‘జీ’ దివాలా వార్తల మధ్య ‘సోనీ’తో విలీనానికి దెబ్బ?

0
1740

భారతదేశ తొలి ప్రైవేట్ శాటిలైట్ చానల్ ప్రారంభించిన ఘనత దక్కించుకున్న జీ గ్రూప్ దివాలా తీసినట్టు వచ్చిన వార్త వినోద ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. త్వరలో సోనీలో విలీనమవుతుందని, దానివలన భారత్ లో అతిపెద్ద టీవీ గ్రూప్ గా జీ-సోనీ తయారవుతుందని అందరూ అనుకుంటున్నా సమయంలో ఈ వార్త రావటం కలకలం రేపింది. అయితే ఈ దివాళా వ్యవహారానికి జీ యాజమాన్యం తాత్కాలికంగా తెరదించినా, మార్కెట్లో జరగాల్సిన నష్టం జరిగింది.

ఇంతకీ ఈ సమస్య ఎలా మొదలైందో చూద్దాం. జీ గ్రూప్ లో భాగమైన సిటీ నెట్ వర్క్స్ కు ఇండస్ ఇండ్ బాంకు అప్పు ఇచ్చింది. మొత్తం రూ. 83.1 కోట్ల అప్పు తిరిగి చెల్లించాల్సి ఉండగా తీర్చటంలో సిటీ నెట్ వర్క్స్ విఫలమైంది. దీంతో అప్పు చెల్లించలేని జీ ఎంటర్టైన్మెంట్ సంస్థను దివాలా తీసినట్టు ప్రకటించాలంటూ ఇండస్ ఇండ్ బాంక్ ఎన్ సి ఎల్ టి ముంబయ్ బెంచ్ లో పిటిషన్ వేసింది. దీంతో దివాలా ప్రకటన ప్రక్రియ మొదలుపెట్టటంతో వార్త గుప్పుమంది. జీ ఎంటర్టైన్మెంట్ వాటాలు ఫ్యూచర్స్ లోనూ, ఆప్షన్స్ లోనూ ట్రేడింగ్ జరగకుండా నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ( ఎన్ ఎస్ ఈ) నిషేధం విధించింది. ఈ దివాలా ప్రక్రియ నిలిపివేయాల్సిందిగా కోరుతూ జీ ఎంటర్టైన్మెంట్ సీఈవో పునీత్ గోయెంకా ఎన్ సి ఎల్ టి కి దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ కాస్త ఊరట లభించినా, మార్కెట్లో మాత్రం పెద్ద నష్టమే జరిగింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 27 న ఎన్ ఎస్ ఈ ఆ నిషేధాన్ని తొలగించింది.

ఈ ఏడాది ప్రారంభంతో పోల్చుకుంటే ఫిబ్రవరి 28 నాటికి ఈ ఎంటర్టైన్మెంట్ వాటా ధర దాదాపు 20% పడిపోయింది. దీనికి కారణం ఆ దివాలా నోటీసేనని మార్కెట్లో అందరికీ తెలిసిన విషయమే. దీనికి తోడు నిజంగానే జీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న అభిప్రాయం కూడా మార్కెట్లో వినిపిస్తూ వచ్చింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయం నిరుడు ఇదే సమయంతో పోల్చినప్పుడు తగ్గటం, నికర లాభం 24.3 కోట్లు (92%) తగ్గటం, అప్పు 29.6 కోట్లు (288%) పెరగటం కూడా ప్రధాన కారణాలే. మొత్తంగా జీ ఆర్థిక ఆరోగ్యం మీద ప్రశ్నలు తలెత్తుతూ వస్తున్నాయి.

జీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర ఈ గ్రూప్ ఛైర్మన్ కాగా ఆ కుటుంబం ప్రధానంగా ఈ గ్రూప్ సంస్థల వ్యవహారాలన్నీ నిర్వహిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా కూడా వ్యవహరించిన సుభాష్ చంద్ర తన సంస్థ భవిష్యత్తు ఇబ్బందుల్లో కూరుకు పోతున్నదని గ్రహించటం వల్లనే 2019 లోనే ఎస్సెల్ గ్రూప్ ఆస్తులు చాలా వరకు అమ్మకానికి పెట్టారు. అందులో ఎస్సెల్ ప్రోపాక్ తో బాటు జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఆఖరి అస్త్రంగా సోనీతో విలీనానికి మొగ్గు చూపగా ఆ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ దివాలా ఫిర్యాదు తెరమీదికి వచ్చింది. ఈ కారణంగా వాటా ధర తగ్గటం వలన విలీన ప్రక్రియలో జీ నష్టపోయే ప్రమాదముందని అనుమానిస్తున్నవారు కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here