కేబుల్ టీవీ/డిటిహెచ్ చందాదారుల హక్కులు

0
688

డిజిటైజేషన్ వలన ధరలు పెరగటం అనేది ఒక పార్శ్వం మాత్రమే. అదే సమయంలో చందాదారుల ప్రయోజనాలు కాపాడటానికి, హక్కులు కల్పించటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ట్రాయ్ అనేక చర్యలు తీసుకోవటం రెండో పార్శ్వం. ట్రాయ్ కల్పించిన హక్కుల గురించి, సేవల పరంగా చందాదారు డిమాండ్ చేయదగిన అంశాల గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే డిజిటైజేషన్ ఫలితం చందాదారునికి దక్కినట్టవుతుంది. అందుకే, పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు తమ చందాదారులకు అందించాల్సిన సేవల గురించి స్థూలంగా తెలియజెప్పటం ఈ వ్యాసం లక్ష్యం.

సెట్ టాప్ బాక్స్

 టీవీ చానల్స్ పంపిణీ సంస్థలు లేదా వారి పరిధిలోని కేబుల్ ఆపరేటర్ ప్రామాణికమైన సెట్ టాప్ బాక్స్ ను చందాదారుకు అమ్మవచ్చు. లేదా, తన నెట్ వర్క్ కు తగినట్టు ఉన్న బాక్స్ మార్కెట్లోనూ కొనుక్కోవచ్చునని చెప్పాలి
 చందాదారుడు అడిగిన పక్షంలో అద్దెకు, వాయిదాల పద్ధతిలో కొనుగోలుకు కూడా అవకాశం ఇవ్వాలి. తాను ఇవ్వజూపుతున్న సెట్ టాప్ బాక్స్ (డిటిహెచ్ అయితే డిష్, సెట్ టాప్ బాక్స్) స్కీమ్స్ గురించి తెలియజేయాలి
 ఈ పరికరాల వివరాలను, ధరలను, స్కీములను వెబ్ సైట్ లో ప్రచురించాలి.
 ఏకమొత్తం చెల్లించి కొనుక్కునే పక్షంలో ధర చెప్పాలి. గ్యారెంటీ/వారంటీ వ్యవధి ఏడాదికి తగ్గకూడదు.
 అలా కొనుక్కున్న సెట్ టాప్ బాక్స్ మీద యాజమాన్య హక్కు చందాదారుకే ఉంటుంది.
 కొనుక్కున్నవారికి గ్యారెంటీ/వారంటీ ముగిసిన తరువాత కాలంలో మరమ్మతులకు స్కీము ప్రకటించవచ్చు.
 చందాదారుడు సెట్ టాప్ బాక్సు ఫీచర్లను బలవంతంగా మార్చే ప్రయత్నం చేస్తే పై నిబంధనలు వర్తించవు.
 ట్రాయ్ నిబంధనలకు లోబడి అద్దె నిర్ణయించవచ్చు. వడ్డీ లేకుండా తిరిగి ఇచ్చేలా డిపాజిట్ కూడా కోరవచ్చు.
 అద్దెకు ఇచ్చినప్పుడు సెట్ టాప్ బాక్స్ మీద యాజమాన్యం పంపిణీదారుకే ఉంటుంది.
 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు ( బేసిక్ కేబుల్ బిల్లు), పే చానల్స్ బిల్లు, సెట్ టాప్ బాక్స్ ధర విడివిడిగా చెబుతూ మొత్తం కలిపి తగ్గింపు ధరకు కూడా పంపిణీదారుడు ఇవ్వవచ్చు.
 చందాదారుకు అమ్మినా, అద్దెకిచ్చినా కనీసం మూడేళ్ళపాటు ప్రసారాలలో అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత పంపిణీదారు/ స్థానిక ఆపరేటర్ మీదనే ఉంటుంది. అయితే చందాదారుడే చెడగొట్టి ఉండకూడదు.
 డిటిహెచ్ ఆపరేటర్ అయితే మరమ్మతుకోసం మనిషిని ఇంటికి పంపినందుకు ఒక్కో విడతకు రూ. 250 మించకుండా తీసుకోవచ్చు. అయితే సెట్ టాప్ బాక్స్ సంబంధమైన మరమ్మతు అయితే వచ్చినందుకేమీ తీసుకోరు.
 మరమ్మతుకోసం వచ్చినపుడు తీసుకున్న మొత్తానికి చందాదారుకు రశీదు ఇచ్చి తీరాలి.
 సెట్ టాప్ బాక్స్ గురించి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోగా పంపిణీదారు/ఆపరేటర్ మరమ్మతు చేయించాలి.
 ఆ లోపు ఇవ్వలేని పక్షంలో తాత్కాలికంగా మరో సెట్ టాప్ బాక్స్ అమర్చాలి
 దెబ్బతిన్న బాక్స్ మరమ్మతులు పూర్తయ్యే లోపు అమర్చటానికి ప్రతి ఆపరేటర్ దగ్గర అదనపు బాక్సులుంటాయి.
 చందాదారుడే బాక్స్ చెడగొట్టినట్టు తేలితే మాత్రం ఈ నిబంధనలేవీ వర్తించవు.
కొత్త కనెక్షన్ తీసుకోవటం, తీసెయ్యటం, మార్చుకోవటం

