పోల్ టాక్స్ రద్దు చేయండి: సి.ఎం. కు కేబుల్ పరిశ్రమ విజ్ఞప్తి

0
2770

కేబుల్ టీవీ పరిశ్రమ ఎంతో కాలంగా ఎదుర్కుంటున్న పోల్ టాక్స్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. విద్యుత్ శాఖ వారి డిస్కమ్ లు కేబుల్ ఆపరేటర్లకు బకాయిల నోటీసులు పంపుతున్నాయి.ప్పుడు అవకాశం దొరికినా కేబుల్ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరేది పోల్ టాక్స్ రద్దు చేయాలనే. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి అందుకు సుముఖత వ్యక్తం చేసి హామీ ఇచ్చినా ఇంకా అది అమలు కాలేదు.
కేంద్ర ప్రభుత్వం కేబుల్ పరిశ్రమకు అవసరమైన కేబుల్స్ వేసుకోవటానికి ప్రభుత్వ ఆస్తులను వాడుకునేలా దారి హక్కు (రైట్ ఆఫ్ వే) కల్పించింది. అందువలన ప్రభుత్వ ఆస్తులు/నిర్మాణాలు ఏవైనా సరే, వాటిమీద కేబుల్ వేసుకోవటానికి అభ్యంతరం చెప్పకూడదు. అయితే, నిర్వహణ పరంగా ఏవైనా సమస్యలుంటే ఆ నిర్వహణ వ్యయాన్ని రాబట్టుకునేందుకు అద్దె రూపంలో వసూలు చేసుకునే అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ శాఖ వారి స్తంభాలమీద కేబుల్స్ వేస్తూ ఇంటింటికీ కేబుల్ ప్రసారాలు అందజేస్తున్నారు. అందుకు గాని విద్యుత్ శాఖ పోల్ టాక్స్ పేరిట నెలకు ఒక్కో స్తంభానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని అద్దెగా నిర్ణయించింది. అయితే, దాదాపు 70 శాతం రాష్ట్రాలు ఈ పోల్ టాక్స్ ను రద్దు చేశాయి. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ కూడా ఆపరేటర్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ రంగం ఈ విషయంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన పోల్ టాక్స్ ప్రకారం ప్రతి కేబుల్ ఆపరేటర్ తాను కేబుల్స్ వేసిన ప్రతి స్తంభానికి హైదరాబాద్ లో అయితే రూ.100, ఇతర నగరాలు, పట్టణాలలో రూ.50, గ్రామాలలో రూ.30 చొప్పున ఏకమొత్తం చెల్లించాలి. ఆ తరువాత నెల నెలా చెల్లింపులు అదనం. హైదరాబాద్ లో ఒక్కో స్తంభానికి నెలకు రూ.20 చొప్పున, ఇతర నగరాలు, పట్టణాలలో రూ.15. గ్రామాలలో రూ.10 చొప్పున చెల్లించాలనే నిబంధన ఉంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వంలోనూ కొనసాగిస్తునారు.
కోర్టు ఏం చెప్పింది?
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ విషయం గతంలో కోర్టు దాకా వెళ్ళింది. అన్ని పన్నులూ విలీనం చేసి జీఎస్టీ విధానం అమలు చేసిన తరువాత మళ్ళీ ఈ పన్ను వసూలు చేయాల్సిన అవసరమేంటని కేబుల్ ఆపరేటర్లు అభ్యంతరం తెలియజేశారు. దీంతో నాలుక కరచుకున్న విద్యుత్ శాఖ అది పన్ను కాదని, జరిమానా (పెనాల్టీ) అని మాట మార్చింది. అయితే, నిబంధన ఉల్లంఘించే వారికి మాత్రమే జరిమానా విధిస్తారని, ఇక్కడ ఏ నిబంధన ఉల్లంఘించారో చెప్పాలని కోర్టు అడిగింది. అదే సమయంలో రైట్ ఆఫ్ వే ఉండటం వలన అది నిబంధనల ఉల్లంఘనకిందికి రాదని కూడా కేబుల్ ఆపరేటర్లు వాదించారు. ఈ విషయంలో తుది తీర్పు వెలువడాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ పోల్ టాక్స్ రద్దు చేయాలని కోరారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ద్వారా ప్రసారాలందించే కేబుల్ ఆపరేటర్లు కూడా విద్యుత్ స్తంభాలమీదనే కేబుల్స్ వేస్తారు. మొత్తానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొన్ని చోట్ల విద్యుత్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం రావటంతో అక్కడి కేబుల్ పరిశ్రమ సంక్షేమ సంఘం న్యాయపోరాటానికి సాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర
ఇక తెలంగాణ విషయానికొస్తే, కేబుల్ పరిశ్రమ తెలంగాణ ఉద్యమకాలంలో ఊరూరా, ఇంటింటా ఉద్యమవాణి వినిపించటంలో కీలపాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని తెలియజెప్పే కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉద్యమ గీతాలను ప్రసారం చేసి చైతన్యం కలిగించటంలో అసాధారణమైన పాత్ర నిర్వహించింది. కొన్ని చానల్స్ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఉద్యమాన్ని సజీవంగా నిలపటంలో కేబుల్ రంగం ఉద్యమానికి అండగా నిలబడింది. అందువల్లనే మిగతా శాటిలైట్ చానల్స్ అన్నీ ఒక ఎత్తు, స్థానిక చానల్స్ మరో ఎత్తు అని ఉద్యమకారులందరూ స్థానిక కేబుల్ చానల్స్ భుజానికెత్తుకున్న తెలంగాణ వాదాన్ని అభినందించారు.
అందువల్లనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోల్ టాక్స్ రద్దు అనే చిన్న కోరికను ప్రభుత్వం ముందుంచారు. ఇది ప్రభుత్వానికి పెద్ద విషయమేమీ కాదు. పైగా, కేబుల్ పరిశ్రమ మీద ఆధారపడి బ్రతుకున్న లక్షలాది తెలంగాణ వాసులకు సాయం చేసినట్టవుతుంది. గతంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించారు. అయితే, అధికారికంగా ఉత్తర్వులు రాకపోవటంతో డిస్కమ్ అధికారులు ఇప్పుడు పాత బకాయిలతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం తన హామీకి కట్టుబడి పోల్ టాక్స్ రద్దుకు ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది.
మద్దతు ఇవ్వండి
ఊరూరా స్థానిక సమాచారాన్ని, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించటంలో కీలకపాత్ర పోషిస్తున్న కేబుల్ రంగానికి అండగా నిలవాలని తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా చైతన్యంలో కేబుల్ పరిశ్రమ పాత్రను గుర్తించి గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా న్యూస్ చానల్స్ అన్నీ ఈ సమస్యమీద దృష్టి సారించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావటంలో తోడ్పడాలని కూడా కోరారు. టీవీ చానల్స్ ప్రసారాలను ఇంటింటికీ చేరవేసే కేబుల్ ఆపరేటర్లు డిజిటైజేషన్ తరువాత ఆర్థిక సమస్యలు మరిన్ని తోడయిన ఈ సందర్భంలో వారిని ఆదుకోవటానికి ఈ పోల్ టాక్స్ రద్దు వ్యవహారం ఎంత ముఖ్యమైనదో గమనించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.
కేబుల్ ఆపరేటర్లు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు, తమ సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవించేందుకు అన్ని మండల కేంద్రాలలో విద్యుత్ కార్యాలయాల వద్ద శాంతియుత ర్యాలీలు జరిపి వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here