2021: రేటింగ్స్ లేని న్యూస్ చానల్స్, తేలని టారిఫ్ వివాదం

0
790

కోవిడ్ భయాల మధ్యనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో మొదలైన 2021 వ సంవత్సరం టీవీ రంగం అనేక వివాదాలను చవిచూసింది. ఎంటర్టైనెంట్ చానల్స్ కు ఊహించిన దానికంటే వేగంగానే ప్రకటనల ఆదాయం పెరగటం ఒక కోణమైతే, ఓటీటీ మోజులో లీనియర్ చానల్స్ కు ఆదరణ తగ్గుతూ రావటం ఒక చేదు నిజం. టీవీ పరిశ్రమ భవిష్యత్తును నిర్దేశించటానికి నియంత్రణాసంస్థ ట్రాయ్ చేస్తున్న ప్రయత్నాలు పదే పదే కోర్టుకెక్కటం, అమలులో అయోమయ వాతావరణం నెలకొనటం కూడా ఈ ఏడాదిని కుదిపేసింది. మొత్తంగా అనేక సవాళ్ళ మధ్య టీవీ, ఓటీటీ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాయి.
ఏడాది పొడవునా రేటింగ్స్ లేని న్యూస్ చానల్స్
2020 అక్టోబర్ లో టీవీ రేటింగ్స్ వివాదం తీవ్ర కలకలం రేపింది. నిజానికి రేటింగ్స్ విశ్వసనీయత మీద చర్చ కొత్తదేం కాకపోయినా, ఈ సారి రిపబ్లిక్ టీవీ లాంటి పేరు మోసిన న్యూస్ చానల్ అవకతవకలకు పాల్పడినట్టు ముంబయ్ పోలీసులు గుర్తించటం సంచాలనానికి కారణం. ఆ చానల్ కీలక బాధ్యులను, రేటింగ్స్ లెక్కించే సంస్థ బార్క్ మాజీ సీఈవో ను సైతం అరెస్ట్ చేయటం, వాట్సాప్ సంభాషణలో తీవ్రమైన అంశాలు బైటపడటం దేశవ్యాప్తంగా మరో విడత చర్చకు దారితీశాయి. దీంతో అన్నీ న్యూస్ చానల్స్ కీ రేటింగ్స్ నిలిపివేస్తున్నట్టు బార్క్ ప్రకటించింది.
ఆ విధంగా 2020 సంవత్సరం చివర్లో మొదలైన నిషేధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2021 మొత్తం రేటింగ్స్ లేవు. వివాదాలూ, అభ్యంతరాలూ లేని ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు మాత్రమే రేటింగ్స్ ఇస్తూ న్యూస్ చానల్స్ ను మాత్రమే పక్కనబెట్టటం ఏంటని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కోర్టుకెక్కింది. రేటింగ్స్ అవకతవకల మీద ఇంతగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్న సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తూతూ మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంది. రెండు నెలలకే నివేదిక వచ్చినా ఇంకో పది నెలలపాటు దాని దుమ్ము దులపలేదు. ఎట్టకేలకు తీసి చూస్తే శాంపిల్ సైజు, పారదర్శకత పెంచటం లాంటి సూచనలు తప్ప అందులో చెప్పిందేమీ లేడు.
కోర్టు తేల్చినా కొలిక్కిరాని టారిఫ్ వివాదం
రెండేళ్ళు గడిచినా కొలిక్కిరానిది టారిఫ్ వివాదం. పే చానల్స్ ధరలు భారీగా ఉన్నాయి కాబట్టి సామాన్యుల ప్రయోజనాలే ధ్యేయంగా వాటిని తగ్గించాలని నిర్ణయించుకున్న ట్రాయ్ 2020 జనవరి 1 న… అంటే, సరిగ్గా రెండేళ్ళ కిందట కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) జారీ చేసింది. ధరలు తగ్గిస్తే లాభాలు తగ్గుతాయి గనుక బ్రాడ్ కాస్టర్లు కోర్టు కెళ్లారు. బొంబాయ్ హైకోర్టులో ప్రధానంగా ట్రాయ్ నిర్ణయమే నెగ్గింది. దీంతో బ్రాడ్ కాస్టర్లు సుప్రీంకోర్టుకెళ్ళారు. అక్కడా బ్రాడ్ కాసటర్లకు అనుకూలపరిస్థితి కానరాలేదు.