 కేబుల్ లేదా డిటిహెచ్ కనెక్షన్ కోసం సర్వీస్ ప్రొవైడర్ కు దరఖాస్తు చేసుకున్న వారంలోగా కనెక్షన్ ఇవ్వాలి. అయితే, నిర్వహణపరంగా, సాంకేతికంగా సాధ్యంకావాలి. ఊరికి దూరంగా ఉంటే కేబుల్ ఆపరేటర్ నిరాకరించవచ్చు.
 తన నెట్ వర్క్ నుంచి కోరుకున్న చానల్స్ లేదా బొకే కనీసం మూడు రోజుల్లో ( 72 గంటల్లో) ఇవ్వాలి.
 మొదటి సారి చందాకట్టే వాళ్ళకు వినియోగదారు దరఖాస్తు ఇంచి నింపించుకుంటూ సేవల పూర్తి వివరాలు పొందుపరచాలి. ఒక కాపీ చందాదారుకివ్వాలి. ఇది ఇచ్చాక సమాచారం నిల్వచేసుకొని కనెక్షన్ యాక్టివేట్ చేస్తారు
 కనెక్షన్ ఇచ్చినప్పటినుంచి కాకుండా, యాక్టివేషన్ జరిగిన రోజునుంచి కేబుల్ చార్జీలు అమలులోకి వస్తాయి
 సెట్ టాప్ అమర్చినందుకు ఏకమొత్తంగా రూ.350 , యాక్టివేషన్ కు రూ.100 ఆపరేటర్ అడగవచ్చు.
 కనెక్షన్ ఇచ్చేటప్పుడే సేవల సమాచారం, చానల్స్ గరిష్ఠ చిల్లర ధరలు, బొకే ధరలు, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు (కనీస కేబుల్ బిల్లు), సెట్ టాప్ బాక్స్ అద్దె, సెక్యూరిటీ డిపాజిట్, గ్యారెంటీ/వారంటీ లాంటి వివరాలు తెలియజేయాలి
 సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి చందాదారుకూ ఒక గుర్తింపు సంఖ్య కేటాయించాలి. ఆ నెంబర్ తోనే చందాదారును గుర్తిస్తూ నెలవారీ బిల్లు సహా అన్ని విషయాలూ తెలియజేస్తుంటారు
 చందాదారుడు కోరకుండా పంపిణీదారుడు సేవలలో ఎలాంటి మార్పూ చేయకూడదు.
 చందాదారుడు ఏ మార్పు కోరినా సంబంధిత రికార్డు కనీసం 3 నెలలపాటు భద్రపరచాలి, అడిగినప్పుడు చూపాలి
 దానిమీద ఏదైనా ఫిర్యాదు ఉంటే అది పరిష్కారమయ్యేవరకు భద్రపరచాలి.
 ఏదైనా చానల్ గాని, బొకే గాని తన సర్వీస్ నుంచి తొలగించమని చందాదారు కోరితే 72 గంటల్లోపు తొలగించాలి.
 అయితే, ఏదైనా చానల్ గాని బొకే గాని కనీసం ఒక నిర్దిష్ట కాలం తీసుకోవాలని పంపిణీదారుడు తన వెబ్ సైట్ లో చెప్పి ఉంటే ఆ వ్యవధి లోపు ఆ చానల్ లేదా బొకే తొలగించకుండా ఉండే అధికారం పంపిణీదారుకుంటుంది.
 వ్యవధిలోపు తొలగించే అధికారం కూడా పంపిణీదారుకు ఉండదు.
 ఏ మార్పు జరిగినా చందాదారుని రిజిస్టర్డ్ మొబైల్ కు మెసేజ్ వస్తుంది.
 తన నెట్ వర్క్ నుంచి ఏదైనా చానల్ లేదా బొకే ఆగిపోయే పరిస్థితి ఉంటే పంపిణీదారుడు 15 రోజుల ముందే స్క్రోల్ ద్వారా తెలియజేయాలి. ఇలా ముందస్తు నోటీసు లేకుండా చానల్ ఆపే అధికారం పంపిణీదారుకు ఉండదు.
 సాంకేతిక సమస్య కారణంగానో, ప్రకృతి వైపరీత్యాల కారణంగానో అలా జరిగినప్పుడు మినహాయింపు ఉంటుంది.
 అలా అందుబాటులో లేకుండా పోయిన సమయానికి బిల్లులో తగ్గింపు ఉంటుంది
