డిజిటల్ లో విజయవంతంగా కేబుల్ సమాచారమ్

0
660

కేబుల్ పరిశ్రమ గత కొన్నేళ్ళుగా ఎన్నో మార్పులకు లోనైంది. పాతికేళ్లకుపైగా ఈ పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది. అయితే, ఎంత నేర్చుకున్నా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మనకు సవాళ్ళుగానే మారుతూ వస్తున్నాయి. కార్పొరేట్ రంగం బలం పుంజుకునే కొద్దీ మనం వెనుకబడే పరిస్థితి వస్తుండటంతో మనం కూడా తాజా మార్పుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
నిజం చెప్పాలంటే డిజిటైజేషన్ సమయంలో మనకు ఆ అవసరం మరింత పెరిగింది. ట్రాయ్ ఏం చెబుతున్నది, ఎలాంటి నియమనిబంధనలు పెడుతున్నది, మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలలో మనకు తగిన అవగాహన లేకపోతే చిక్కుల్లో పడే ప్రమాదముందని గ్రహించాం. జాతీయ స్థాయిలో కొన్ని పత్రికలున్నా అవి ఎక్కువగా సాంకేతిక అంశాలకే పరిమితమయ్యాయి తప్ప నిబంధనల గురించి విడమరిచి చెప్పేవి లేవు. పైగా అవి ఇంగ్లిష్, హిందీ భాషలకే పరిమితమయ్యాయి.
వీటన్నిటినీ గమనించినప్పుడు తెలుగులో ఒక సమగ్రమైన పత్రిక అవసరమనిపించింది. ఆ విధంగా డిజిటైజేషన్ వేగం పుంజుకుంటున్న సమయంలోనే కేబుల్ సమాచారమ్ మాసపత్రిక తీసుకురావటం జరిగింది. సులభంగా అర్థమయ్యే తెలుగులో అలాంటి పత్రికను తీసుకురావటాన్ని మొత్తం టీవీ పరిశ్రమ ఎంతగానో అభినందించింది. నాలుగేళ్లకు పైగా మీ అందరి ఆదరాభిమానాలతో క్రమం తప్పకుండా అందిస్తూ తాజా పరిణామాలను విశ్లేషిస్తూ అవగాహన పెంచటానికి ఎంతగానో కృషి చేశాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే.
అదే సమయంలో కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. కేబుల్ సమాచారమ్ మేగజైన్ మాస పత్రిక కాబట్టి వార్తలను విశ్లేషించి తెలియజేయటానికి నెలరోజుల దాకా ఆగాల్సి వస్తున్నది. ప్రభుత్వం ఏదైనా నిబంధన అమలు చేయాలని ఆదేశించినా, దేనిమీదనైనా అభిప్రాయం కోరినా ఆవిషయం అందరికీ తెలియజేసి స్పందించమని చెప్పటానికి కూడా వీల్లేదు. మరోవైపు ముద్రణ, పంపిణీకి కూడా సమయం, డబ్బుకూడా ఎక్కువే అవసరం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితుల్లో కొన్ని వార్తలు పాతబడటమూ సమస్యగానే మారింది.
టీవీ పరిశ్రమే డిజిటైజ్ అయినప్పుడు మనం కూడా డిజిటల్ వైపు ఎందుకు వెళ్లకూడదు అనే ఆలోచన వచ్చింది. ఏ రోజుకు ఆ రోజు, ఏ నిమిషానికి ఆ నిమిషం వార్తలు అందించేలా వెబ్ సైట్ ప్రారంభించాలన్న తపన పెరిగింది. రాజకీయాలు, సినిమాలు లాంటి విషయాల కోసం ఎన్నో వెబ్ సైట్లు ఉన్నాయి. అలాంటప్పుడు కేబుల్ పరిశ్రమకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రంగంతో అనుబంధం ఉన్న దాదాపు పాతికవేలమందికి తక్షణ సమాచారం అందించగలుగుతామన్న నమ్మకం కలిగింది. ఆ విధంగా కేబుల్ సమాచారమ్ డాట్ కామ్ సరికొత్త రూపంలో మీ ముందుకొచ్చింది.
కేబుల్ రంగ సమస్యలు, బ్రాడ్ కాస్టర్ల తీరుతెన్నులు, ట్రాయ్ నిబంధనలు, ఎంఐబి ఆదేశాలు, కోర్టు తీర్పులు, టారిఫ్ ఆర్డర్ అమలు, రెండో టారిఫ్ ఆర్డర్ మీద కోర్టు కేసులు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు తెలియజేయటానికి ఇది వేదికైంది. జాతీయ స్థాయి వెబ్ సైట్స్ కు దీటుగా సమాచారం అందించటంతోబాటు స్థానిక అంశాలనూ ప్రధానంగా ప్రస్తావించటం ఒక వంతు కాగా అటు ఇంగ్లిష్ లోనూ, ఇటు తెలుగు లోనూ ఇస్తూ ద్విభాషా పోర్టల్ గా కేబుల్ సమాచారమ్ డాట్ కామ్ పరిశ్రమలో అందరి మన్ననలందుకుంటోంది. రోజుకొకసారైనా ఈ వెబ్ సైట్ చూడాలన్న అభిప్రాయం అందరిలో కలగటంలోనే దీని విజయం దాగి ఉంది.
ఎమ్మెస్వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేసే లోకల్ చానల్స్ విషయంలో కఠినమైన నిబంధనలు తీసుకువచ్చే ఆలోచనతో ట్రాయ్ ఈ డిసెంబర్ లో ఒక చర్చా పత్రం విడుదలచేసినప్పుడు దానిలో కేబుల్ పరిశ్రమకు వ్యతిరేకమైన ఆలోచనలమీద మనమంతా గొంతెత్తి నిరసన తెలియజేశాం. ఈ విధంగా అందరికీ ట్రాయ్ తలపెట్టిన విషయాలను విడమరచి చెప్పి మనం ట్రాయ్ కి మన అభ్యంతరాలు ఎలా తెలియజేయాలో నమూనా లేఖతో సహా అందించటానికి మన వెబ్ సైట్ సహాయపడింది. ఆ విధంగా దేశమంతటా పెద్ద బ్రాడ్ కాస్టర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలతో సహా 30 మంది లేఖలు పంపితే తెలుగు రాష్ట్రాలనుంచే 9 లేఖలు వెళ్లాయంటే అందులో ప్రధాన పాత్ర మన వెబ్ సైట్ దే.
పూర్తి స్థాయి వెబ్ సైట్ గా ప్రారంభమైన ఆరు నెలల కాలంలోనే యావత్ టీవీ పరిశ్రమకు దగ్గరయ్యాం. కేబుల్ టీవీ ఆపరేటర్లు, సిబ్బంది, ఎమ్మెస్వోలు ప్రధానంగా ఈ వెబ్ సైట్ తరచు చూస్తుండగా బ్రాడ్ కాస్టర్లు, జర్నలిస్టులు కూడా ఇప్పుడు అభిమానులుగా మారారు. మీ అందరి సహకారం, అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, మరింత సమాచారం అందించటానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం మనందరికీ మరింత మేలు చేయాలని ఆశిస్తూ…..
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ
సుభాష్ రెడ్డి
చీఫ్ ఎడిటర్, కేబుల్ సమాచారమ్ డాట్ కామ్
మేనేజింగ్ డైరెక్టర్, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
అధ్యక్షుడు, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here