యూత్ లో 65% మంది టీవీ కంటే ఒటిటి కే ప్రాధాన్యం

0
552

యువత అత్యధికంగా టీవీకి బదులు ఒటిటి కే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విషయం మనకు చూచాయిగా తెలిసినా, ఇప్పటిదాకా కచ్చితమైన లెక్కలు తెలియవు. ఏ మాత్రం సమయం దొరికినా వినోద కార్యక్రమాలకోసం ఒటిటి వైపు చూస్తున్నారని, లాక్ డౌన్ సమయంలో హఠాత్తుగా పెరిగిన ఈ అలవాటు ఆ తరువాత కూడా తగ్గలేదని ఈ అధ్యయనం తేల్చింది. ఈ చందాదారులసంఖ్య రోజురోజుకూ ఇంకా పెరుగుతూనే ఉంది. దేశమంతటా ఇదే ధోరణి కనబడుతోంది.
డెంట్సుఏజెస్ నెట్ వర్క్ కు చెందిన డేటా సైన్సెస్ డివిజన్ ఈ అధ్యయనం చేసింది. 5 నుంచి 39 ఏళ్ళవరకు ఉన్న యువత టీవీ చూడటం కంటే ఒటిటి లో వినోద కార్యక్రమల మీదనే ఆసక్తి చూపుతున్నట్టు ఆ అధ్యయన ఫలితాల్లో తేలింది. ఒటిటి మీద ఆసక్తి కనబరచే వారిలో ఇతర వయోవర్గాలు కూడా ఉన్నప్పటికీ 5 -39 ఏళ్లవారిలోనే ఈ ధోరణి ఎక్కువగా కనబడింది. అంటే 65 శాతం మంది యువత టీవీ ని వదిలి ఒటిటి వైపు వెళుతోంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఒటిటి మీద ఆధారపడుతున్న యువతరంలోనూ 25-39 వయోవర్గం కంటే 5-25 మధ్య వయోవర్గమే ఎక్కువగా ఉంది.
ఇక సమయం విషయానికొస్తే లాక్ డౌన్ ముందున్ కంటే లాక్ డౌన్ సమయంలోనే ఎక్కువ సమయం ఒటిటి కి కేటాయించారు. లాక్ డౌన్ కి ముందు రోజుకు రెండు నుంచి మూడు గంటలు ఒటిటి కార్యక్రమాలకు కేటాయించిన వారు లాక్ డౌన్ సమయంలో అదనంగా గంటా నలభై నిమిషాలపాటు ఒటిటి లో కార్యక్రమాలు చూశారు. అదే పాతికేళ్ళలోపు వాళ్లయితే నాలుగైదు గంటలకు పైగా చూస్తున్నారు. ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం, మామూలు టీవీలో అది ప్రసారమయ్యే సమయానికి మాత్రమే చూసే వీలుండగా ఒటిటిలో ఎప్పుడు ఏది కావాలంటే అది చూసే అవకాశం ఉండటం యువతకు బాగా నచ్చింది.
వీళ్లలో 60 మంది అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా నెట్ ఫ్లిక్స్ కు చందా కట్టినవాళ్ళే అయి ఉండటం కూడా గమనార్హం. పట్టణ ప్రాంత యువతలో 19 శాతం మందిని డిస్నీ+హాట్ స్టార్ ఆకట్టుకోగలిగింది. అయితే జీ5, వూట్ లాంటి ఒటిటి వేదికలు మాత్రం క్రమంగా పుంజుకుంటున్నాయి. పాతికేళ్ళలోపు వారు ఎక్కువగా కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ తో కూడిన వినోదాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. పాతికేళ్ళనుంచి 39 ఏళ్ళ మధ్యలో ఉన్నవారు మాత్రం థ్రిల్లర్స్ కంటే సైన్స్ ఫిక్షన్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
2026 నాటికి ఒటిటి పరిశ్రమ 45.5 శాతం ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వివిధ ఒటిటి వేదికల మధ్య భాగస్వామ్యాలు, సహకారాలు బాగా పెరుగుతాయని, పే టీవీ చానల్స్ కూడా ఒటిటి వేదికలమీద ఎక్కువగా ఆధారపడటం పెరుగుతుందని విశ్లేషించారు. ఈ ఏడాది చివరికల్లా భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఒటిటి మర్కెట్ గా అవతరించబోతోంది. 2020 ఆఖరు కల్లా యాభై కోట్ల మంది వాడకం దారులు తయారవుతారు. ఈ మార్పును కేబుల్ టీవీ ఆపరేటర్లు గమనించాలి. దీనివలన ఇప్పటికిప్పుడు టీవీ చందాదారులు తగ్గకపోయినా భవిష్యత్తులో అనివార్యం కాబట్టి వాళ్ళకు కావాల్సిన బ్రాడ్ బాండ్ అందిస్తూ వ్యాపారం పెంచుకోవటానికి ప్రయత్నించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here