“ఆర్ణబ్ బార్క్ మాజీ సీఈవో కు లక్షల్లో ఇచ్చారు”

0
541

ఆర్ణబ్ గోస్వామి తన సంస్థ ఆధ్వర్యంలోని రిపబ్లిక్ టీవీ, రిపబ్లిక్ భారత్ చానల్స్ కోసం బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్ గుప్తాకు లక్షల్లో చెల్లించినట్టు ముంబయ్ పోలీసులు అక్కడి మేజిస్ట్రేట్ కోర్టుకు తెలియజేశారు. ఈ రిమాండ్ అప్లికేషన్ ద్వారా పార్హోదాస్ గుప్తా పోలీస్ కస్టడీ పొడిగింపు కోరగా, 30 వరకు పొడిగించటానికి కోర్టు ఆమోదించింది. ఆర్ణబ్ ఇచ్చిన డబ్బుతో పార్థోదాస్ ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు సమకూర్చుకున్నట్టు, కొన్నింటిని తాము ఆయన ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. దాస్ గుప్తా తన సంస్థ సీవోవో రోమిల్ రామ్ గఢియాతో కుమ్మక్కై రేటింగ్స్ ను తారుమారు చేశారని కూడా రిమాండ్ దరఖాస్తులో చెప్పటం విశేషం.
దాస్ గుప్తా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ఎ ఆర్ జి ఔట్లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన రిపబ్లిక్ టీవీ (ఇంగ్లిష్ న్యూస్) , రిపబ్లిక్ భారత్ ( హిందీ న్యూస్) చానల్స్ కు రేటింగ్స్ ఎక్కువ వచ్చినట్టు చూపారని పోలీసులు కోర్టులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో దాస్ గుప్తా రిపబ్లిక్ చానల్స్ కు మాత్రమే సహకరించారా, ఇంకా మరిన్ని చానల్స్ విషయం లోనూ ఇలాగే వ్యవహరించారా అనే విషయాల్లో స్పష్టత కోసం విచారణ జరపటానికి కస్టడీ పొడిగించాలని పోలీసులు కోరారు.
అయితే, దాస్ గుప్తా తరఫు న్యాయవాది కమలేశ్ ఘుమ్రే ఈ వాదనలు కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. 2016-19 మధ్య కాలంలో దాస్ గుప్తా సీఈవోగా ఉన్నారని, ఆయనకు ఏడాదికి రూ.4 కోట్ల జీతమని చెబుతూ ఇలాంటి అవకతవకలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. పైగా ఆయన కేవలం పర్యవేక్షక బాధ్యతలు మాత్రమే నిర్వహించేవారు తప్ప రోజువారీ అంశాలను పట్టి పట్టి చూసే వీలులేదన్నారు. 2019 నవంబర్ లోనే ఆయన సంస్థకు రాజీనామా చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆయన బార్క్ సీఈవో గా ఉన్న కాలంలోనే బార్క్ పరిశోధన తీరుకు మూడు అంతర్జాతీయ ప్రశంసాపత్రాలు లభించాయన్నారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నవారికంటే ఆ పత్రాలు ఇచ్చినవారికే ఎక్కువ తెలుసునంటూ పోలీసుల తీరును తప్పుబట్టారు.
బార్క్ పనితీరు మీద వెలుపలి సంస్థ ఇచ్చిన నివేదిక ఒకటి తమకు దొరికినట్టు శుక్రవారం నాడే ముంబయ్ పోలీసులు ప్రకటించారు. బార్క్ స్వయంగా ఆ సంస్థ చేత ఆడిట్ చేయించింది. ఆ నివేదిక ప్రకారం బార్క్ అధికారులు ఉద్దేశపూర్వకంగా డేటాను తారుమారు చేసి టైమ్స్ నౌ చానల్ ను నెంబర్ 1 స్థానం నుంచి తొలగించారని తెలుస్తోందని ముంబయ్ జాయింట్ పోలీస్ కమిషనర్ ( క్రైమ్) వెల్లడించారు. ఈ వ్యవహారమంతా 2016-19 మధ్యనే నడిచినట్టు, ఇలాంటి అవకతవకలు కొన్ని ఇంగ్లిష్, తెలుగు న్యూస్ చానల్స్ విషయంలో కూడా జరిగినట్టు ఆడిట్ రిపోర్ట్ ను బట్టి తెలుస్తున్నదన్నారు.
అసలు పోలీసులు ఏ ఆడిట్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారో తెలియటం లేదని పార్థోదాస్ గుప్తా తరఫు న్యాయవాది అన్నారు. ఒకవేళ అలాంటి రిపొర్ట్ ఉంటే, దానికి బార్క్ బోర్డ్ ఆమోదం ఉండాలని, అప్పుడే దానికి విశ్వసనీయత ఉంటుందని వాదించారు. గత కొద్ది నెలల్లొనే దీన్ని తయారు చేసి ఉంటారనిపిస్తోందని కూదా అన్నారు. రిపోర్ట్ ఉండటం నిజమైతే ఇంతకాలం షో కాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. మొత్తం మీద రిమాండ్ నోట్ లోని అంశాలు, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పార్థో దాస్ గుప్తా పోలీస్ కస్టడీని డిసెంబర్ 30 దాకా పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. దాస్ గుప్తా ఈ కుంభకోణంలో అరెస్ట్ అయిన 15వ వ్యక్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here