 ఏదైనా చానల్ గాని బొకే గాని అందుబాటులో లేనప్పుడు దానికి బదులుగా పంపిణీదారుడు తన ఇష్టమొచ్చిన చానల్ ను చేర్చటానికి వీల్లేదు. చందాదారు కోరినప్పుడే కలుపుతారు.
 పే చానల్ యజమాని తన చానల్ ను ఉచిత చానల్ గా మార్చినప్పుడు, లేదా చానల్ ధర రూ.19 మించి నిర్ణయించినప్పుడు నిర్దిష్ట కాలవ్యవధితో సంబంధం లేకుండా ఆ చానల్స్ ను తొలగించి ఆమేరకు చందాదారు బిల్లు తగ్గించవచ్చు.
 ఏవైనా కొత్త బొకేలు ప్రకటించాలనుకుంటే 15 రోజులపాటు ప్రచారం కల్పించి ఆ తరువాత చందాదారు కోరితే అలా కోరిన 72 గంటల్లోపు అమలు చేయవచ్చు. పంపిణీదారుడు తనకు తాను నిర్ణయం తీసుకోకూడదు.
 తాత్కాలికంగా సేవలు నిలిపివేయాలని చందాదారుడు కోరదలచుకుంటే కనీసం15 రోజుల ముందు చెప్పాలి.సేవలు నిలిపివేయాల్సిన వ్యవధి కనీసం నెలరోజులపాటు ఉండాలి. ఆ సమయానికి ఎలాంటి బిల్లూ వసూలు చేయకూడదు. సెట్ టాప్ బాక్స్ అద్దెకు తీసుకుని ఉంటే ఆ అద్దె మాత్రం కట్టాలి.
 వరుసగా మూడు నెలలు మించి సేవలు నిలిపివేసిన పక్షంలో కనెక్షన్ డీయాక్టివేట్ అవుతుంది.
 కనెక్షన్ తిరిగి కావాలని అడిగిన 72 గంటల్లోగా సేవలు పునరుద్ధరించాలి. 3 నెలల్లోపే అలా కోరితే పునరుద్ధరణ ఫీజుకింద రూ. 25 అడగవచ్చు. 3 నెలలు దాటితే రూ.100 చెల్లించాల్సి వస్తుంది.
 72 గంటలకు మించి ప్రసారాలకు అంతరాయం ఏర్పడితే నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులోను, పంపిణీదారుకు అందే పే చానల్స్ ధరలోను ఆ వ్యవధికి లెక్కగట్టి తగ్గింపు ఇస్తారు. అయితే, అది ఫిర్యాదు చేసిన సమయం నుంచి లెక్క.
 ప్రకృతివైపరీత్యాల కారణంగా సేవలు ఆగినప్పుడు తగ్గింపు నిబంధన వర్తించదు.
 పంపిణీదారుని పరిధిలోనే ఒక చోటు నుంచి మరొకచోటుకు మారాల్సి వస్తే అది సాంకేతికంగా సాధ్యమయ్యే చోటు అయితే అడిగిన తేదీనుంచి వారంలోగా అమర్చాలి.
 మార్చినందుకు కేబుల్ కనెక్షన్ అయితే రూ.350 మించకుండా వసూలు చేసుకోవచ్చు. డిటిహెచ్ అయితే డిష్, ఎల్ ఎన్ బి కన్వర్టర్, కనెక్టర్లు లాంటివి తొలగించి మళ్ళీ అమర్చాలి కాబట్టి రూ.700 వసూలు చేసుకోవచ్చు.
 నిర్వహణ సంబంధమైన మరమ్మతుల కారణంగా ప్రసారాలు ఆగిపోయే విషయం 3 రోజులముందే చెప్పాలి.
 చందాదారు తన కనెక్షన్ తీసెయ్యాలనుకుంటే 15 రోజులముందు తెలియజెయ్యాలి. బిల్లుల సర్దుబాటు తరువాత రిఫండ్ రావాల్సి ఉంటే తొలగించిన వారంలోగా చందాదారుకు చెల్లించాలి.
 ఏదైనాకారణం వలన పంపిణీదారుడు తన సేవలు ఉపసంహరించుకోవాలనుకుంటే కనీసం 15 రోజులముందే తెలియజేయాలి. స్క్రోల్ నడపాలి. ఈ-మెయిల్ ద్వారా, మొబైల్ కి మెసేజ్ ద్వారా తెలియజేయాలి.

