ఎమ్మెస్వోలూ, ఆపరేటర్ల మధ్య ఒప్పందాలు

0
1116

డిజిటైజేషన్ లో అత్యంత కీలకమైన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెస్వో, ఆపరేటర్. బ్రాడ్ కాస్టర్ నుంచి పే చానల్స్ తీసుకోవటానికి ఎమ్మెస్వో ఎన్ని రకాల నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరుకుంటున్నదో ఆపరేటర్ తో కూడా అదే విధంగా వ్యవహరించటం న్యాయం. అక్కడ కోరుకునే హక్కులే ఇక్కడ ఆపరేటర్ కూడా కోరుకుంటాడన్న విషయం ఎమ్మెస్వో గ్రహించాలి. చందాదారులతో నేరుగా లావాదేవీలు జరిపే ఆపరేటర్ కు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవటం తమ బాధ్యతగా ఎమ్మెస్వో గుర్తించాలి. కనెక్షన్ల లెక్క కచ్చితంగా తేల్చే డిజిటైజేషన్ వలన ఆపరేటర్ ఆదాయం బాగా దెబ్బతినబోతోంది. అందుకే ట్రాయ్ చెప్పినట్టు పే చానల్ ఆదాయంలో, ఫ్రీ చానల్స్ ఆదాయంలో కచ్చితమైన వాటా ఇచ్చి తీరాలి. అయితే, వీరిద్దరి మధ్య సంబంధాలు కేవలం న్యాయబద్ధంగా ఉంటాయా లేదా అనే చర్చ కంటే చట్టబద్ధంగా ఉండాలని కోరుకుంటున్న ట్రాయ్ కొన్ని నిబంధనలు తయారుచేసింది.

డిజిటైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో కేబుల్ అపరేటర్లు, ఎమ్మెస్వోలు పాటించాల్సిన విధి విధానాలమీద ట్రాయ్ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. డిజిటైజేషన్ పూర్తయిన చోట చందాదారుల విషయంలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులను పాటించదగినవి, పాటించదగనివి అంటూ ఒక జాబితాను రూపొందించింది.
(ఎ) ఎమ్మెస్వోలు., ఆపరేటర్లు తమ చందాదారుల విషయంలో చేయదగినవి, చేయకూడనివి:
చేయదగినవి:

  1. చందాదారుని/వినియోగదారుని ఇంటికి వెళ్ళే మీ ప్రతినిది తప్పనిసరిగా గుర్తింపుకార్డు ధరించి ఉండేట్టు చూడాలి
  2. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ ( DAS) ద్వారా కేబుల్ టీవీ కనెక్షన్ తీసుకున్న చందాదారునికి వినియోగదారుని దరఖాస్తు పత్రం ( CAF) కచ్చితంగా అందేటట్టు చూడాలి. అందులో మొత్తం ఉచిత చానల్స్ జాబితాతోబాటు పే చానల్స్ జాబితా, ఒక్కో చానల్ నెలవారీ చందా, పాకేజీలవారీగా చానల్స్ చందాలు ప్రస్తావించాలి.
  3. వినియోగదారుడు నింపినదరఖాస్తు ఒక కాపీని వినియోగదారునికి అక్కడికక్కడే ఇవ్వాలి. దానివలన తాను ఏయే చానల్స్ కు చందా కట్టినదీ ఎప్పటికప్పుడు సరిచూసుకోవటానికి వీలు కలిగించినట్టవుతుంది.
  4. కనెక్షన్ ఇస్తున్న సమయంలోనే ఆచరణ విధివిధానాల పత్రం ( Manual of Practice ) చందాదారునికి ఇవ్వాలి.
  5. చందాదారుడు ఎప్పుడైనా తన కనెక్షన్ ను సరెండర్ చేయాలనుకుంటే అందుకు వెసులుబాటు కల్పిస్తూ సరెండర్ దరఖాస్తు ఇవ్వాలి.
