వికారాబాద్ వేదికగా రిలయెన్స్ జియోపై ’కేబుల్’ గర్జన

0
573

కేబుల్ ఆపరేటర్లు,స్వతంత్ర ఎమ్మెస్వోలు ఇచ్చిన పిలుపుతో వందల సంఖ్యలో కేబుల్ రంగ ప్రతినిధులు తరలి వచ్చి జియో విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలతో వికారాబాద్ దద్దరిల్లింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చి పట్టణంలో నిర్వహింది, బహిరంగ సభ జరిపి, కలెక్టర్ కి మెమొరాండం ఇవ్వటం ద్వారా నిరసన తెలియజేశారు. రిలయెన్స్ సంస్థ తన కేబుల్ వ్యాపార వైఖరిని మార్చుకోకపోతే మొత్తంగా రిలయెన్స్ ఉత్పత్తులనే బహిష్కరిస్తామనే హెచ్చరికతో ఉద్యమం ముందు ముందు ఎలా ఉండబోతున్నదో రిలయెన్స్ జియో కి తెలియజెప్పారు.
వికారాబాద్ సమస్యను ప్రస్తావిస్తూనే ఇలాంటి పరిస్థితి ఇంకెక్కడ ఎదురైనా సహించేది లేదని తెలుగు రాష్ట్రాల స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జె ఎ సి) వికారాబాద్ వేదికగా స్పష్టం చేసింది. వ్యాపారంలోనూ నీతి ఉండాలన్న సూత్రానికి కట్టుబడనందువల్ల రిలయెన్స్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించింది. ఉత్తుత్తి ఆఫర్లు తాత్కాలికమని, కొద్దినెలల్లో ధరలు పెంచే వ్యూహంతోనే ఈ తగ్గింపు ధరలు ఉంటాయని చెబుతూ ఇలాంటి మోసాలకు బలికావద్దని ఈ సందర్భంగా ప్రజలకి జె ఎ సి విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జె ఎ సి) ప్రశ్నిస్తున్న అంశాలివి:
• పైకి గుత్తాధిపత్యంలా కనబడకుండా హాత్ వే, జిటిపిఎల్, జియో సంస్థలు వేరువేరుగా మార్కెట్లోకి వచ్చి మార్కెట్ ను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి అన్నీ రిలయెన్స్ యాజమాన్యంలోనివే. ఇలాంటి దొడ్డి దారి వ్యాపారం కాకుండా నేరుగా వాటి మధ్య సంబంధాన్ని ఎందుకు ప్రకటించటం లేదు?
• స్థానిక కేబుల్ ఆపరేటర్లతో కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని మొదట్లో హామీ ఇచ్చిన జియో ఇప్పుడు తన సొంత భాగస్వాముల పేర్లతో వచ్చి, అసాంఘికశక్తులను డమ్మీ ఆపరేటర్లుగా చేసి స్థానిక కేబుల్ ఆపరేటర్లను దెబ్బతీయటం అనైతికం కాదా?
• తాత్కాలిక ఆఫర్లతో ప్రజలను మభ్యపెట్టటమెందుకు? ఎక్కడికక్కడ రకరకాల కుయుక్తులతో రకరకాల ఆఫర్లతో మార్కట్లోకి రావటం రిలయెన్స్ జియో కుట్రకు నిదర్శనం కాదా? జాతీయ స్థాయిలో వ్యాపారం చేసేటప్పుడు దేశమంతటా ఒక స్పష్టమైన విధానం ప్రకటించి నడుకోకపోవటంలోనే మీకు నిజాయితీ లేదని అర్థం కావటం లేదా?
• మీ సంస్థ కుయుక్తులను, కుటిల వ్యూహాలను కేబుల్ ఆపరేటర్లు, ప్రజలు గమనించటం లేదని, గ్రహించగలిగే స్థితిలో లేరని అనుకోవటం మీ అతి తెలివికి నిదర్శనం కాదా?
ఇవన్నీ రిలయెన్స్ జియో సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు. నిజానికి జియో దగ్గర సమాధానాలు లేవు. వాళ్ల కుట్రలు, వాళ్ళ వ్యాపార విధానం వాళ్ళకు తెలుసు. అందుకే సంఘటితంగా ఎదుర్కోవాలని కేబుల్ రంగం నిర్ణయించుకుంది. తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది.
• రిలయెన్స్ జియో, హాత్ వే, జిటిపిఎల్ సంస్థల మధ్య ఎలాంటి సంబంధముందో స్పష్టంగా వెల్లడించాలి. జియో పెట్టుబడులతోనే ఆ రెండు సంస్థలు కూడా నడుస్తున్నాయో లేదో చెప్పాలి. ఏ కేబుల్ సంస్థలో ఎంత వాటా ఉన్నదో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది.
• నిజంగా ఎంతో కాలంగా వ్యాపారంలో ఉన్న కేబుల్ ఆపరేటర్ ను కాదని డమ్మీల ద్వారా కేబుల్ వ్యాపారంలో అయోమయం సృష్టించాలనుకుంటే సహించే ప్రసక్తే లేదు. స్థానిక కేబుల్ ఆపరేటర్ల వ్యాపారానికి విఘాతం కలిగించకుండా, కలిసి వ్యాపారం చేస్తామన్న మొదటి వాగ్దానానికి కట్టుబడాలి.
• తాత్కాలిక ఆఫర్లతో ఒక్కోచోట ఒక్కో విధానం అమలుచేసి ప్రజలను మభ్యపెడుతున్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఇకమీదట ఇలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడబోమని ప్రకటించాలి.
• జియో తన వైఖరి మార్చుకోకపోతే అన్ని రిలయెన్స్ ఉత్పత్తులు, సేవలను ఆరు లక్షలకు పైగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోల కుటుంబాలు బహిష్కరిస్తాయి. ప్రజలందరికీ రిలయెన్స్ తీరు పట్ల అవగాహన కల్పించి మా ఉద్యమానికి మద్దతుగా రిలయెన్స్ ను బహిష్కరించవలసిందిగా పిలుపునిస్తాం.
కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు జనవరి 27 బుధవారం నాడు చేపట్టిన చలో వికారాబాద్ కార్యక్రమం ఈ వ్యాపారంలో ఉన్న ఐకమత్యాన్ని చాటింది. దశాబ్దాల తరబడి ఈ వ్యాపారంలో ఉన్నవారిని తప్పించాలని చూస్తే సహించబోమని, ఉమ్మడిగా ఎదుర్కుంటామని సంకేతాలు పంపింది. రిలయెన్స్ ఇప్పుడు నిజాయితీగా వ్యాపారం చేసుకోవటం తప్ప మరో మార్గం కనబడటం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here