నేడు కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం ప్రైవేట్ టీవీ చానల్స్ కు పునాది: ప్రభుత్వాలకు పట్టని అనాథ

1
725

ఈ రోజు (ఆగస్టు 21) కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం. కేబుల్ ఆపరేటర్  వ్యవస్థకు పాతికేళ్ళు దాటాయి. ఆమాటకొస్తే అక్కడక్కడా అప్పుడే పుట్టిన కేబుల్ రంగానికి మూడు దశాబ్దాలు నిండాయి. భారతదేశంలో ప్రైవేట్ బ్రాడ్ కాస్టర్లు రాకముందే కేబుల్ ఉంది. కొండప్రాంతాల్లో దూరదర్శన్ టెరెస్ట్రియల్ సిగ్నల్స్ అందని చోట కేబుల్ ద్వారా దూరదర్శన్ ప్రసారాలు అందించిననాడే మొదలైంది. నగరాలలో అపార్ట్ మెంట్లలో వీడియో కాసెట్ ప్లేయర్ ద్వారా సినిమాలు ప్రసారం చేసిన రోజుల్లోనే కేబుల్ ఉంది.

బ్రాడ్ కాస్టర్లు తమ సిగ్నల్స్ గాలిలోకి పంపటం వరకే పరిమితమైనపుడు ఆ సిగ్నల్స్ అందుకొని భూమార్గం పట్టించి ఇంటింటికీ అందించినవాడు కేబుల్ ఆపరేటర్. అందుకే కేబుల్ ఆపరేటర్ లేకపోతే చానల్స్ ఏవీ ఇళ్ళకు అందేవి కావు. డిటిహెచ్ రావటానికి ఆ తరువాత పదిహేనేళ్ళు పట్టింది. పోటీలో సహజీవనం చేసిందే తప్ప అది కేబుల్ వ్యవస్థ ఉనికిని మాత్రం పూర్తిగా దెబ్బతీయలేకపోయింది.

ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి గుర్తింపూ లేకుండా స్వతంత్రంగా ఎదిగిన వ్యవస్థ కావటం కేబుల్ రంగం ప్రత్యేకత. ఎన్నో పరిశ్రమలకు రకరకాల రాయితీలిచ్చి ఉపాధి కల్పించేలా స్వాగతం పలికే ప్రభుత్వాలు కేబుల్ రంగాన్ని పట్టించుకోలేదు. ఇలా స్వయం కృషితో ప్రభుత్వ సాయం లేకుండా ఎదిగిన ఒకే ఒక్క రంగం కేబుల్ రంగం. కరెంట్ స్తంభాలెక్కుతూ కేబుల్ వేస్తూ ఇంటింటికీ టీవీ ప్రసారాలు అందించటానికి ఆపరేటర్లు పడ్డ శ్రమ అంతా ఇంతాకాదు. టెక్నాలజీ మారుతునప్పుడు పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ తగినవిధంగా మారుతూ అత్యుత్తమ సేవలందిస్తూ ప్రేక్షకుల తలలలో నాలుకగా మారినవాడు కేబుల్ ఆపరేటర్.

ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిందేనంటూ ప్రభుత్వం డిజిటైజేషన్ మొదలుపెట్టినప్పుడు తొలిదెబ్బ పడింది ఆపరేటర్ మీదనే. సెట్ టాప్ బాక్సులు కొనిపించటానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి సరిపుచ్చుకుంటే వినియోగదారులకు నచ్చజెప్పటానికి వెయ్యిరెట్లు ఆపరేటర్ కష్టపడితేనే అది సాధ్యమైంది. క్షేత్ర స్థాయి కష్టాలు తెలియని ట్రాయ్ కేవలం కార్పొరేట్ ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు, డిటిహెచ్ ఆపరేటర్లు చెప్పినమాట విని కేబుల్ ఆపరేటర్లకు, స్వతంత్ర ఎమ్మెస్వోలకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు మౌనంగా భరించినవాడు కేబుల్ ఆపరేటర్. క్షేత్ర స్థాయి సమస్యలు తెలియకపోవటమే కాదు, డిజిటైజేషన్ మీద ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లోనూ కేబుల్ ఆపరేటర్ కు స్థానం లేదు. ఇది చాలు కేబుల్ ఆపరేటర్ కు న్యాయ జరగలేదని చెప్పటానికి.