  6. వినియోగదారుడికి సెట్ టాప్ బాక్స్ ఇవ్వటానికి ఉండే షరతులు, నిబంధనలు స్పష్టంగా వివరించాలి. ధర విషయంలో ఉన్న రకరకాల అవకాశాలను కూడా తెలియజేసి సొంతగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, అవకాశం ఇవ్వాలి.
  7. కనెక్షన్ ఇచ్చేటప్పుడే మీ స్కీముల వివరాలు, షరతులు, నిబంధనలు వినియోగదారునికి వివరించాలి
  8. చానల్స్ చందాల విషయంలో వర్తించే చిల్లర ధర, బొకేల రూపంలో ఇచ్చినప్పుడు వర్తించే ధర తదితర వివరాలన్నీకనెక్షన్ ఇచ్చేటప్పుడే వినియోగదారునికి పూర్తిగా అర్థమయ్యేటట్టు తెలియజేయాలి.
  9. వినియోగదారునికి ప్రతిసారీ బిల్లు, చెల్లించిన మొత్తానికి రశీదు ప్రతి చందాదారునికీ ఇచ్చి తీరాలి. అది సెట్ టాప్ బాక్స్ కొన్నప్పుడు దాని ఖరీదుకూ, చానల్స్ కు చెల్లించే నెలవారీ చందాలకూ వర్తిస్తుంది.
  10. చందా మొత్తం అందినట్టు చందాదారునికి ఎలక్ట్రానికి పద్ధతిలో ఎక్నాలెడ్జ్ మెంట్ పంపాలి. అయితే, ఎలక్ట్రానిక్ పద్ధతిలో పంపినంత మాత్రాన రశీదు ఇచ్చినట్టు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. విడిగా రశీదు కూడా వ్యక్తిగతంగా అందజేసి తీరాల్సిందే.
  11. చందాదారుడు చెల్లించిన మొత్తాన్ని విధిగా సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( SMS) లోకి ఎక్కించాలి. ఈ పని కచ్చితంగా ఆ తరువాత బిల్లింగ్ సైకిల్ లోపుగానే జరిగితీరాలి. అప్పుడే చందాదారుడు తాను చెల్లించిన మొత్తాన్ని, తాజా బకాయిని స్పష్టంగా తెలుసుకోగలిగే అవకాశముంటుంది.
  12. ఏదైనా కారణం వలన ఒక పే చానల్ తన ప్రసారాలను అందించటం ఆపేసిన పక్షంలో ఆ చానల్ కు చందా కడుతున్న చందాదారుడి బిల్లునుంచి ఆ మొత్తాన్ని తగ్గించాలి. అయితే, చందాదారుడి అంగీకారంతో ఆ చానల్ స్థానంలో మరో చానల్ ఇచ్చినట్టయితే అప్పుడు మాత్రమే బిల్లు తగ్గించాల్సిన అవసరముండదు.
  13. చందాదారులు తమకు ఏవైనా ఫిర్యాదులున్నా, సమస్యలున్నా వాటి పరిష్కారం కోసం సంప్రదించాల్సిన మీ నోడల్ ఆఫీసర్ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రముఖంగా ప్రచారం చేయాలి. వీలైనంత బాగా అందరికీ తెలిసేలా ప్రాచుర్యం కల్పించాలి.
  14. ఫిర్యాదుల స్వీకరణకు, వాటి పరిశీలనకు వీలుండేలా వెబ్ సైట్ లో కూడా ఏర్పాటు చేయాలి. చందాదారులు కూడా ఫిర్యాదులు చేయటంతోబాటు అవి ఏ స్థితిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు వాళ్ళే స్వయంగా తెలుసుకునేందుకు కూడా అందులో వెసులుబాటు ఉండాలి.
  15. క్రమం తప్పకుండా చందాదారులలో చైతన్యం నింపే కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాలి. సేవల నాణ్యతకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనల మీద అవగాహన కలిగించాలి.