దీంతో సామాన్య ప్రజలు తమ నెలవారీ చందా దాదాపు రూ.50 వంతున తగ్గవచ్చునని ఆశించారు. కానీ అక్కడే బ్రాడ్ కాస్టర్లు తమ అసలు రూపం బైటపెట్టారు. ప్రధాన చానల్స్ ను బొకే నుంచి తప్పించి భారీగా చందా రేట్లు పెంచేశారు. నిబంధనలను పాటిస్తూనే దొడ్డిదారిన ధర పెంచి ట్రాయ్ ని వెక్కిరించారు. ఫలితంగా, వినియోగదారుల చందా 50 రూపాయలు తగ్గటానికి బదులు 50 రూపాయలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో ట్రాయ్ కి పాలుపోవటం లేదు. పైగా ఇప్పుడు కేబుల్ టీవీ చందాలు పెరిగితే ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలలో అదొక ప్రతికూల అంశంగా మారుతుందన్న ప్రభుత్వ భయం ఉండనే ఉంది. అందుకే నాలుగు నెలలపాటు అమలును వాయిదావేస్తున్నట్టు ప్రకటించి ట్రాయ్ దీనిమీద ఒక కమిటీని వేసింది. మొత్తంగా ఈ వ్యవహారం ఇలా రెండేళ్ళుగా సాగుతూనే ఉంది. కేబుల్ చందా బిల్లు పెరుగుతుందా, తగ్గుతుందా అనేది ఈ ఏడాదైనా తేలుతుందేమో చూడాలి.
విలీనాల పర్వం
టీవీ పరిశ్రమలో రెండు భారీ విలీనాలకు తెరలేపింది కూడా 2021 సంవత్సరమే. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ కలిసిపోవాలని నిర్ణయించుకోవటం టీవీ పరిశ్రమలో పెనుసంచలనానికి కారణమైంది. దేశంలో తొలి స్వదేశీ ప్రైవేట్ చానల్ అయిన జీ టీవీ ఇప్పుడు సోనీతో కలవటం వల్ల వాటి మొత్తం ఛానల్స్ 75 అవుతాయి. . అందులో జనరల్ ఎంటర్టైన్మెంట్, మూవీస్, మ్యూజిక్, కిడ్స్, స్పోర్ట్స్ చానల్స్ తోబాటు వివిధ ప్రాంతీయ భాషల చానల్స్ ఉన్నాయి. ఆ విధంగా భారత్ లో అతిపెద్ద టీవీ చానల్ గ్రూప్ తయారవుతుంది. ప్రేక్షకాదరణ లెక్కల పరంగా చూస్తే 25 నుంచి 30% వాటా ఈ చానల్స్ కే చెందుతుంది. ఇక డిజిటల్ రంగంలోనూ జీ 5, సోనీలైవ్ అనే రెండు ఓటీటీ వేదికలుఇప్పుడు ఒకే గొడుగు కిందికి వస్తాయి. ఇలాంటి గుత్తాధిపత్యాలకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతిస్తుందా అన్న అనుమానం మాత్రం వెంటాడుతోంది.
పంపిణీ సంస్థలలో కీలకమైన డీటీహెచ్ లో సైతం విలీనాలు కొనసాగుతున్నాయి. గతంలో రిలయెన్స్ వారి డీటీహెచ్ వేదిక బిగ్ టీవీ ని కొనుగోలు చేసిన సంస్థ ఇండిపెండెంట్ టీవీ పేరుతో ఆ డీటీహెచ్ ని నడపటానికి ప్రయత్నించినా, కొద్ది కాలానికే మూసేసింది. జీ గ్రూప్ వారి డిష్ టీవీ మరో డీటీహెచ్ వేదికైన వీడియో కాన్ ను కొనుగోలు చేసింది. దీంతో ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్ల సంఖ్య 4 కు తగ్గింది. కానీ ఇప్పుడు డిష్ టీవీ, ఎయిర్ టెల్ డీటీహెచ్ వేదికలు కలసి పోవాలని నిర్ణయించుకున్నాయి. వీటి మొత్తం వాటా 50 శాతం దాటిపోతుంది. విలీనం తరువాత ఈ ఉమ్మడి సంస్థతో బాటు టాటా స్కై, సన్ డైరెక్ట్ మాత్రమే రంగంలో ఉంటాయి.
ఫ్రీడిష్ మీద ఫిర్యాదులు
మొదటిసారిగా ప్రసార భారతి వారి డీడీ ఫ్రీడిష్ మీద ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్వయంగా ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లు ఈ ఫిర్యాదు చేయటం విశేషం. అది కూడా బ్రాడ్ కాస్టర్రలనే టార్గెట్ చేయటం మరీ విశేషం. ఫ్రీడిష్ కి ఉచితంగా ఇస్తున్న ప్రసారాలను ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కు మాత్రం పే చానల్స్ రూపంలో ఇవ్వటం వివక్ష కిందికే వస్తుందని డీటీహెచ్ ఆపరేటర్లు ఆరోపించారు. డిజిటైజేషన్ నిబంధనల ప్రకారం సామాన్య వకాశాలు కల్పించి అందరూ సమానంగా పోటీ పడేట్టు చేయాల్సి ఉండగా ఇలా ఫ్రీడిష్ కు అనుకూలంగా వ్యవహరించేట్టు చూడటం, ట్రాయ్ ఈ విషయాన్ని పట్టించుకొకపోవటం దారుణమని వారు వ్యాఖ్యానించారు. అయితే, ప్రసార భారతి పరిధిలోని చానల్స్ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం లేని ట్రాయ్ ఇప్పుడు తన పరిధిలో లేని ఫ్రీడిష్ మీద నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే బ్రాడ్ కాస్టర్లమీద ఆంక్షలు విధించటం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతుందా అన్నది తేలాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here