భారీగా తగ్గనున్న కేబుల్ టీవీ కనెక్షన్లు

0
1714

భారత దేశంలో కేబుల్ టీవీ కనెక్షన్లు భారీగా తగ్గుతాయని మీడియా పార్ట్నర్స్ ఏషియా సంస్థ లెక్కగట్టింది. ఇప్పుడు 56% వాటా కేబుల్ టీవీది ఉండగా 2025 నాటికి అది 46% కు పడిపోతుందని, డిటిహెచ్ వాటా పెరుగుతుందని అంచనావేసింది. అదే విధంగా పే టీవీ చందాదారుల సంఖ్య 13 కోట్ల 40 లక్షలకు, చందా ఆదాయం 1230 కోట్ల డాలర్లకు పెరుగుతుందని కూడా చెబుతోంది.
సగటున ఏడాదికి 7% చొప్పున టీవీ పరిశ్రమ ఆదాయం పెరుగుతుందని పేర్కొంటూ 96 శాతం ఇళ్ళు డిజిటల్ టీవీ ఇళ్ళుగా తయారవుతాయని లెక్కలు వేసింది. నిరుడి దాదాపు 10 శాతం ఆదాయం తగ్గిన తరువాత మళ్ళీ పుంజుకొని ఈ ఎదుగుదల సాధిస్తుందని చెప్పింది. నిరుడు కోవిడ్ వలన కేవలం 890 కోట్ల డాలర్ల ప్రకటనల ఆదాయానికే ఆదాయం పరిమితం కావాల్సి వచ్చినా ప్రకటనల ఆదాయం ఇక మీదస్ట ఏటా 12% చొప్పున పెరుగుతుందని లెక్కగట్టింది.
ఇక డిటిహెచ్ ఇళ్ల సంఖ్య విషయానికొస్తే, ఇప్పుడున్న 5కోట్ల 80 లక్షల డిటిహెచ్ ఇళ్ళ సంఖ్య 2025 నాటికి కోటికి పైగా పెరుగుతాయని, ఆ విధంగా మొత్తం డిటిహెచ్ ఇళ్ళ సంఖ్య 6 కోట్ల 80 లక్షలు దాటతాయని మీడియా పార్టన్ర్స్ ఏషియా చెబుతోంది. అదే సమయంలో కేబుల్ కనెక్షన్లు మరింతగా తగ్గిపోతాయని, మార్కెట్లో ఇప్పుడున్న 54% వాటా తగ్గిపోయి 46% కు పరిమితం కావాల్సి వస్తుందని చెప్పింది. అయితే, ఈ తగ్గుదలలో కొంతభాగాన్ని డిటిహెచ్ తీసుకుంటుండగా కొంతభాగాన్ని ఐపిటీవీ తీసుకుంటుందని అంచనావేసింది.
పట్టణ ప్రాంతాలలో కేబుల్ టీవీ కొంతమేరకు నిలబడటానికి కారణం ఫైబర్ ద్వారా అందించే బ్రాడ్ బాండ్ సేవలే అవుతాయని కూడా ఆ నివేదిక అభిప్రాయపడింది. పే టీవీ బ్రాడ్ కాస్టర్లు నిరుడు 440 కోట్ల డాలర్ల ఆదాయం సమకూర్చుకోగా అందులో 62శాతం ప్రకటనల ద్వారా, 38శాతం చందాల ద్వారా వచ్చిందని, ఆ విధంగా చూసినప్పుడు ప్రకటనల ఆదాయం బాగా పడిపోగా, ఇప్పుడు చాలా వేగంగా కోలుకుంటున్నదని పేర్కొంది.
ట్రాయ్ భారీ నిబంధనల కారణంగా పే టీవీ కార్యక్రమాల తయారీలో పెట్టుబడుకు గణనీయంగా తగ్గాయని, చందాధరలు పెంచుకునే అవకాశం లేకపోవటం ఇందుకు కారణమని ఈ నివేదిక విశ్లేషించింది. దీనివలన ప్రసారాల నాణ్యత తీవ్రంగా దెబ్బతినే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించింది. నామమాత్రంగా నడిచే చానల్స్, పరిమిత అంశాలు ప్రసారం చేసే చానల్స్ మూతబడినా ఆశ్చర్యం లేదని, ట్రాయ్ నిబంధనలు సడలించి పే చానల్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తే తప్ప పరిస్థితి ఆశాజనకంగా ఉండకపోవచ్చునని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here