తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలకు 20 ఏళ్ళ లైసెన్స్ పొందిన 8కె డిజిటల్ బ్రైట్ వే సర్వీసెస్

0
1175

తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెస్వోలలో ఒకరైన బ్రైట్ వే కమ్యూనికేషన్స్ సంస్థ అధిపతి, తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షుడు శ్రీ సుభాష్ రెడ్డి ఇప్పుడు సొంత లైసెన్స్ తో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా ఇంటర్నెట్ రంగంలో అడుగుపెట్టారు. ఇప్పటికే బి ఎస్ ఎన్ ఎల్ తో కలసి బ్రైట్ వే కమ్యూనికేషన్స్ ద్వారా వ్యాపారం చేస్తుందగా ఇప్పుడు 8కె డిజిటల్ బ్రైట్వే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థ ద్వారా ప్రత్యేకంగా ఇంటర్నెట్ సేవలు అందించాలని నిర్ణయించారు.
కొంతకాలంగా ఈ దిశలో ఆలోచిస్తున్న సుభాష్ రెడ్డి 2020 నవంబర్ 17 నాడే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ( ఐ ఎస్ పి) లైసెన్స్ కోసం కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖలోని టెలీకమ్యూనికేషన్ల విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 22న టెలికామ్ విభాగం ఆమోదం తెలియజేస్తూ సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాల్సింగా కోరింది. ఆ మేరకు అన్ని లాంఛనాలూ పూర్తి చేసుకొని జూన్ 11న ఒప్పందం చేసుకున్నారు.
20 సంవత్సరాలపాటు అమలులో ఉండే ఈ యూనిఫైడ్ లైసెన్స్ వలన 8కె డిజిటల్ బ్రైట్వే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా కేటగిరీ ’బి’ లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ మేరకు ఒప్పందం మీద సంతకాలయ్యాయి. టెలికమ్యూనికేషన్ల విభాగం తరఫున డైరెక్టర్ (టెక్నాలజీ) శ్రీ ఎం. ఈశ్వర్, 8కె డిజిటల్ బ్రైట్వే సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున డైరెక్టర్ శ్రీ ఎం. ప్రణవ్ రెడ్డి సంతకాలు చేశారు.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావటం, కొత్త విషయాలతో అప్ డేట్ కావటంలో ముందుండే శ్రీ సుభాష్ రెడ్డి డిజిటైజేషన్ నాటి నుంచే కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ వ్యాపారం ద్వారా లాభపడాలని పదే పదే చెబుతూ వచ్చారు. డిటిహెచ్ మీద పైచేయి సాధించటానికి బ్రాడ్ బాండ్ అస్త్రాన్ని వాడుకోవాలని కూడా హితవు చెబుతూ వచ్చారు. ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగి ఇంటర్నెట్ సర్వీస్ అందించటానికి రంగంలో దిగారు.
ప్రస్తుత సంక్షోభ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కు డిమాండ్ పెరగటంతో ఉద్యోగులకు ఇళ్లలో ఇంటర్నెట్ అవసరం బాగా పెరిగింది. నగరాలనుంచి చాలామంది ఉద్యోగులు గ్రామాలకు తరలివెళ్ళి అక్కడినుంచి పనిచేయటం ప్రారంభించారు. అందుకే గ్రామాలలో సైతం ఇంటర్నెట్ అవసరం పెరిగింది. మరోవైపు స్కూళ్లు ప్రారంభం కాకపోవటంతో ఆన్ లైన్ పాఠాలమీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది. వీళ్ళకూ ఇంటర్నెట్ తప్పనిసరి అయింది.
ఇక ఎంటర్టైన్మెంట్ రంగంలోనూ వస్తున్న కొత్త ధోరణులలో భాగంగా ఒటిటి వేదికలు పెరగటం వలన ఇంటర్నెట్ వాడకం అనుహ్యంగా పెరిగింది. ఈ అవసరాలు తీర్చటానికి వైర్ లెస్ బ్రాడ్ బాంద్ కంటే వైర్డ్ బ్రాడ్ బాండ్ దాదాపు తప్పనిసరి అయింది. వేగానికి వేగం, ఎక్కువ పరిమాణంలో వాడుకోవటానికి అనుకూలంగా ఉండటం, తక్కువ ఖర్చు అనే అంశాలు ఈ దిశగా అందరినీ వైర్డ్ బ్రాడ్ బాండ్ వైపు ఆకర్షిస్తున్నాయి. ఇంట్లో లేనప్పుడు మాత్రమే మొబైల్ కంపెనీలు అందించే వైర్ లెస్ బ్రాడ్ బాండ్ వాడుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు వీలైనంత వరకూ వైర్డ్ బ్రాడ్ బాండ్ మీద ఆధారపడాలనుకుంటున్నవారి సంఖ్య ఎక్కువ కావటం కూడా ఇప్పుడు ఇంటర్నెట్ కు డిమాండ్ బాగా పెరగటానికి కారణమైంది.
ఇక కేబుల్ ఆపరేటర్ల విషయానికొస్తే, ఇంటింటికీ ఇప్పటికే కేబుల్ సేవలందిస్తూ ప్రజలకు బాగా దగ్గరై ఉందటం వలన వాళ్ల ఆధ్వర్యంలోనే ఇంటర్మ్నెట్ సేవలు కూడా తీసుకోవటానికి జనం మొగ్గు చూపుతున్నారు. కొంతమంది కేబుల్ ఆపరేటర్లు ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్ టి టి హెచ్) కూడా పూర్తి చేసి ఉండటంతో అతి తక్కువ సమయంలో ఈ సేవలు అందించటానికి అవకాశముంది. ఈ పరిస్థితులన్నీ గమనించిన మీదటనే బ్రైట్ వే అధిపతి ఈ రంగంలో అవకాశాలు గుర్తించి అందిపుచ్చుకున్నట్టు అర్థమవుతోంది.
లైసెన్స్ లాంటి లాంచనాలు పూర్తయ్యాయి గనుక త్వరలోనే 8కె డిజిటల్ బ్రైట్ వే సర్వీసెస్ వారి ఇంటర్నెట్ సేవలు ఊరూరా విస్తరిస్తాయని భావిస్తున్నారు. ఒక పేరు మోసిన ఎమెస్వో ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్నెట్ సర్వీస్ కాబట్టి కచ్చితంగా కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే అవకాశముంది. ఇలాంటి అవకాశం ద్వారా డిటిహెచ్ కి దీటైన జవాబు చెప్పగలిగే పరిస్థితిని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటాన్ని ముందు ముందు చూడవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here