పోల్ టాక్స్ మీద బ్రైట్ వే పిటిషన్: హైకోర్ట్ స్టే

0
3099

కేబుల్ ఆపరేటర్లను పోల్ టాక్స్ కట్టాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులు పంపిన నోటీసులమీద తెలంగాణ హైకోర్ట్ స్టే విధించింది. శుభోదయ కమ్యూనికేషన్స్ ( బ్రైట్ వే) సహా మెదక్ జిల్లాకు చెందిన కొందరు కేబుల్ ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ రోజు విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర దక్షిణమండల విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సహా పలువురు అధికారులకు షో కాజ్ నోటీస్ జారీచేస్తూ కేసు విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదావేసింది.
కేబుల్ ఆపరేటర్లు డిస్కం పోల్స్ వాడుకుంటున్నందుకు ఒక్కో స్తంభానికి ఏకమొత్తంగా 50 రూపాయలతోబాటు ప్రతినెలా రూ.15 చొప్పున చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీచేయటంతో ఇది చట్టవిరుద్ధమనికేబుల్ టీవీ నెట్ వర్క్స్ చట్టంలోని సెక్షన్ 4బి ని ఉల్లంఘించటమేనని, అదే సమయంలో రాజ్యాంగంలోని 14, 22వ అధికరణలకు విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రీ ఎ. తులసీరాజ్ గోకుల్ వాదించారు. రైట్ ఆఫ్ వే (ఆర్ వో డబ్ల్యు) నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్లు దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి తదుపరి విచారణను ఏప్రిల్ 6 కు వాయిదావేస్తూ అధికారులకు నోటీసులు జారీచేశారు.
శుభోదయ కమ్యూనికేషన్స్ ( బ్రైట్ వే), సాయి కేబుల్ నెట్ వర్క్ తరఫున శ్రీ ప్రణవ్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర కేబుల్ నెట్ వర్క్ తరఫున శ్రీ రవి కిరణ్, బ్రైట్ వే కమ్యూనికేషన్స్ తరఫున శ్రీ సుభాష్ రెడ్డి, శ్రీ మల్లికార్జుక కేబుల్ నెట్ వర్క్ తరఫున శ్రీ సండ కొమరయ్య, శ్రీనివాస్ కేబుల్ నెట్ వర్క్ తరఫున శ్రీ జె శ్రీనివాస్, వినాయక ఎంటర్ ప్రైజెస్ తరఫున శ్రీ డి. వెంకట్రామ్ రెడ్డి, ముత్యాలమ్మతల్లి కేబుల్ నెట్ వర్క్ తరఫున శ్రీ బండారి అశోక్, రాజ్ కేబుల్ నెట్ వర్క్ తరఫున శ్రీ మోత్కు రమేశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో ప్రతివాదులైన విద్యుత్ రంగ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కి, తెలంగాణ రాష్ట్ర దక్షిణమండల విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కు, టిఎస్ ఎస్ పిడిసిఎల్ సిజిఎం, సూపరింటెండింగ్ ఇంజనీర్, తూప్రాన్ మండల అసిస్టెంట్ ఇంజనీర్, సంగారెడ్డి అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ తోబాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ఈ విషయమై హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఏప్రిల్ 6 లోగా సమాధానమివ్వాలని ఆ నోటీసులలో న్యాయమూర్తి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here