స్పష్టం చేసింది. కేబుల్ టీవీ చట్టంలోని నిబంధనలను అతిక్రమించినందుకు ఆ ఎమ్మెస్వోకు ఈ ఏడాది సెప్టెంబర్ 24 న షో కాజ్ నోటీస్ ఇచ్చారు. ఇదంతా అబద్ధమని వాదించినప్పటికీ అందుకు తగిన ఆధారాలివ్వటంలో ఎమ్మెస్వో విఫలమైనట్టు ఎం ఐ బి పేర్కొంది. వ్యాపార శత్రువులు తన ప్రతిష్ఠ దెబ్బతీయటానికే ఇలా చేశారని కూడా ఎమ్మెస్వో ఆరోపించారు.

అయితే భూస్వాల్ కేబుల్ నెట్ వర్క్ తన మీద వచ్చిన ఆరోపణలకు సంతృప్తికరమై న సమాధానం ఇవ్వటంలో విఫలమైందని, తన వాదనను బలపరచుకోగలిగే సమాధానం, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించటంలో కూడా విఫలమైందని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. అందువలమ 2015 నవంబర్ 4 న ఇచ్చిన లైసెన్స్ ను తక్షణమే ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, లైసెన్స్ రద్దు విషయంలో ఈ ఎమ్మెస్వో అప్పీలు చేసుకోదలచుకుంటే అందుకు కూడా అవకాశముందని ఎం ఐ బి పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here