చానల్స్ ఎంపిక

 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద రూ. 130 (ప్లస్ జీ ఎస్టీ) అందరూ కట్టాల్సిందే. అందులో భాగంగా వచ్చే 200 ఉచిత చానల్స్ తీసుకోకపోయినా సరే.
 పే చానల్స్ తీసుకోకపోయినా ఇది తప్పదు. పే చానల్స్ తీసుకుంటే బిల్లు అదనం.
 ఉచిత చానల్స్ లో అందుబాటులో ఉన్న హెచ్ డి చానల్ ఒకటి తీసుకుంటే అది రెండు ఎస్ డి చానల్స్ కు సమానం. అంటే, నాలుగు హెచ్ డి చానల్స్ తీసుకుంటే వందలో ఇంకా ఎంచుకునే అవకాశమున్నవి 192
(200 – 4×2) మాత్రమే.
 ఈ 200 కు అదనంగా లోనే పంపిణీదారుడు తప్పనిసరిగా ఇవ్వాల్సినవి 26 దూరదర్శన్ చానల్స్. తెలుగు ఉచిత చానల్స్ లో 20 కి పైగా న్యూస్ చానల్స్, ఐదు ఎంటర్టైన్మెంట్ చానల్స్ , పదికి పైగా ఆధ్యాత్మిక చానల్స్ ఉన్నాయి కాబట్టి సహజంగానే వాటన్నిటినీ కోరుకుంటారు.
 ఉచిత చానల్స్ ఎంచుకునే హక్కు చందాదారుడిదే తప్ప పంపిణీదారుడిది కాదు. అందువలన సగటున కనీసం 250 చానల్స్ ఇచ్చి అందులో ఎంచుకోమని అడుగుతారు. హిట్స్ ఆపరేటర్ ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఇవ్వగలుగుతున్నారు.
 పే చానల్స్ ను బొకే గా లేదా విడివిడిగా (అ లా కార్టే పద్ధతిలో) ఎంచుకోవచ్చు.
 పంపిణీదారుడు సొంత చానల్స్ కూడా ప్రసారం చేసుకోవచ్చు.
 ఎంచుకోవటం పూర్తయితే బిల్లు, జీఎస్టీ కలిసి మొత్తం బిల్లు లెక్కగట్టుకోవచ్చు.
 సులభంగా లెక్కతేల్చుకోవటానికి ఒక యాప్ కూడా సిద్ధమైంది.
https://play.google.com/store/apps/details?id=trai.mrp&hl=en

