కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి

0
529

ఈ జనవరి 1 నుంచి అమలు అవుతున్న కొత్త టారిఫ్ ఆర్డర్ ఎన్టీవో 2.0 ను నిలిపి వేయాలని జాతీయ స్థాయిలో కేబుల్ ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల స్థానిక కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రధానికి విజ్ఞప్తి చేసింది. ట్రాయ్ జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ ను నల్ల చట్టంగా అభివర్ణిస్తూ, దీని అమలు వలన దేశంలో కేబుల్ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోతుందని, లక్షలాది కుటుంబాలు వీధిన పడతాయని గుర్తు చేశారు.
సంఘం ఈ మేరకు ప్రధానికి లేఖ రాస్తూ, దాని ప్రతులను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖయకూ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీ పంపింది. ఎన్టీవో 2.0 ని జనవరి 1 నుంచి అమలు చేయాలని ట్రాయ్ ఇప్పటికే చెప్పగా బ్రాడ్ కాస్టర్లు ఈ విషయంలో ఎమ్మెస్వోలమీద వత్తిడి తెస్తున్నారు. దాని ప్రభావం స్థానిక కేబుల్ ఆపరేటర్లమీద, వారి ద్వారా చందాదారులమీద ఉంటుందన్న విషయం ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే మొదటి టారిఫ్ ఆర్డర్ వలన కేబుల్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, చందాదారులను కోల్పోయిందని ప్రధాని దృష్టికి తెచ్చారు. ఇప్పుడు రెండో టారిఫ్ ఆర్డర్ కూడా అమలైతే పరిశ్రమ కోలుకోలేనంత నష్టానికి గురవుతుందని పేర్కొన్నారు.
ట్రాయ్ నిర్ణయం బ్రాడ్ కాస్టర్లకు మాత్రమే మేలు చేస్తున్నదని చెబుతూ, చందాదారులు, స్థానిక ఆపరేటర్లతోబాటు ఎమ్మెస్వోలు కూడా బాగా నష్టపోతారని సంఘం తెలియజేసింది. ట్రాయ్ జారీ చేసిన రెండో టారిఫ్ ఆర్డర్ వలన పే చానల్ చందా ధరలు బాగా పెరిగాయని, దీనివల్ల బ్రాడ్ కాస్టర్లు మాత్రమే లాభపడి చందాదారులు, పంపిణీ వేదికలు నష్టపోయేపరిస్థితి ఏర్పడిందని అఖిల స్థానిక కేబుల్ ఆపరేటర్ల సంఘం పేర్కొంది.
కేబుల్ పరిశ్రమ ఉపాధి కోల్పోకుండా ఉండేలా చూడటానికి, సామాన్యప్రజల మీద కేబుల్ బిల్లు భారం పెరగకుండా చూడటానికి తక్షణమే ఎన్టీవో 2.0 అమలును నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని సంఘం కార్యదర్శి నరేంద్ర బాగ్డీ ఈ లేఖలో ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here