లాండింగ్ పేజ్ ప్రకటనల ప్రభావం మీద బార్క్ అధ్యయనం

0
394

లాండింగ్ పేజ్ ప్రకటనలమీద అభ్యంతరాలకు తెరదించటానికి బార్క్ ఇప్పుడు రంగంలోకి దిగింది. టీవీ పెట్టగానే కనిపించే చానల్ కు ఎక్కువ ప్రేక్షాకాదరణ ఉంటుందని, దీనివలన కొంతమంది బ్రాడ్ కాస్టర్లు పెద్దమొత్తం చెల్లించి ఈ పద్ధతిలో రేటింగ్స్ పెంచుకుంటున్నారని కొంతకాలంగా టీవీ పరిశ్రమలో ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది డబ్బున్న చానల్ యాజమాన్యాలకు ఒక వరంగా మారిందని, చిన్న చానల్స్ పోటీలో నిలబడలేని పరిస్థితి ఏర్పడిందని ట్రాయ్ కి మొరపెట్టుకున్న బ్రాడ్ కాస్టర్లు ఉన్నారు. ఈ అంశాన్ని పరిశీలించి అధ్యయనం చేయటానికి ఇద్దరు సభ్యుల కమిటీని బార్క్ ఏర్పాటు చేసింది.
దీంతో లాండింగ్ పేజ్ అడ్వరటైజ్ మెంట్స్ ను అనుమతించాలా లేదా అనే ప్రశ్న మొదలైంది. ఇలా ఉండగా ఎమ్మెస్వోలు మాత్రం లాండింగ్ పేజ్ ప్రకటనలు తమ ఆదాయ వనరుల్లో ఒక భాగం కాబట్టి ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని వాదిస్తున్నారు. పోటీలో తట్టుకున్నవారే వ్యాపారంలో నిలవటమన్నది సహజం కాబట్టి బ్రాడ్ కాస్టర్లు ఎవరైనా పోటీపడవచ్చునంటున్నారు. ఆదాయం వచ్చే మార్గాన్ని అడ్డుకోవాలనుకోవటం ట్రాయ్ కి తగదని ఇప్పటికే వారు తెగేసి చెప్పటం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నిజంగా లాండింగ్ పేజ్ వలన ప్రేక్షకాదరణలో తేడాలు వస్తున్నాయా అనే విషయం మీద అధ్యయనం చేయాల్సిందిగా బార్క్ ను ట్రాయ్ కోరింది.
దీంతో బార్క్ కూడా ఈ విషయం మీద దృష్టి సారించింది. దీన్ని అధ్యయనం చేసి ట్రాయ్ కి ఒక నివేదిక సమర్పించాల్సి ఉంది. బార్క్ ప్రేక్షకాదరణ ఆధారంగానే ప్రకటనలు ఇవ్వటం ఆనవాయితీ కాబట్టి ఈ విధంగా రేటింగ్స్ సంపాదించుకోవటాన్ని అడ్డుకోవాలని కొంతమంది బ్రాడ్ కాస్టర్లు నేరుగా కూడా బార్క్ ని సంప్రదించారు. నిజంగా చానల్ ను జనంలోకి తీసుకువెళ్ళటమే లక్ష్యమైతే అలాంటివారు బార్క్ లో వాటర్ మార్కింగ్ కోరుకోకుండా కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకునేలా చూడవచ్చునని బ్రాడ్ కాస్టర్లు సూచించారు. సాధారణంగా కొత్త చానల్స్ ఇలాంటి అవకాశాన్ని వాడుకోవచ్చునన్నది వాళ్ల అభిప్రాయం.
అయితే, చానల్ చూడమని చెప్పటం వరకే లాండింగ్ పేజ్ ప్రకటన పనికొస్తుంది తప్ప విషయం లేకుండా బలవంతంగా చూపించే అవకాశం లేదని ఆ ప్రకటనలను సమర్థించే బ్రాడ్ కాస్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బార్క్ ఈ మొత్తం వ్యవహారాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. లాండింగ్ పేజ్ ప్రకటన పెట్టిన తరువాత, పెట్టకముందు రేటింగ్స్ లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయటంతోబాటు లాండింగ్ పేజ్ చూడగానే ఆ చానల మీదికి దృష్తిపెట్టి చూసే వాళ్ళ లెక్కలు తేల్చటానికి పూనుకుంది. డేటా వాలిడేషన్ క్వాలిటీ ఇనిషియేటివ్ పేరుతో చేపట్టిన విశ్లేషణలో దీనిని కూడా చేర్చింది. దీని ఫలితాల ఆధారంగానే ట్రాయ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అయితే, ట్రాయ్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంసాలు మరికొన్ని ఉన్నాయి. ఒకవేళ లాండింగ్ ప్రకటనలకూ రేటింగ్స్ కూ సంబంధం ఉన్నదనుకున్న పక్షంలో ప్రకటనలిచ్చే చానల్స్ ను రేటింగ్స్ లో లేకుండా చేయవచ్చు. అప్పుడు కొత్త చానల్స్ లేదా, టెలీమార్కెటింగ్ చానల్స్ వంటివి మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. పంపిణీలో కూడా ఉన్న బ్రాడ్ కాస్టర్లు ఇలాంటి ప్రకటనలు ప్రసారం చేయకూదదని మరికొందరు వాదిస్తున్నారు. ఉదాహరణకు సన్ నెట్ వర్క్ వారికి కేబుల్ చానల్స్ తో బాటు డిటిహెచ్ కూడా ఉంది. అదే విధంగా జీ గ్రూప్ వారికి సిటి నెట్ వర్క్స్ తోబాటు డిష్ టీవీ ఉంది. అలాంటి వాళ్లను అడ్డుకోవాలన్నది కూడా మిగిలిన బ్రాడ్ కాస్టర్ల కోరిక.
ఏమైనప్పటికీ లాండింగ్ పేజ్ ప్రకటనలు ఇచ్చే సంస్థలకు గాని, వాటిని చూపించే ఎమ్మెస్వోలకు గాని అభ్యంతరం లేని ఈ సమస్య మీద ట్రాయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోగలదనేది మాత్రం ప్రశ్నార్థకమే. అన్ని కోణాలలో ఆలోచించి, బ్రాడ్ కాస్టర్లు ఎక్కువమంది వత్తిడి చేస్తే అప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. బార్క్ ఇచ్చే నివేదిక ట్రాయ్ నిర్ణయానికి బలం చేకూర్చుతుంది కాబట్టి బార్క్ నివేదిక కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here