చానల్స్ జాబితా మొత్తం చూడటానికి, ధరలు తెలుసుకోవటానికి, ఎంచుకొని ధర సరిచూసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చందాదారులతోబాటు వాళ్ళదగ్గరికి వెళ్ళే ఆపరేటర్ కూ బాగా ఉపయోగపడుతుంది.

కేబుల్ బిల్లు

 ఎమ్మెస్వో, లేదా డిటిహెచ్ ఆపరేటర్ ప్రీ పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ విధానంలో బిల్లు వసూలు చేసుకోవచ్చు.
 కొందరికి ప్రీపెయిడ్ విధానం, మరికొందరికి పోస్ట్ పెయిడ్ విధానం కూడా వర్తింపజేయవచ్చు.
 ప్రీపెయిడ్ బిల్లు ప్రకారం సేవలు వాడుకోకపోతే తరువాత బిల్లులో సర్దుబాటు చేయవచ్చు
 చెల్లింపు విధానం మార్చుకోవాలనుకుంటే పంపిణీదారుడు అదనపు రుసుమూ వసూలు చేయకూడదు.
 కనెక్షన్ యాక్టివేషన్ అయినప్పటినుంచీ బ్రాడ్ కాస్టింగ్ సేవలు లెక్కలోకి వస్తాయి
 బిల్లింగ్ సైకిల్ పూర్తయిన వారం లోగా ఎస్ ఎమ్ ఎస్ నుంచి పోస్ట్ పెయిడ్ బిల్లు తయారై వస్తుంది
 పోస్ట్ పెయిడ్ చందాదారులకు కాలెండర్ నెల ఆధారంగా బిల్లింగ్ సైకిల్ ఉంటుంది.
 ప్రీపెయిడ్ చందాదారుల బిల్లింగ్ సైకిల్ యాక్టివేషన్ జరిగిన రోజునుంచి 30 రోజులుంటుంది.
 ఎమ్మెస్వో, ఆపరేటర్ మధ్య ఒప్పందాన్ని బట్టి వాళ్లలో ఎవరిద్వారా బిల్లు వస్తుందనేది ఆధారపడి ఉంటుంది.
 బిల్లులో విడివిడిగా నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు , సెట్ టాప్ బాక్స్ అద్దెకు తీసుకొని ఉంటే ఆ అద్దె, ఆ నెలలో ఎంచుకున్న పే చానల్స్/బొకే ల ధరలు, ఇతర సేవలు వాడుకుంటే వాటి విలువ, జీఎస్టీ ఉంటాయి.
 బిల్లింగ్ సైకిల్ ముగిసిన 15 రోజుల్లోగా బిల్లు అందాలి.
 ప్రింటెడ్ బిల్లు ఇవ్వాలా, ఎలక్ట్రానిక్ రూపంలో చాలునా అనేది చందాదారుడే కోరుకోవచ్చు
 బిల్లు తయారైన తేదీనుంచి చెల్లింపుకు కనీసం 21 రోజుల సమయం ఇవ్వాలి.
 చెల్లింపులో ఆలస్యం జరిగితే, స్టేట్ బ్యాంక్ ప్రాథమిక వడ్డీరేటుకు 2% అదనంగా బారు వడ్డీ విధించవచ్చు.
 చందాదారుడు ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించటానికి పంపిణీదారుడే వెసులుబాటు కల్పించాలి
 వరుసగా 3 నెలలపాటు చెల్లించకపోతే ప్రసార సేవలు నిలిపివేస్తూ ఎస్ ఎమ్ ఎస్ నుంచి డీయాక్టివేట్ చేయవచ్చు.
 సేవలు పునరుద్ధరించాలంటే వడ్డీతో సహా బకాయిలు, రూ.100 దాకా రీయాక్టివేషన్ ఫీజు కట్టాలి.
 ఏ చెల్లింపు జరిగినా తేదీ, సీరియల్ నెంబర్, చెల్లింపు మొత్తం నింపిన రసీదు వారంలోగా చందాదారుకు పంపాలి.
 ఈ చెల్లింపుల వివరాలు వెబ్ సైట్ లో కనీసం 6 నెలలు నిల్వ ఉండాలి. చందాదారు చూసుకునే వీలుండాలి.
 ఎంతమంది విషయంలో ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.20 చొప్పున వారి సంఖ్యతో గుణించి పెనాల్టీ వేస్తారు.
 ప్రీపెయిడ్ అకౌంట్ లో బాలెన్స్ లేకపోతే తాత్కాలికంగా ప్రసార సేవలు నిలిపివేయవచ్చు. అలా 3 నెలలు కొనసాగితే డీయాక్టివేట్ చేసి సేవలు పునరుద్ధరించినప్పుడు రీయాక్టివేషన్ ఫీజు రూ.100 దాకా తీసుకోవచ్చు.