    చేయకూడనివి:
  16. చందాదారుడి వివరాలు, అతడు ఎంచుకున్న చానల్స్ జాబితా (చందాదారు దరఖాస్తు పత్రం ప్రకారం) తదితర అంశాలన్నిటినీ సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లోకి ఎక్కించకముందే సెట్ టాప్ బాక్స్ ను యాక్టివేట్ చేయటం
  17. ఒక చానల్ కు చందాదారుడు చందా చెల్లించి ఉండి ఆ చానల్ ఆ ఎమ్మెస్వో ప్లాట్ ఫామ్ మీద అందుబాటులో ఉన్నప్పటికీ చానల్ ను నిలిపివేయటం
    (బి) డిజిటైజేషన్ లో కేబుల్ టీవీ సర్వీసులు అందించే ఆపరేటర్లు చేయదగినవి, చేయకూడనివి
    చేయదగినవి:
    1.కేబుల్ టీవీ సర్వీసులు ఇవ్వటం మొదలు పెట్టకముందే హెడ్ పోస్టాఫీసులో రిజిస్టర్ చేసుకోవాలి
  18. ప్రతి సంవత్సరం హెడ్ పోస్టాఫీసులో రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవాలి.
  19. ఏ ఎమ్మెస్వో నుంచి సిగ్నల్ అందుకుంటున్నారో అతడితో ఒప్పందం కుదుర్చుకోవాలి
  20. ఆ ఒప్పందం కాపీ ఒకటి దగ్గర ఉంచుకోవాలి
  21. పూర్తిచేసిన చందాదారు దరఖాస్తు ( CAF ) కాపీ ఒకటి దగ్గర ఉంచుకొని మరొకటి ప్రాసెసింగ్ కోసం ఎమ్మెస్వో కు ఇవ్వాలి
  22. ప్రతి ఒక్క చందాదారుడూ చెల్లించిన చందా వివరాలను నిర్ణీత గడువు లోగా ఎమ్మెస్వోకు తెలియజేయాలి
  23. చందాదారుడు కనెక్షన్ ను సరెండర్ చేయాలనుకున్నప్పుడు ఆ మేరకు దరఖాస్తు ఇస్తే తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేయటం కోసం ఎమ్మెస్వోకు అందజేయాలి
    చేయకూడనివి :
  24. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కేబుల్ టీవీ సర్వీసు అందించటం. ఇది చట్టవిరుద్ధం
  25. ఎమ్మెస్వోలతో సరైన ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్లు లేకుండా చందాదారులకు కేబుల్ టీవీ సిగ్నల్స్ అందించటం
  26. నిలిపివేతకు నిర్దిష్టమైన కారణాలు పేర్కొంటూ 21 రోజులు ముందుగానే ఎమ్మెస్వోకు నోటీసు ఇవ్వకుండా కేబుల్ సిగ్నల్ ప్రసారాలు నిలిపివేయటం.
  27. ప్రస్తుతమున్న ఎమ్మెస్వోనుంచి తప్పుకోవటానికి ముందు చందాదారుడు ఇచ్చిన సరెండర్ దరఖాస్తును ఎమ్మెస్వోకు ఇచ్చి, ప్రాసెస్ చేయటం పూర్తి కాకముందే మరో ఎమ్మెస్వో కు ఆ చందాదారుడి దరఖాస్తును పంపటం. కొత్త ఎమ్మెస్వో సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎమ్ ఎస్ ) లో నమోదు కాకముందే కొత్త సెట్ టాప్ బాక్స్ ను యాక్టివేట్ చేయటం
    (సి) డిజిటైజేషన్ ద్వారా కేబుల్ సర్వీసులందించే ఎమ్మెస్వోలు చేయదగినవి, చేయకూడనివి
    చేయదగినవి:
  28. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ దగ్గర డిజిటల్ ఎమ్మెస్వోగా రిజిస్టర్ చేసుకోవటం
  29. ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది ఆపరేటర్ల ద్వారా కేబుల్ టీవీ సేవలందిస్తున్న పక్షంలో ఆయా ఆపరేటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవటం
  30. ఆ ఒప్పందం ప్రతిని సంతకమైన 15 రోజుల్లోగా కచ్చితంగా ఆపరేటర్ కు అందజేయాలి. అలా ముట్టినట్టు రశీదు కూడా తీసుకోవాలి
  31. ఒప్పందంలోని షరతులు, నిబంధనలు ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఉండేట్టు చూసుకోవాలి
  32. ఆ ఒప్పందంలో అది అమలులోకి వచ్చే తేదీని, ముగిసే తేదీని స్పష్టంగా పేర్కొనాలి
  33. ఆ ఒప్పందంలో ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల బాధ్యతల జాబితా, ఒప్పుకున్న ఆదాయ పంపిణీ విధానం, ఆపరేటర్ల ద్వారా అందిన వినియోగదారుల ఫిర్యాదులను అప్ లోడ్ చేసే విధానం, ఆ ఫిర్యాదులను పరిష్కరించే విధానం ఉండాలి.
