కొత్త టారిఫ్ ఆర్డర్ మీద తీర్పుకోసం బ్రాడ్ కాస్టర్ల లేఖ

0
671

సవరించిన టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) మీద వీలైనంత త్వరగా తీర్పు వెలువరించాలని బ్రాడ్ కాస్టర్లు బొంబాయ్ హైకోర్టుకు విన్నవించారు. సెప్టెంబర్ –అక్టోబర్ మాసాల్లో ఈ కేసు విషయమైన సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయని, తీర్పును రిజర్వ చేస్తూ హైకోర్టు అక్టోబర్ 20 న ప్రకటించించని బ్రాడ్ కాస్టర్లు హైకోర్టుకు రాసిన ఈ లేఖలో గుర్తు చేశారు. 2020 జనవరి 1న ట్రాయ్ ప్రకటించిన కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు ప్రక్రియ అలా నిలిచిపోవటంతో 2019 లో అమలైన ధరలే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి.
నిజానికి ట్రాయ్ కూడా ఈ కేసులో తీర్పు త్వరగా వెలువరించాల్సిందిగా ఫిబ్రవరి చివర్లో హైకోర్టును కోరటం గమనార్హం. ఈ మధ్య కాలంలో టాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ పదవీ విరమణ చేయటం, కొత్త చైర్మన్ గా పిడి వాఘేలా నియమితులు కావటం తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ విషయంలో తీర్పు రావటం అవసరమని భావించారు. యావత్ పరిశ్రమకు మేలు చేసే ఈ తీర్పు వెలువడితే మరిన్ని చర్యలకు, చందాదారులకు న్యాయం చేయటానికి వీలుకలుగుతుందని భావిస్తున్నారు.
బ్రాడ్ కాస్టర్లు తమ పే చానల్స్ ధరల నిర్ణయంలోను, వాటిని బొకేలుగా రూపొందించటంలోనూ చందాదారుల ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకొలేదని భావించిన ట్రాయ్ జనవరి1, 2020 నాడు రెండో సవరించిన టారిఫ్ ఆర్డర్ ను ప్రకటించింది. దీనిప్రకారం బ్రాడ్ కాస్టర్లు తమ చానల్స్ ను బొకేలో పెట్టదలచుకున్నప్పుడు బొకే మీద 15% మించి డిస్కౌంట్ ఇవ్వటానికి వీల్లేదని ట్రాయ్ తేల్చి చెప్పింది. అయితే బ్రాడ్ కాస్టర్లు ఉమ్మడిగా ఈ కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో) 2.0 ను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఫిబ్రవరి నెల అంతా వాదోపవాదాలు జరగగా మార్చి 4 న తీర్పు రిజర్వ్ అయింది. అయితే, ఆ వెనువెంటనే లాక్ డౌన్ అమలు కావటంతో ఈ వ్యవహారం పెండింగ్ లో ఉండిపోయింది.
తీర్పు కోసం జూన్ 15న ట్రాయ్ ఒక పిటిషన్ వేసింది. వెంటనే అమలు చేయాలని బ్రాడ్ కాస్టర్లను ఆదేశించగా వాళ్ళు ప్రతిఘటించారు. బ్రాడ్ కాస్టర్లకు బొంబాయ్ హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. తొందరపడి చర్య తీసుకోవద్దని టాయ్ కి చెప్పింది. మళ్లీ సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో తుది విచారణ జరిగింది. ఇరువర్గాలూ తమ వాదనలు వినిపించాయి. ఈ సవరణ పూర్తిగా ప్రజలకు మేలు చేయటానికేనని ట్రాయ్ వాదించింది. అయితే ధర నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోవటం ద్వారా పరిశ్రమలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నదంటూ బ్రాడ్ కాస్టర్లు ట్రాయ్ మీద విరుచుకు పడ్డారు. ఇరుపక్షాల వాదనలూ పూర్తయ్యాక తీర్పు వాయిదాపడింది. ఈ తీర్పు కోసం బ్రాడ్ కాస్టర్లు, ట్రాయ్ ఎదురుచూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here