ఫిర్యాదులు, పరిష్కారం

 ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ఆపరేటర్ చందాదారులకు ప్రసార సేవలు అందించటానికి ముందే కస్టమర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి.
 సేవలకు సంబంధించిన అభ్యర్థనలు, ఫిర్యాదులు తెలియజేయటానికి వీలుగా టోల్ ఫ్రీ కస్టమర్ కేర్ నెంబర్ ఇవ్వాలి
 వెబ్ సైట్ ను, వెబ్ సైట్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రచారం చెయ్యాలి. సొంత చానల్స్ లో స్క్రోల్ కూడా వెయ్యాలి. బిల్లులు, రసీదుల మీద కూడా నెంబర్ ముద్రించి ప్రాచుర్యం కల్పించాలి.
 చందాదారుల ఫిర్యాదుల రద్దీకి తగినట్టుగా లైన్లు, సిబ్బంది ఉండేలా చూసుకోవాలి.
 ప్రతిరోజూ కనీస ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటలవరకు అందుబాటులో ఉండాలి.
 హిందీ, ఇంగ్లీషుతోబాటు ప్రాంతీయ భాషలో సేవలందించాలి
 ఫిర్యాదుల నమోదుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ ఎస్) ఏర్పాటు చేయాలి. ముందుగా భాష ఎంచుకోమనాలి. తరువాత ఫిర్యాదు స్వభావం తెలుసుకోవాలి. అవసరాన్నిబట్టి కస్టమర్ కేర్ ఎగ్జిక్యుటివ్ కి ఇవ్వాలి.
 సగటున ఒక నెలలో వచ్చిన 80% కాల్స్ కి 60 సెకెన్లలోపే ఎలక్ట్రానిక్ పద్ధతిలో జవాబివ్వాలి. 90% కాల్స్ కి 90 సెకెన్లలోపే ఎగ్జిక్యుటివ్ మాట్లాడాలి.
 వెబ్ సైట్ లోనూ ఫిర్యాదుల పరిష్కారానికి ఏర్పాటు జరగాలి.
 పంపిణీదారుడు తన సొంత బాధ్యతమీద కస్టమర్ కేర్ సెంటర్ ను ఏదైనా ఏజెన్సీకి కూడా అప్పగించవచ్చు.
 కస్టమర్ కేర్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రిజిస్టర్ చేసుకొని డాకెట్ నెంబర్ కేటాయించాలి.
 ఆ డాకెట్ నెంబర్ ని ఫిర్యాదు చేసిన చందాదారుకు చెప్పాలి.
 పరిష్కారం కాగానే, తీసుకున్న చర్యల గురించి చందాదారుకు చెప్పాలి. ఒకవేళ చందాదారు సంతృప్తి చెందకపోతే నోడల్ అధికారి పేరు, నెంబర్ చెప్పి సంప్రదించాల్సిందిగా సూచించాలి.
 ఫిర్యాదులన్నీ 8 గంటల్లో పరిష్కరించాలి. పనిగంటల తరువాత వచ్చిన ఫిర్యాదులు మరునాడు పరిష్కరించాలి.
 ప్రసారాలకు సంబంధించిన ఫిర్యాదులలో కనీసం 90% అయినా 24 గంటల్లో పరిష్కరించాలి.
 బిల్లింగ్ ఫిర్యాదులు వారంలోగా, రిఫండ్ చేయాల్సి ఉంటే 30 రోజుల్లోగా పూర్తిచెయ్యాలి.
 ఇవేవీ కాని ఫిర్యాదులైతే 48 గంటల్లోపు పరిష్కారం కావాలి.
 బిల్లింగ్ కి సంబంధించింది కాకపోతే ఏదీ 72 గంటలకు మించి అపరిష్కృతంగా ఉండకూడదు.
