బ్రాడ్ కాస్టర్లు డిసెంబర్ 16 లోగా కొత్త టారిఫ్ ప్రకటించాలి

0
1681

తాజా మార్గదర్శకాల ప్రకారం బ్రాడ్ కాస్టర్లు డిసెంబర్ 16 లోగా త చానల్స్ గరిష్ఠ చిల్లర ధరలు, బొకే ధరలు ప్రకటించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్ ఆదేశించింది. ఇంతకుముందు ప్రకటించినవారు ఏవైనా మార్పులున్నా, కొత్తగా మళ్ళీ వెల్లడించటానికి కూడా ట్రాయ్ అవకాశం కల్పించింది. ఈ ధరల ప్రకటన తరువాత పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు, ఐపీటీవీ, హిట్స్ ఆపరేటర్లు 2023 జనవరి 1 లోగా రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ప్రకటించాలని కూడా ట్రాయ్ ఆదేశించింది.
గతంలో అనేక విడతలు కోర్టు కేసుల్లో చిక్కుకున్న టారిఫ్ ఆర్డర్, ఆ తరువాత తీర్పు వచ్చినా అమలులో సమస్యలు వచ్చాయి. బ్రాడ్ కాస్టర్లు భారీగా ధరలు పెంచి చందాదారులమీద భారం పెంచిన సంగతి తెలిసిందే. దీనివల్ ల ట్రాయ్ లక్ష్యం నెరవేరకపోగా, చందాదారులమీద అంతకుముందుకంటే ఎక్కువ భారం పడింది. దీంతో ఇరకాటంలో పడ్డ ట్రాయ్ ఈ ప్రతిష్ఠంభనకు తెరదించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రాడ్ కాస్టర్లు, పంపిణీ సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అదే విధంగా కేబుల్ ఆపరేటర్లతో వర్చువల్ సమావేశాలు జరిపి అభిప్రాయాలు సేకరించింది. వీటన్నిటి ఫలితంగా ధరల మీద ట్రాయ్ ఒక నిర్ణయానికొచ్చింది. పాత నియంత్రణకు సవరణలు ప్రతిపాదించింది. దీని ప్రకారం —
ఎ) టీవీ చానల్స్ గరిష్ఠ చిల్లర ధరమీద పరిమితి కొనసాగుతుంది.
బి ) రూ.19 లోపు గరిష్ఠ చిల్లర ధర ఉన్న చానల్స్ మాత్రమే బొకే లో ఉండటానికి అర్హమైనవి.
సి) బ్రాడ్ కాస్టర్ ఒక బొకే తయారు చేస్తే అందులోని చానల్స్ విడి ధరల మొత్తంలో 45% మించి డిస్కౌంట్ ఇవ్వకూడదు.
డి) పే చానల్ ఎమ్మార్పీ మీద బ్రాడ్ కాస్టర్ ప్రోత్సాహకం రూపంలో ఇచ్చే డిస్కౌంట్ ఆ చానల్ అ లా కార్టేలో, బొకేలోనూ మొత్తం చందా మీద ఆధారపడుతుంది.
ఈ నిబంధనలకు అనుగుణంగా బ్రాడ్ కాస్టర్లు కొత్త టారిఫ్ తయారు చేసి డిసెంబర్ 16 లోగా ట్రాయ్ కి ఆర్ ఐ ఒ లు పంపాలి. మిగిలిన నిబంధనలలో ఎలాంటి మార్పూ ఉండదు. చానల్ పేరు, భాష, ఎమ్మార్పీ, బొకేలో మార్పులు కూడా 16 లోపలే తెలియజేయాలి. పంపిణీ సంస్థలు కూడా తమ ధరలను మళ్ళీ తెలియజేయాలి. వాటికి జనవరి 1 వరకు గడువు ఉంది.
రెండో కనెక్షన్ కు ఎన్ సి ఎఫ్ లో 60% డిస్కౌంట్, కనీసం 200 చానల్స్ ప్లస్ 26 డీడీ చానల్స్ ఇవ్వటం లాంటి నిబంధనాలలో ఎలాంటి మార్పూ లేదని కూడా ట్రాయ్ మరోమారు స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here