46 లక్షల ఇళ్ళు పే చానల్ నుంచి ఉచిత చానల్స్ కు బదలీ

0
983

గడిచిన 12-15 నెలల కాలంలో పే టీవీ మార్కెట్లో 46 లక్షల కనెక్షన్లు తగ్గాయని, చందాదారులు ఆ మేరకు ఉచిత చానల్స్ వైపు వలసపోయారని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ గోయెంకా అన్నారు. ప్రధానంగా దీనికి కారణం కరోనా సంక్షోభమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే చందాదారుల సంఖ్యలో తగ్గుదల నమోదయిందన్నారు. మూడవ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన విశ్లేషకులతో మాట్లాడారు.
పే టీవీ నుంచి ఉచిత చానల్స్ కు ఈ విధమైన వలస ఇంకా కొనసాగుతోందన్నారు. ఇది క్రమంగా తగ్గుతున్న ధోరణికి అద్దం పడుతోందని చెప్పారు. గోయెంకా అభిప్రాయం ప్రకారం అయితే, ఉచిత చానల్స్ వైపు చూస్తూ పే చానల్స్ ను పక్కనబెట్టటమన్నది కొనసాగుతూనే ఉంది. పే చానల్ ధరల వల్లనా, లేదంటే సరైన కొత్త కార్యక్రమాలు లేకపోవటం వల్లనా అనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పటం కష్టమంటున్నారు.
కొత్త కంటెంట్ లేకపోవటం కూడా ఒక సమస్యే. అయితే, ప్రధానంగా కరోనా మొదటి వేవ్ సమయంలో నగరాలు, పట్టణాలు అని తేడా లేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అయితే, ఇప్పుడు వాళ్ళందరినీ వెనక్కి రాబట్టటం కష్టమే. నాణ్యమైన కంటెంట్ చౌకగా అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం ఉంది” అన్నారు. పే చానల్ ధర పెంచినంత మాత్రాన ప్రేక్షకులు ఆ చానల్ వదిలేస్తారనుకోవటం లేదన్నారు. కానీ భారతదేశం లాంటి చోట ధర కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందిగనుక బ్రాడ్ కాస్టర్లు ఆచితూచి వ్యవహరించక తప్పదన్నారు.
ఏ వర్గం వారు పే ఛానల్స్ కు దూరమవుతున్నారో కూడా నిర్దిష్టమైన సమాచారం లేదని గోయెంకా చెప్పారు. అయితే, టీవీలో ప్రత్యేకంగా సినిమాలు చూసేవారు వెళ్ళిపోయినట్టు కనిపిస్తోందని, వాళ్ళుకోరుకుంటున్న సినిమాలు చూడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉండటం కూడా అందుకు కారణం కావచ్చునన్నారు. ఎన్టీవో 2.0 విషయంలో అనిశ్చితి తొలగలేదని, ఖరారయ్యాక అమలు చేయటానికి కూడా కనీసం 45 రోజులు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రాడ్ కాస్టర్లు తమ ప్రధాన చానల్స్ ను బొకేల నుంచి తప్పించి ధరలు విపరీతంగా పెంచటం గురించి అడిగినప్పుడు “ ఎవరూ బ్రాడ్ కాస్టర్ల బొకేలు తీసుకోవటం లేదు. పంపిణీ సంస్థలు తయారుచేసిన బొకేలు మాత్రమే తీసుకుంటున్నారు. సొంతగా అ లా కారటే, లేదా బొకేలు ఎంచుకొని తీసుకునేవాళ్ళు చాలా తక్కువ. దాదాపు 95% ప్రేక్షకులు తమ పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు ఇచ్చే బొకేలమీదనే ఆధారపడుతున్నారు” అన్నారు. ఏమైనా, చందాదారులమీద భారం పెరుగుతుందని ఆయన ఒప్పుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here