డిజిటైజేషన్ తరువాత కేబుల్ ఆపరేటర్ల కష్టాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు.  ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కేబుల్ రంగం మీద ఆధారపడి  దాదాపు 60 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని వీరిని గుర్తించిన దాఖలాలు లేవు. దీన్ని ఒక పరిశ్రమగా గుర్తించినా కొన్ని రుణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆ పాటి సానుభూతికిమ్ కూడా ఈ పరిశ్రమ నోచుకోలేదు. ఈరోజు ధనవణ్తులు, పేదవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఇంటా వినోదం, సమాచారం అందుతున్నదంటే అది  కేబుల్ ఆపరేటర్ నిరంతర కృషి ఫలితమే.

కేంద్రం రైట్ ఆఫ్ వే ద్వారా కేబుల్ వేసుకునే అవకాశం కల్పించి సాయం చేయాలని ప్రయత్నించినా, రాష్ట్రాలు మాత్రం పోల్ టాక్స్ అంటూ విద్యుత్ స్తంభాలు వాడుకున్నందుకు ఫీజులు వసూలు చేయటానికే మొగ్గు చూపుతున్నాయి. ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కుంటూ కూడా సేవలు అందించటానికి ఎప్పుడు వెనుకాడని వాడు కేబుల్ అపరేటర్. ఎండయినా, కుండపోత వానైనా, వడగాలైనా, సుడిగాలైనా, కరోనా కాటేస్తానంటున్నా, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ జనం కళ్లార్పకుండా చూసే టీవీకి తానే ఒక కనురెప్పగా తయారై ఇంటింటి నేస్తంగా మారినవాడు మన  కేబుల్ ఆపరేటర్.

ఎన్ని సేవలందించి ఎన్ని మన్ననలందుకున్నా, విధి నిర్వహణలో ఏ మాత్రం ఏమరుపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నదే కేబుల్ ఆపరేటర్ సోదరులకు నా విజ్ఞప్తి. వర్షాకాలంలో కేబుల్ ఆపరేటర్ మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 11kv, ఆపైన హెవీ లైన్స్ పోల్స్ కు షార్ట్  సర్క్యూట్ అయితే సబ్ స్టేషన్లలో ట్రిప్ అవుతాయి. సింగల్ ఫేజ్ లైన్స్,  త్రీ ఫేజ్ లైన్స్ పోల్స్ కు షార్ట్ సర్క్యూట్ అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెక్ట్  గేజ్ ఫ్యూజ్ ఉంటే కట్ అవుతుంది. హెవీ గేజ్ ఫ్యూజ్ వేస్తే ఫ్యూజ్ కట్ కాదు. కట్ కాకపోతే కరెంట్ పోల్ కి కరెంటు సరఫరా అవుతుంది కాబట్టి  పోల్ ని మనము తాకే వరకూ తెలియదు. కాబట్టి పోల్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టర్ తో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేబుల్ మిత్రులకు మరో మారు విజ్ఞప్తి చేస్తున్నా.

ఇప్పటికైనా ప్రభుత్వాలు కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మల్టీ సర్వీస్ కేబుల్ ఆపరేటర్ల సంఘం తరఫున కోరుతున్నాను. ఈరోజు ఆగస్టు 21న  కేబుల్ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా  ఆపరేటర్ సోదరులందరికీ నా తరఫున, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ తరఫున శుభాభినందనలు.

ఎం. సుభాష్ రెడ్డిఎండీ,

బ్రైట్ వే కమ్యూనికేషన్స్

అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మల్టీ సర్వీస్ కేబుల్ ఆపరేటర్ల సంఘం

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here