 డిజిటైజేషన్ నిబంధనలు అమలులోకి వచ్చిన నెలలోగా పంపిణీ సంస్థలు రాష్ట్రానికి ఒకరు చొప్పున నోడల్ అధికారిని నియమించాలి.
 నోడల్ అధికారి పేరు, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్, ఫాక్స్ నెంబర్ లాంటి సమాచారానికి ప్రచారం కల్పించాలి. వెబ్ సైట్ లో పెట్టాలి.
 ఒకవేళ నోడల్ అధికారి మారితే ఆ వివరాలు చందాదారులకు, ట్రాయ్ కి 10 రోజుల్లోగా తెలియజేయాలి.
 కస్టమర్ కేర్ నుంచి సంతృప్తికరమైన పరిష్కారం దొరక్కపోతే చందాదారుడు నోడల్ అధికారిని సంప్రదించవచ్చు.
 ఫిర్యాదు అందుకున్న నోడల్ అధికారి దానికొక నెంబర్ ఇస్తూ రెండ్రోజుల్లో రసీదు ఇవ్వాలి. పదిరోజుల్లోగా ఏం చర్య తీసుకున్నదీ చెప్పాలి.
 పంపిణీదారుడు (ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ఆపరేటర్) గాని, స్థానిక కేబుల్ ఆపరేటర్ గాని చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నట్టు ట్రాయ్ కి ఫిర్యాదులు అందితే వాటిమీద వేగంగా దర్యాప్తు జరపాలని పంపిణీదారుణ్ణి ట్రాయ్ ఆదేశించవచ్చు. 30 రోజుల్లోగా పరిష్కరించి ట్రాయ్ కి, చందాదారుకూ తెలియజేయాలి.
 అన్ని ఫిర్యాదుల పూర్తి సమాచారం నమోదు చేసి పరిష్కారమైన తేదీనుంచి 3 నెలలు వాటి రికార్డులను నిల్వచేయాలి. ట్రాయ్ అడిగినప్పుడు చూపించాలి.

వినియోగదారు అవగాహన

 ఎమ్మెస్వో లేదా డిటిహెచ్/హిట్స్ ఆపరేటర్ ఒక వెబ్ సైట్ నడపాలి. తన సేవల సమాచారం అందులో పొందుపరచి చందాదారులో అవగాహన పెంచాలి.
 నిబంధనలు పాటించే బాధ్యత స్వయంగా తీసుకుంటూ ఏదైనా ఏజెన్సీకి వెబ్ సైట్ బాధ్యత అప్పగించవచ్చు
 వెబ్ సైట్ తెరవగానే హోమ్ పేజ్ లో స్పష్టంగా కనబడేలా Consumer Corner కి హైపర్ లింక్ కనబడాలి.
 అందులో చానల్స్ వివరాలు, ఉచిత చానల్స్, పే చానల్స్, బొకేల వివరాలు, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు, సెట్ టాప్ బాక్స్ ధర, అద్దె వివరాలు, గ్యారెంటీ/వారంటీ, కొత్త కనెక్షన్ తీసుకునే విధానం, ఫిర్యాదుల పరిష్కార విధానం, టోల్ ఫ్రీ నెంబర్, మాన్యువల్ ఆఫ్ ప్రాక్టీస్ తదితర వివరాలన్నీ ఉండాలి
 ప్రతి ఎమ్మెస్వో లేదా డిటిహెచ్/హిట్స్ ఆపరేటర్ ఒక చానల్ ను ప్రత్యేకంగా వినియోగదారుల సమాచారం, అవగాహన కోసమే కేటాయించి నడుపుతూ ఉండాలి. దానికి అందరూ ఒకే రకంగా 999వ చానల్ కేటాయించాలి
 చందాదారుల అవగాహనకు చేపట్టిన కార్యక్రమాలమీద ట్రాయ్ కి నివేదించాలి
 చందాదారులకు తెలియాల్సిన సమాచారాన్ని టీవీ చానల్స్ తెరమీద ప్రసారం చేయకూడదు