  34. ఇంటర్ కనెక్షన్ ఒప్పందంలో వివాదాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాలు కూడా ఉండేట్టు చూసుకోవాలి.
  35. సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లో సంబంధిత డేటా చూసే అవకాశం ఆయా ఆపరేటర్లకు కల్పించాలి. ఆదాయంలో వాటా పంపిణీకి ఆ సమాచారమే ప్రాతిపదిక కావాలి.
  36. చందాదారుడు సెట్ టాప్ బాక్స్ తీసుకోవటానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల స్కీముల విషయంలో ఆపరేటర్ కు పూర్తి సమాచారం ఇవ్వాలి. అదే విధంగా ఎమ్మెస్వో తన నెట్ వర్క్ లో అందుబాటులో ఉన్న చానల్స్ ధరల విషయం కూడా ఆపరేటర్ కు పూర్తిగా తెలియజేయాలి
  37. ట్రాయ్ నిర్దేశించిన క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రెగ్యులేషన్స్ లో పేర్కొన్న విధంగా తగినన్ని అదనపు సెట్ టాప్ బాక్సులను ఆపరేటర్లకు అందుబాటులో ఉంచాలి. సెట్ టాప్ బాక్స్ సరిగా పనిచేయకపోవటంవల్ల ఏం చందదారుడి సేవలకూ అంతరాయం కలగకూడదు.
  38. ఏదైనా చానల్ సిగ్నల్ విషయంలో తలెత్తి డిస్ కనెక్షన్ కు దారితీసే పరిస్థితి ఉన్నప్పుడు చందాదారులు ఇబ్బందిపడే పరిస్థితి రాకుందా 15 రోజులముందే స్థానికి కనీసం రెండు ప్రముఖ దినపత్రికలలో స్థానిక భాషలోనూ, చానల్స్ లో స్క్రోల్ రూపంలోనూ ప్రచారం చేయాలి.
  39. చందాదారు దరఖాస్తు ఫారాలు, మాన్యువల్ ఆఫ్ ప్రాక్టీస్ తగినన్ని కాపీలు తన పరిధిలోని ఆపరేటర్ల దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. కనెక్షన్లు ఇచ్చేటప్పుడు వినియోగదారులకు ఇవి ఇవ్వటానికి ఆపరేటర్లకు అందుబాటులో ఉండాలి
    చేయకూడనివి :
    1) డిజిటల్ ఎమ్మెస్వోగా సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కేబుల్ టీవీ సర్వీసులు అందించటం. ఇది చట్ట విరుద్ధం
    2) స్థానిక కేబుల్ ఆపరేటర్ తో రాతపూర్వకమైన ఇంటర్ కనెక్షన్ ఒప్పందం లేకుండా సిగ్నల్స్ అందించటం. ఇది చట్ట విరుద్ధం
    3) ముందుగానే యాక్టివేట్ చేసిన సెట్ టాప్ బాక్స్ ను కేబుల్ ఆపరేటర్ కు లేదా చందాదారుకు ఇవ్వటం
    4) సిగ్నల్స్ నిలిపివేయటానికి నిర్దిష్టమైన కారణాలు చూపుతూ 21 రోజులు ముందుగానే నోటీసు ఇవ్వకుండా ఆపరేటర్ కు టీవీ చానల్స్ ప్రసారాలు నిలిపివేయటం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here