ఇతర అంశాలు

 ఎమ్మెస్వో లేదా డిటిహెచ్ ఆపరేటర్ ఆచరణకు సంబంధించిన విధివిధానాలతో మాన్యువల్ రూపొందించి వెబ్ సైట్ లో పెట్టాలి. దీన్నే హిందీ, ఇంగ్లీష్ తోబాటు ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా స్థానిక భాషలో ముద్రించాలి.
 ఆ పంపిణీ వేదికలో అందుబాటులో ఉన్న చానల్ జాబితాను ధరలతో సహా ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ లో ఇవ్వాలి.
 ఒక విభాగానికి చెందినవి, ఒక భాషకు చెందినవి ఒకేచోట ఉండాలి. ఒక చానల్ ఒకచోట మాత్రమే రావాలి
 ఉచిత చానల్ అయితే ఫ్రీ అనేమాట ఆ చానల్ ఎదురుగా రాయాలి. పే చానల్ అయితే గరిష్ఠ చిల్లర ధర పేర్కొనాలి.
 ఉచిత చానల్స్ 100 మించి కావాలనుకుంటే ప్రతి 25 చానల్స్ కూ రూ.20 వంతున అదనంగా చెల్లించాలి
 ట్రాయ్ నిబంధనలన్నిటినీ పాటించేలా చూస్తూ ట్రాయ్ కి నివేదించటానికి ఒక అధికారిని నియమించుకోవాలి.
 పంపిణీ సంస్థల ఉద్యోగులు, ప్రతినిధులు చందాదారుల ఇంటికి కచ్చితంగా ఫొటోగుర్తింపుకార్డు ధరించి వెళ్ళాలి.
 చందాదారుల సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా వాడకూడదు.
 ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండు సెట్ టాప్ బాక్సులు కొనాల్సిందే. అయితే, ఇంటివరకూ వాడుతున్న నెట్ వర్క్ ఒకటే కాబట్టి పంపిణీదారుడు రెండో కనెక్షన్ ను 40 శాతం నెట్ వర్క్ కెపాసిటీ ఫీజుకే ఇవ్వాలి.
 సర్వీస్ ప్రొవైడర్ మారితే సెట్ టాప్ బాక్స్ పనికిరాదు. మళ్ళీ కొత్తది కొనాల్సిందే. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ఒకే రకంగా ఉండే అవకాశం లేకపోవటమే అందుకు కారణం. పరోక్షంగా బాక్స్ యజమాని పంపిణీదారుడే అవుతాడు.
 ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం చందాదారుకు లేదు. సర్వీస్ ప్రొవైడర్ కే అది నిర్ణయించే స్వేచ్చ ఉంది.
 పంపిణీ సంస్థలు స్వయంగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. చందాదారులను ఆకట్టుకోవటానికి అలా ఇవ్వవచ్చు. డిటిహెచ్ సంస్థలు ఆపరేటర్లకు వాటా ఇచ్చే అవసరం లేదు కాబట్టి చందాదారుకు రాయితీ ఇవ్వవచ్చు.

  • తోట భావనారాయణ * * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here